తెలంగాణ సీఎం టూర్... పెట్టుబ‌డుల‌తో రాక‌..!

తాజాగా పెట్టుబ‌డులు యాత్ర‌ను ముగించుకుని సీఎం రేవంత్ బృందం హైద‌రాబాద్‌కు తిరిగి చేరుకుంది.

Update: 2024-08-14 11:30 GMT

కొన్ని ఆలోచ‌న‌లు.. గంపెడు పెట్టుబ‌డుల‌ను మోసుకురావ‌డం అంటే ఇదే! తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత‌రెడ్డి చేసిన ప్ర‌యోగం.. విశేషంగా ఆక‌ర్షిస్తోంది. అమెరికాలో దాదాపు వారం రోజులు, ద‌క్షిణ కొరియా లో నాలుగు రోజుల పాటు మ‌కాం వేసి మ‌రీ తెలంగాణ‌లో పెట్టుబ‌డులు రాబ‌ట్టేందుకు చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించింది. ఒక ముఖ్య‌మంత్రిగా సుదీర్థ కాలం(అది వార‌మే అయినా) విదేశాల్లో ప‌ర్య‌టించి.. పెట్టుబ‌డు లు ఆక‌ర్షించిన ముఖ్య‌మంత్రిగా రేవంత్ పేరు తెచ్చుకున్నారు.

తాజాగా పెట్టుబ‌డులు యాత్ర‌ను ముగించుకుని సీఎం రేవంత్ బృందం హైద‌రాబాద్‌కు తిరిగి చేరుకుంది. శంషాబాద్ విమానాశ్ర‌యంలో వీరికి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఇక‌, బుధ‌వారం సాయంత్రం కాగ్నిజెంట్ సెంట‌ర్‌ను కూడా ఆయ‌న ప్రారంభించారు. అయితే.. ముఖ్య‌మంత్రులు విదేశీ ప‌ర్య‌ట‌న చేయ‌డం కొత్త కాదు. కానీ, ఇవి సంద‌ర్భాను సారంగా ఉంటాయి. కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం సంద‌ర్భాన్ని సృష్టించుకుని విదేశాల‌కు వెళ్లారు. పెట్టుబ‌డులు పెట్టేవారు.. స‌హ‌జంగా జూలై-సెప్టెంబ‌రు మాసాల్లో త‌మ వ్యాపారాల‌ను విస్త‌రిస్తారు.

ఈ స‌మ‌యంలో వారికి అందివ‌చ్చిన దేశానికి వెళ్తారు. అయితే..వారు రాక‌ముందే.. రేవంత్ మేమున్నామం టూ.. వారిని క‌లుసుకుని.. తెలంగాణ‌లో ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితులు. పెట్టుబ‌డుల‌కు ఉన్న సానుకూల వాతావ‌ర‌ణం, స‌ర్కారు త‌ర‌ఫున తాము అందించే సాయాల‌ను పూస గుచ్చిన‌ట్టు వివ‌రించారు. దీనికి తోడు రాష్ట్రంలో మారిన ప్ర‌భుత్వ తీరు, పాల‌నా వ్య‌వ‌హారాల‌ను కూడా వెల్ల‌డించారు. ప‌లితంగా పెట్టుబ‌డులు పెట్టేవారిని ఆయ‌న ఆక‌ర్షించిన‌ట్టు అయింది.

ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల మేర‌కు.. ఒక్క అమెరికా నుంచే 31 వేల కోట్ల‌రూపాయ‌ల మేర‌కు పెట్టుబ‌డులు తెలంగాణ‌కు రానున్నాయి. ఏఐ, కంప్యూటింగ్ త‌దిత‌ర విభాగాల్లో అమెరికా నుంచి ఈ పెట్టుబ‌డులు ఆశిస్తున్నారు. వాటిని కార్య‌రూపం దాల్చేలా కృషి చేయ‌నున్నారు. త‌ద్వారా.. ప్ర‌త్య‌క్షంగా 30వేల ఉద్యోగాలు, దీనికి రెట్టింపు ఉపాధి ల‌భించ‌నుంది. ఇక‌, ద‌క్షిణ కొరియాతో చేసుకున్న ఒప్పందాల మేర‌కు.. హైద‌రాబాద్‌లో టీవీల క‌ర్మాగారం, సెల్‌ఫోన్ల విడిభాగాల త‌యారీ , బ్యాట‌రీ త‌యారీ కేంద్రాల‌కు అంగీక‌రించిన‌ట్టు తెలిసింది. మొత్తానికి ఆలోచ‌న‌ల‌తోవెళ్లి పెట్టుబ‌డులు రాబ‌ట్టిన ముఖ్య‌మంత్రిగా రేవంత్ రికార్డు సృష్టించారు.

Tags:    

Similar News