అదిరేలా మరో ఎంపిక చేసిన రేవంత్
ఎన్నికల వేళ తామిచ్చిన ఆరు గ్యారెంటీ హామీల అమలును వంద రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించటం తెలిసిందే.
అంచనాలకు భిన్నంగా వ్యవహరిస్తూ.. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు.. ఎంపికలు విమర్శలకు దూరంగా ఉంచటమే కాదు.. అందరి నోట బాగుందన్న మాట వచ్చేలా చేస్తున్నారు. తాజాగా మరోసారి తన మార్కును ఆయన ప్రదర్శించారు. దూకుడుతనం.. ఒంటెద్దు పోకడలతో రేవంత్ ఎలా నెగ్గుకు వస్తారన్న దానిపై బోలెడన్ని సందేహాలు వ్యక్తమవుతుంటే.. రేవంత్ మాత్రం అందుకు భిన్నంగా తనను తాను పూర్తిగా మార్చేసుకోవటమే కాదు.. తనలోని మార్పును ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే వారు సైతం జీర్ణించుకోలేని రీతిలో వ్యవహరిస్తునన తీరు ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల వేళ తామిచ్చిన ఆరు గ్యారెంటీ హామీల అమలును వంద రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించటం తెలిసిందే. ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అర్హుల్ని ఎంపిక చేసేందుకు వీలుగా ఇటీవల దరఖాస్తుల్ని ఆహ్వానించటం.. భారీ ఎత్తున రావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ లో తాజాగా నిర్వహించిన రివ్యూలో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రజాపాలనలో స్వీకరించిన అప్లికేషన్ల పరిశీలనను వేగవంతంగా పూర్తి చేయాలని.. పారదర్శకంగా జరటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలిన సూచించారు.
అంతేకాదు.. ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమిస్తూ ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకోవటమే కాదు.. ఆరు గ్యారెంటీల అమలుపై తమ ప్రభుత్వానికి ఉన్న కమిట్ మెంట్ గురించి చెప్పకనే చెప్పేశారు. ఉప సంఘం ఛైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కును నియమించిన సీఎం రేవంత్.. మంత్రులు శ్రీధర్ బాబు.. పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను సభ్యులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కీలక అంశం ఏమైనా సరే.. తాను ఒక్కడినే అన్నట్లు కాకుండా.. అందరు కలిసి కట్టుగా ఉండాలన్న సంకేతాన్ని ఇచ్చేలా రేవంత్ తన ప్రతి నిర్ణయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన ఉప సంఘం కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తుందని చెప్పాలి. ఏమైనా.. తాము చెప్పిన వంద రోజుల్లో ఆరు హామీల్ని అమలు చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్న విషయాన్ని చేతలతో చెప్పేస్తున్న రేవంత్.. రానున్న రోజుల్లో ఇంకేం చేయనున్నారన్నది చూడాలి.