వార్తలు సమాప్తం... తొలి తెలుగు న్యూస్ యాంకర్ కన్నుమూత!
దూరదర్శన్ తెలుగు లో ఫస్ట్ యాంకర్, న్యూస్ రీడర్ కావడంతోపాటు సుమారు రెండు దశాబ్ధాలకు పైగా వార్తలు చదవడంతో డీడీ తెలుగు వార్తలు పేరు చెప్పగానే శాంతిస్వరూప్ టక్కున గుర్తొస్తుంటారు!
తొలి తెలుగు యాంకర్, న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. దూరదర్శన్ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే శాంతి స్వరూప్... గుండెపోటుతో హైదరాబాద్ లోని యశోదా హాస్పిటల్ లో శుక్రవారం ఉదయం మృతిచెందారు. దూరదర్శన్ తెలుగు లో ఫస్ట్ యాంకర్, న్యూస్ రీడర్ కావడంతోపాటు సుమారు రెండు దశాబ్ధాలకు పైగా వార్తలు చదవడంతో డీడీ తెలుగు వార్తలు పేరు చెప్పగానే శాంతిస్వరూప్ టక్కున గుర్తొస్తుంటారు!
తెలుగుగడ్డపై 1977 అక్టోబర్ 23న నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి.. దూరదర్శన్ కార్యక్రమాలను ప్రారంభించగా... 1978లో అక్కడ ఉద్యోగంలో చేరిన శాంతి స్వరూప్. 1983 నవంబర్ 14 తెలుగు వార్తా విభాగం ప్రారంభమైన సమయంలో మొట్టమొదటి న్యూస్ రీడర్ అవకాశం దక్కించుకున్నారు. ఆ రోజు బాల దినోత్సవం వేడుకలకు సంబంధించిన విజువల్స్ చూపిస్తూ సాయంత్రం 7 గంటలకు తొలిసారి వార్తలు చదివారు.
ఎదురుగా స్క్రీన్ పై కనిపిస్తున్న అక్షరాలను చూసి చదివే విధంగా నాడు ఇప్పటికిలా టెలీ పాంప్టర్లు లేకపోవడంతో... వార్తలన్నీ ముందుగానే వల్లెవేసుకుని, ప్రాక్టీస్ చేసుకుని, అనంతరం కెమెరా ముందుకు వచ్చేవారంట శాంతి స్వరూప్. ఈ క్రమంలో వార్తలతో పాటు "జాబులు - జవాబులు", "ధర్మ సందేహాలు" మొదలైన కార్యక్రమాలను నడిపిన ఆయన... నేటి తరం తెలుగు యాంకర్లకు ఆదిగురువు అన్నా అతిశయోక్తి కాదు!
2011 జనవరి 7 వరకూ దూరదర్శన్ లో పనిచేసిన ఆయన.. తన కెరీర్ లో రెండు అత్యంత విషాదకరమైన వార్తలు చదివినట్లు తెలిపారు. అవి తనకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. అందులో... 16 బుల్లెట్లు శరీరాన్ని తూట్లు చేసిన సమయంలో ఇందిరా గాంధీ మరణించడం ఒకటి కాగా... ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ మరణం రెండోదని తెలిపారు. ఆయన శరీరం ముక్కలు ముక్కలైందని, ఆ వార్త తన కెరీర్ లో రెండో అత్యంత విషాదకరమైన వార్త అని గతంలో తెలిపారు!
ఇక వ్యక్తిగత జీవితం విషయానికొస్తే... 1980 ఆగస్టు 21న యాంకర్ రోజారాణితో శాంతి స్వరూప్ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగపిల్లలు సంతానం కాగా... ఇద్దరూ ఇప్పుడు అమెరికాలో స్థిరపడ్డారు. ఇక, హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన శాంతిస్వరూప్... రామాంతపూర్ లోని టీవీ కాలనీలో నివాసం ఉన్నారు!