షర్మిలకు వెల్ కం... కాంగ్రెస్ లోకి ఇద్దరు ఎమ్మెల్యేలు!!
ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో ఆల్ మోస్ట్ చివరి దశకు వచ్చేసి.. జనాల్లోకి వెళ్లడానికి డేట్స్ కూడా ఫిక్స్ చేసుకుని జగన్ ప్రిపేర్ అయిపోతున్నారు.
ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో ఆల్ మోస్ట్ చివరి దశకు వచ్చేసి.. జనాల్లోకి వెళ్లడానికి డేట్స్ కూడా ఫిక్స్ చేసుకుని జగన్ ప్రిపేర్ అయిపోతున్నారు. మరోపక్క ఈ నేలాఖరులోగా తమ కూటమిలోకి బీజేపీ రాకపై క్లారిటీ తెచ్చుకుని వేగం పెంచాలని టీడీపీ - జనసేనలు భావిస్తున్నాయి. ఈ సమయంలో ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకుని కథనరంగంలోకి అడుగు పెట్టాలని షర్మిళ కూడా సిద్ధమవుతున్నారు.
దీంతో... ఏపీ రాజకీయాల్లో త్రిముఖ పోరు తప్పదా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో షర్మిల రాక ఎవరికి ప్లస్సు, మరెవరికి మైనస్సు అనే సంగతి కాసేపు పక్కనపెడితే... ఇటు వైసీపీలో టిక్కెట్ దొరక్క, అటు చంద్రబాబు సారధ్యంలో పనిచేయడానికి మనసొప్పక ఎదురుచూస్తున్న నేతలకు మాత్రం మాంచి షెల్టర్ గా కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడే అవకాశాలున్నాయని తెలుస్తుంది.
అవును... ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఆదివారం విజయవాడలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి నాలుగు గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు.
ఈ సమయంలో ఆమెతో పాటు కేవీపీ రామచంద్రరావు సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఇడుపులపాయ వెళతారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న షర్మిల... అనంతరం విజయవాడలో ఒక ఫంక్షన్ హాల్ లో నిర్వహించే కార్యక్రమంలో ఉదయం 11 గంటలకు పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా ఆమె ఆపరేషన్ ఆకర్ష లక్ష్యంగా తొలి అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది. .
ఈ సమయంలో షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కనీసం ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... తొలి నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి... షర్మిల బాధ్యతలు తీసుకున్న వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యే కూడా లైన్ లో ఉన్నారని అంటున్నారు.
ఇందులో భాగంగా ఈ దఫా టిక్కెట్ లేదని తెలిసిన వెంటనే తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచి.. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రఘువీరా రెడ్డిని కలిసిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా షర్మిళ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలుస్తుంది. ఈయనతోపాటు రాయలసీమకు చెందిన పలువురు నేతలు హస్తం గూటికి చేరబోతున్నారని సమాచారం.
ఈ విధంగా వైసీపీలో టిక్కెట్ దక్కనివారు.. అలా అని టీడీపీకి వెళ్లలేనివారు.. ఇంతకాలం అటు వైసీపీకి - ఇటు టీడీపీకి సమాన దూరం పాటించిన నేతలు.. ఇంతకాలం స్థబ్ధగా ఉన్న పలువురు కాంగ్రెస్ పార్టీ మాజీలు తిరిగి షర్మిళ నాయకత్వంలో హస్తం గూటికి చేరబోతున్నారని.. ఆ విధంగా పీసీసీ చీఫ్ గా షర్మిలకు గ్రాండ్ వెల్ కం చెప్పబోతున్నారని అంటున్నారు.
షర్మిలకు ఎన్నికల రోడ్ మ్యాప్ రెడీ!:
షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన అనంటరం ఆమె ఫుల్ బిజీ అయిపోయే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ నెల 23న ఏపీసీసీ ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ విజయవాడకు వచ్చి ఆమెకు ఎన్నికల రోడ్ మ్యాప్ పై దిశానిర్ధేశం చేయనున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా జిల్లాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసి చేరికలపై దృష్టిపెట్టబోతున్నారని సమాచారం!