సామాజిక వర్గాలకు షర్మిల దూరమా..?
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఒంటరిగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒంటరిగానే ముందుకు సాగుతున్నారు
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఒంటరిగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒంటరిగానే ముందుకు సాగుతున్నారు. ఎక్కడా కూడా పెద్దగా ఎవరినీ కలుపుకుని పోవట్లేదు. తనకు వచ్చిన ఆలోచనను తాను మెచ్చిన నిర్ణయాన్ని నేరుగా అమలు చేసేందుకు లేదా అధిష్టానానికి చెప్పి ఒప్పించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. అలాగే వ్యవహరిస్తున్నారు కూడా. ఇది కీలకమైన సామాజిక వర్గాలకు ఇబ్బందిగా మారింది. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం అండగా ఉంది.
రెడ్డి సామాజిక వర్గం లేకపోతే కాంగ్రెస్ పార్టీ అసలు లేనేలేదనే మాట అప్పుడు వినిపించింది. ఇప్పుడు కూడా అదే వినిపిస్తోంది. అలాంటి రెడ్డి సామాజిక వర్గాన్ని చేరువ చేసుకోవడంలో షర్మిల పూర్తిగా విఫలమవుతున్నారు. ఇప్పటివరకు ఉన్న పాత రెడ్లు కూడా దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి 2014- 2019 ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఆయన వెంట నడిచింది. ఆయనకు అండగా నిలబడింది.
పార్టీ అధికారంలోకి వచ్చేందుకు వారు ఆర్థికంగా వ్యక్తిగతంగా కూడా వైసీపీకి ఎంతో ఉపకరించారు. అయితే ఆయన అనుసరించిన విధానాలను గమనించి 2024 ఎన్నికల్లో ఆయనకు దూరమయ్యారు. ఈ నే పథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ షర్మిలకు పగ్గాల అప్పగించింది. వైసీపీకి దూరమైన రెడ్డి సామాజిక వర్గం ఓట్లను, రెడ్డి సామాజిక వర్గం నాయకులను చెరువ చేసేందుకు పార్టీని బలోపేతం చేసేందుకు ఆమె ఉపకరిస్తారని భావించింది. కానీ ఇప్పటివరకు ఒక్కసారంటే ఒక్కసారి కూడా నేరుగా రెడ్డి సామాజిక వర్గం నాయకులతో కానీ వారి సమస్యలను తెలుసుకోవడంలో గాని షర్మిల ప్రయత్నం కూడా చేయలేదు.
దీంతో ఇప్పుడు వైసీపీకి దూరమైన రెడ్డి సామాజిక వర్గం ఇతర పార్టీల వైపు ముగ్గు చూపుతున్నారే తప్ప షర్మిల వైపు రాకపోవడం, షర్మిలకు మద్దతుగా మాట్లాడకపోవడం, షర్మిలకు అండగా నిలబడకపోవడం ఆసక్తిగా మారింది. నిజానికి షర్మిల కనుక అందరినీ కలుపుకొని పోయి ఉంటే అప్పట్లో వైఎస్ ను అనుసరించిన రెడ్డి సామాజిక వర్గం నాయకులు ఏపీలో ఆమెను అనుసరించే అవకాశం ఉంది. కానీ ఈ చిన్న అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకోకపోవడంతో కీలకమైన వర్గం అంటీ మొట్టనట్టే వ్యవహరిస్తుండడం గమనార్హం.