మంత్రి గుడివాడకు మరో షాక్.. ఆ బాధ్యత నుంచీ తప్పించారు
తాజాగా ఆ బాధ్యతను ఉప ముఖ్యమంత్రి.. రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖల మంత్రి బూడి ముత్యాల నాయుడికి అప్పజెబుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ మంత్రి కం ఫైర్ బ్రాండ్ గా పేరున్న గుడివాడ అమర్ నాథ్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా ఆయనకు మరో షాక్ తగిలింది. ఎందుకు జరిగింది? దీని వెనుకున్న లెక్కలు అస్సలు అర్థం కావట్లేదన్న వాదన ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. తాజాగా ఆయనకు విశాఖకు వచ్చే ఒక వీవీఐపీకిస్వాగతం పలికే బాధ్యత నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకోవటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇప్పటికే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గం బాధ్యుడిగా మరొకరిని ప్రకటిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న దానిపైనా క్లారిటీ లేదు. ఇప్పుడు విశాఖకు వచ్చే అతిధులకు స్వాగతం పలికే బాధ్యత నుంచి ఆయన్ను తప్పించటం ఆసక్తికర నిర్ణయంగా చెబుతున్నారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన్ను.. ఈరోజు (గురువారం) విశాఖపట్నానికి రానున్న ఉప రాష్ట్రపతి ధన్ ఖడ్ ను ప్రభుత్వం తరఫున స్వాగతం పలికే బాధ్యత నుంచి ఆయన్ను తప్పించారు.
మంత్రిగా అమర్ నాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి ఇప్పటివరకు విశాఖపట్నానికి వచ్చే ఏ ప్రముఖుడికి అయినా ఆయనే స్వాగత బాద్యతలు చేపట్టారు. తాజాగా ఆ బాధ్యతను ఉప ముఖ్యమంత్రి.. రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖల మంత్రి బూడి ముత్యాల నాయుడికి అప్పజెబుతూ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో.. మంత్రి అమర్ నాధ్ కు డబుల్ షాక్ గా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే సీటు విషయంపై క్లారిటీ రాని పరిస్థితుల్లో ఇప్పుడు చేతిలో ఉన్న మరో పవర్ నుంచి పక్కకు పెట్టేశారని చెప్పాలి. తన విషయంలో తరచూ ఎదురవుతున్న ఈ ఎదురుదెబ్బలపై మంత్రి గుడివాడ ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది చూడాలి.