సొసైటీ కి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది బ్రో....!
అలాగే వారిని ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏ రకంగా మనం గౌరవం ఇస్తున్నట్లు. ఇవన్నీ ప్రశ్నలుగానే వస్తాయి. వ్యవస్థను అంతా కలసి బలోపేతం చేయాలి.
నాకు ఎవరూ ఖాతరు లేదు, నేను ఎవరినీ గౌరవించను నేను నాలాగే ఉంటాను అంటే సొసైటీ నుంచి ఆ వ్యక్తి వేరు పడినట్లే. సమాజానికి కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. మనకు నచ్చినా నచ్చకపోయినా ఆ సమాజంలో ఉన్నందుకు వాటిని అనుసరించి తీరాలి. లేకపోతే ఆ సమాజానికి దూరంగా ఉన్నట్లే అంటారు.
ఇక రాజ్యాంగం ప్రకారం మన దేశంలో అధికారాలు చేతులు మారుతూంటాయి. ముఖ్యమంత్రి, ప్రధాని, రాష్ట్రపతి వంటి పదవులను ఎంతో గౌరవించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన పదవుల వెనక కోట్లాది మంది ప్రజల మనోభావాలు ఉంటాయి. నాకు నచ్చలేదు అని ముఖ్యమంత్రిని ప్రధాని వంటి వారిని బహిరంగంగా ఏకవచనంతో సంబోదిస్తామంటే కుదరదు.
ఎందుకంటే ఇది సమాజం. ఇది ప్రజాస్వామ్యం అని స్వేచ్చ ఉందని చెప్పుకున్నా రాజ్యాంగ పదవులకు విలువ గౌరవం ఇచ్చి తీరాల్సిందే. ఇక సంబోదించే క్రమంలో కూడా గౌరవ ప్రధాని గౌరవ ముఖ్యమంత్రి అని వాడాల్సి ఉంటుంది. ఇక వారితో ఎంత చనువు ఉన్నా ఏక వచనం సన్నిహితులు సొంతవారే బహిరంగంగా చేయకూడదు. ఎందుకంటే అక్కడ కుర్చీకి గౌరవం ఇవ్వాలి. కోట్లాది మంది ఓటేసి ఆ సీటులో ఒక నాయకుడిని కూర్చోబెట్టారు.
ఆ వ్యక్తి మనకు నచ్చలేదు అంటే అయిదేళ్ళకు ఒకసారి ఎన్నికలు వస్తాయి కాబట్టి ఓడించవచ్చు. అదీ పద్ధతి. అదీ విధానం. ఇక ఈ ముఖ్యమంత్రి ఎవరు ఈ మంత్రి ఎవరు అంటూ మాట్లాడడం పక్కా అరాచకం కిందకే వస్తుంది. ఈ ముఖ్యమంత్రులూ ప్రధానులే శాసనాలు చేస్తారు. వారికి ప్రజలు అధికారం ఇచ్చారు. ఆ అధికారం కోసం ప్రజల పక్షాన ఉండి పోరాడడం చేయవచ్చు కానీ మొండితనంగా మీరు ఎవరు మాకు చెప్పడానికి అంటూ వేలాది మంది ప్రజల ఉండే సభల నుంచి నాయకులు వేదికల మీద చేసే గర్జనలు ఇచ్చే పిలుపులూ ప్రజాస్వామిక స్పూర్తిని కోల్పోతాయి.
అంతే కాదు యువతను కూడా పెడ మార్గంలో పెడతాయి. మనం అంతా కలసి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ప్రజాస్వామ్యం. కుస్తీ పోటీలు పెట్టి బలాబలాలు చూసుకుని గెలిచిన వారిదే పదవి అని ఆ తరహా వ్యవస్థను మనం తెచ్చుకోలేదు అన్నది నాయకులు గుర్తించాలి. ఇక ముఖ్యమంత్రి అన్న వారు కానీ ప్రధాని కానీ కోట్లాది మంది ప్రజలు ఎన్నుకున్న వారు.
మనకు వారు నచ్చకపోవచ్చు. వారిని బహిరంగంగా అగౌరవపరిస్తే వారిని నచ్చిన వారి మనోభావాల సంగతి ఏంటి. అలాగే వారిని ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏ రకంగా మనం గౌరవం ఇస్తున్నట్లు. ఇవన్నీ ప్రశ్నలుగానే వస్తాయి. వ్యవస్థను అంతా కలసి బలోపేతం చేయాలి. ఎక్కడా డీవియేషన్ రాకూడదు.
రాజకీయాల్లో ఉన్న వారు పరస్పరం విమర్శలు చేసుకోవచ్చు కానీ వ్యవస్థల మీద బురద జల్లుతూ పోతే వాటి మీద సామాన్యుడు సగటు మనిషికి విరక్తి కలిగి కోపం పెరిగితే అపుడు జరిగే సంఘర్షణను కానీ సంక్షోభాన్ని కానీ అపడం ఎవరి తరం కాదు. మాటలతో రెచ్చగొట్టడం సులభమే. కానీ అవ్యవస్థ వైపు జనాలను తోసివేసే విధంగా నేతల తీరు ఉంటే అది అంతిమంగా ప్రజాస్వామ్యానికి కష్టం, నష్టం అన్నదే మేధావులు చెప్పే మాట.
రాజకీయంగా తేల్చుకోవచ్చు. విధానపరంగా ప్రశ్నలు వేయవచ్చు, కానీ అవి హద్దులు దాటితే చివరికి వాటి వల్ల ఇబ్బందులే తప్ప మరేమీ జరగవు. ప్రజాస్వామ్యంలో విమర్శలకు చోటుంది, అయితే వాటిని ఎంత నిర్మాణాత్మకంగా అర్ధవంతంగా జనాలకు అటు ఏలికలకు చెబుతున్నామన్నది ముఖ్యం. ఆ విషయంలో నాయకుడు ఎపుడూ పరిణితితో వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది.
ఇక ఎవరెంత అనుకున్నా తిట్టుకున్నా సమాజంలోనే జీవించాల్సి ఉంటుంది. అటువంటపుడు సమాజ కట్టుబాట్లను ప్రశ్నించడం, నేను ఇలాగే ఉంటాను నాలాగే ఉంటాను అంటూ విచిత్రంగా అర్ధహీనంగా వాదనలు వినిపించడం ద్వారా ఎవరైనా సాధించేది లేకపోగా వారే తాముగా ఆ సమాజం నుంచి మెల్లగా దూరం అవుతారు అన్నది కూడా తెలుసుకోవాల్సిన సత్యం.
వర్తమాన రాజకీయాల్లో దూషణ భూషణలు ఎక్కువ అవుతున్నాయి. అవి యువత మీద చెడు ప్రభావం కలిగే విధంగా చేస్తున్నాయి. ఎవరైన తప్పు చేస్తే వారిని చట్టప్రకారం శిషించే అవకాశం ఉన్న వ్యవస్థలో మనం ఉన్నాం, తాట తీస్తాను తోలు తీస్తాను, కొట్టుకుంటూ నడిరోడ్డు మీద దిశ మొలతో నడిపిస్తాను అనే ఆటవిక నీతిని మనం అలవాటు చేసుకోలేదు.
ఎవరికైనా అలాంటి ఆకాంక్షలు ఉన్నపుడు వారు ప్రజాస్వామ్యం మీదనే సందేహపడుతున్నారనే లెక్క వేయాలి అన్నది మేధావుల భావన. ఇక చివరిగా ఒక మాట. మీరు బాగున్నారా అంటే మీరు బాగున్నారా అని అవతల నుంచి జవాబు వ్స్తుంది. ఇందులో ఉన్నది ఇచ్చి పుచ్చుకోవడం సంస్కారం. ఒకరిని మనం గౌరవిస్తున్నామంటే అది మన సంస్కారాన్ని తెలియచేస్తుంది అని మరచిపోవడమే నేతి బీరకాయ నీతులు చెబుతున్న నేతల తీరు అని అనుకుంటేనే ఆవేదన నిండా కలుగుతోంది అంటున్న వారే ఎక్కువ ఉన్నారిక్కడ.