విద్యార్థి వీసాలు బంద్.. 'ఖలిస్థానీ' హత్యలు.. కెనడాతో అంతా తేడా!
కెనడా పౌరుల వీసా అప్లికేషన్లను ప్రాథమికంగా పరిశీలించేందుకు కొన్ని ఏజెన్సీలు ఉన్నాయి. ఆ ఏజెన్సీలే విషయాన్ని బయటకు చెబుతున్నాయి.
ఆర్థికంగా అత్యత శక్తిమంతమైన జి-7 కూటమి సభ్య దేశం.. సైనికంగా అత్యంత శక్తిమంతమైన నాటో కూటమి దేశం.. ఉత్తర అమెరికాలో అతి పెద్ద దేశమైన కెనడాతో భారత్ తో సంబంధాలు ఎన్నడూ లేనంత కింది స్థాయికి పడిపోయాయి. ఖలిస్థాన్ అంశం రేపిన చిచ్చు ఇప్పుడప్పట్లో చల్లారేలా లేదు. ఇప్పటికే దౌత్యపరంగా సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం. భారత్ కు వచ్చే కెనడా పౌరులకు వీసాలు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీనికి నిర్వహణ కారణాలు అని కారణం చెప్పినా, అసలు విషయం మాత్రం ఇటీవలి పరిణామాలే అన్నది విస్పష్టం. కాగా, వీసాల నిలిపివేత అంశాన్ని ప్రేవేటు ఏజెన్సీలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే, తదుపరి ఆదేశాల వరకు వీసాల జారీ నిలిపివేత ఉంటుందని పేర్కొంటున్నారు.
కెనడా పౌరుల వీసా అప్లికేషన్లను ప్రాథమికంగా పరిశీలించేందుకు కొన్ని ఏజెన్సీలు ఉన్నాయి. ఆ ఏజెన్సీలే విషయాన్ని బయటకు చెబుతున్నాయి. ఆ నిర్ణయాన్ని గురువారమే తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నెల 21 నుంచి తదుపరి ఆదేశాల వరకు అని ఓ ఏజెన్సీ చెప్పడమే దీనికి నిదర్శనం.
కాగా, జూన్ 15న జరిగిన ఖలిస్థానీ సానుభూతిపరుడు నిజ్జర్ హత్య.. అందులో భారత్ నిఘా వర్గాల ప్రమేయాన్ని కెనడా ప్రధాని ట్రూడో ఆ దేశ పార్లమెంటులోనే ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏకంగా మన దౌత్యవేత్తను బహిష్కరించింది. భారత్ సైతం.. తగ్గేదేలె అన్నట్లు కెనడా రాయబారిని ఇంటికి పంపింది. కెనడాలో ఉంటున్న భారతీయులు, ఇకపై వెళ్లాలనుకునేవారు జాగ్రత్తగా ఉండాలంటూ బుధవారం ట్రావెల్ అడ్వయిజరీ విడుదల చేసింది.
పుండు మీద కారం.. మరో హత్య..భారత్ నుంచి విడిపోయి ప్రత్యేక ఖలిస్థాన్ కావాలంటున్న వారికి కెనడా ఓ అడ్డాగా మారిన సంగతి తెలిసిందే. మన దేశం నుంచి వెళ్లిన వేలాది మంది సిక్కులు కెనడాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆర్థికంగా ఎదిగారు. రాజకీయంగానూ తీవ్ర ప్రభావం చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రూడో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. నిజ్జర్ హత్య జరిగినప్పుడే అత్యంత చర్చనీయాంశం అయింది. కాస్త అటుఇటుగా పాక్ లోనూ ఓ ఖలిస్థానీ సానుభూతి పరుడిగా ఉన్న సిక్కు నేత హతమయ్యాడు. ఇప్పుడు ఖలిస్థాన్ ఉద్యమంలో కీలకంగా ఉన్న గ్యాంగ్ స్టర్ సుఖ్ దోల్ సింగ్ అలియాస్ సుఖా దునెకె కెనడాలో హత్యకు గురయ్యాడు. అయితే, అతడిని చంపింది ప్రత్యర్థి వర్గంగా తెలుస్తోంది.
బిష్ణోయ్ గ్యాంగ్ పనా? పంజాబ్ కు చెందిన లారెన్స్ బిష్ణోయ్ చాలా వాంటెడ్. అతడి గ్యాంగ్ అనేక నేర కార్యకలాపాల్లో పాల్గొంది. ఇదే గ్యాంగ్ కెనడాలోని విన్నిపెగ్ లో బుధవారం సుఖ్‌దోల్ సింగ్ ను హతమార్చినట్లుగా తెలుస్తోంది. దీనిపై నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారమే తప్ప.. అధికారిక ప్రకటన లేదు. సుఖా దునెకె హత్య తమ పనేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో తెలిపింది. దునెకెది.. పంజాబ్ లోని మోఘా జిల్లా. దేవిందర్ బంబిహా గ్యాంగ్‌కు చెందినవాడు. అతడిపై భారత్ లోనూ పలు క్రిమినల్ కేసులున్నాయి. 2017లో నకిలీ ధ్రవ పత్రాలతో కెనడాకు పారిపోయాడు. కెనడా కేంద్రంగా పనిచేస్తున్న గ్యాంగ్ స్టర్ అర్షదీప్ సింగ్ ముఠాలో చేరాడు. ఖలిస్థానీ ఉద్యమంలో కీలకంగా ఉన్నాడు.
30 మంది గ్యాంగ్ స్టర్లు పరారు..ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 30 మంది.. పంజాబ్‌కు చెందిన దాదాపు 30 గ్యాంగ్ స్టర్లు వివిధ దేశాల్లో ఉన్నారు. భారత్ లో కేసుల నుంచి తప్పించుకునేందుకు వీరంతా పారిపోయారు. అదికూడా.. తప్పుడు ప్రయాణ పత్రాలతో లేదా నేపాల్ మీదుగా వెళ్లినట్లు తెలుస్తోంది. మరో గమనార్హమైన విషయం ఏమంటే.. వీరిలో 8 మంది గ్యాంగ్ స్టర్లు కెనడాలో ఉన్నట్లు సమాచారం. వీరిలో ఒకడే సుఖా. నిజ్జర్ హత్య ఇరు దేశాల మధ్య తీవ్ర వివాదం రేపిన సందర్భంలోనే సుఖా హత్య జరిగింది.