మాజీ లేడీ మినిస్టర్ 'ఫేట్' మారేనా? బాబు ఏం చేస్తారో?!
అయితే.. సుజాత మాత్రం తనకు టికెట్ ఇవ్వకపోయినా.. పార్టీ కోసం పనిచేస్తున్నారు. కార్యకర్తలను ముందుండి నడిపిస్తున్నారు.
ఒక్కొక్క సారి రాజకీయాలు ఎవరూ నమ్మలేనంతగా మారుతుంటాయి. చిన్న ప్రకటనతో నాయకుల తల రాతలు మారిపోయిన సందర్భాలు.. పార్టీలకు విజయందక్కిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఇప్పుడు వినిపిస్తున్న పేరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజ కవర్గం చింతలపూడి. ఇక్కడ అభ్యర్థిగా ఆమెను ఖరారు చేస్తే చాలు.. గెలిపించుకునే బాధ్యత మాదే! అనే టాక్ టీడీపీలో జోరుగా వినిపిస్తోంది.
ఆమె ఎవరో కాదు.. మాజీ మంత్రి పీతల సుజాత. 2014లో చింతలపూడి నుంచి విజయం దక్కించుకున్న సుజాత.. చంద్రబాబు మంత్రివర్గంలో కేబినెట్‌లోనూ సీటు దక్కించుకున్నారు. తర్వాత.. ఆరోపణలు రావడంతో ఆమెను పక్కన పెట్టారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆమె గెలుస్తారో .. లేదో అనే సంకట స్థితిని ఎదుర్కొని.. ఈ సీటు నుంచి ఆమెను తప్పించారు. ఇక, ఆ తర్వాత మరోసీటు కూడా ఆమెకు ఇవ్వలేదు.
అయినప్పటికీ.. సుజాత పార్టీలోనే ఉంటూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పైగా 2019లో టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మి టికెట్ ఇచ్చిన కర్రా రాజారావు ఘోరంగా ఓడిపోయారు. 2014లో పీతల సుజాత తీవ్రమైన పోటీలోనూ 15 వేల మెజారిటీ దక్కించుకుంటే.. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిన తర్వాత.. వచ్చిన ఎన్నికల్లో కర్రా రాజారావు ఆ హవాను నిలబెట్టుకోలేక పోయారు. ఈ క్రమంలో ఆయన 36 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక, ఆతర్వాత పత్తా లేకుండా పోయారనేది స్తానిక తమ్ముళ్ల వాదన.
అయితే.. సుజాత మాత్రం తనకు టికెట్ ఇవ్వకపోయినా.. పార్టీ కోసం పనిచేస్తున్నారు. కార్యకర్తలను ముందుండి నడిపిస్తున్నారు. చంద్రబాబు ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా సై అంటున్నారు. దీంతో ఆమె హవా మళ్లీ పుంజుకుంది. అవమానాలు ఎదురైనా.. పార్టీలో కొంత డిఫరెన్సెస్ వచ్చినా.. తట్టుకుని నిలబడ్డ సుజాతకు టికెట్ ఇవ్వాలనేది స్థానిక నాయకుల వాదనగా వినిపిస్తోంది. అంతేకాదు.. టికెట్ ప్రకటిస్తే చాలు.. ఆమెను గెలిపించుకుంటామని నాయకులు చెబుతున్నారు. మరి చంద్రబాబు ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.