సర్వేల పల్లకీ మోత... జనం తీర్పు ఎటు...?

సర్వేలు అన్నీ కూడా ఇటీవల కాలంలో ఒకే విధంగా ఉంటున్నాయని అంటున్నారు. గత నెల రోజులుగా సర్వేలు అధికార బీయారెస్ కి ఎడ్జ్ ఇస్తున్నాయి.

Update: 2023-11-08 03:59 GMT

సర్వేలు అన్నీ కూడా ఇటీవల కాలంలో ఒకే విధంగా ఉంటున్నాయని అంటున్నారు. గత నెల రోజులుగా సర్వేలు అధికార బీయారెస్ కి ఎడ్జ్ ఇస్తున్నాయి. ఆ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నాయి. నిజానికి నెల క్రితం వరకూ సర్వేలు కాంగ్రెస్ కి సీట్లు ఎక్కువగా వస్తాయని చెప్పుకొచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.

కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పెరిగిందని, బీయారెస్ కి అడుగడుగునా ప్రజా వ్యతిరేకత ఉందని కూడా రాసుకొచ్చాయి. అలాంటిది సర్వేలు ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నాయా లేక జనమే మూడ్ చేంజ్ చేసుకున్నారా అంటే ఈ రోజుకీ అర్ధం కాని విషయం.

నిజానికి రెండు సార్లు అధికారంలో ఉన్న పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉండడం అత్యంత సహజం. దాన్ని చెప్పడానికి ఏ సర్వేశ్వరుడూ అవసరం లేదు. ఎంత గొప్పగా పాలించినా కూడా అసంతృప్తి ఎక్కడో ఒక చోట పెల్లుబుకుతుంది. కానీ బీయారెస్ కి మాత్రం రోజు రోజుకీ గ్రాఫ్ అలా పెరిగిపోతోంది. అధికార పార్టీ డ్యాం ష్యూర్ గా గెలిచి తీరుతుందని సర్వేలు చాలా వరకూ జోస్యం చెప్పేస్తున్నాయి.

దీంతోనే అసలు సర్వేల వెనక విషయం ఏంటి, కధ ఏంటి అన్న చర్చ మొదలైంది. సర్వేలు అధికార పక్షానికి కూడబలుక్కున్నట్లుగా మెజారిటీలు కట్టబెట్టేస్తున్నాయా అన్న సంశయం కూడా కలుగుతోంది అంటున్నారు. కాంగ్రెస్ కి ఉన్న మొగ్గు ఈ మధ్య ఎందుకు తగ్గింది. అంత తప్పు కాంగ్రెస్ ఏమి చేసింది అని కూడా అంటున్న వారూ ఉన్నారు. అదే విధంగా చూస్తే బీయారెస్ కి ఎన్నికలు దగ్గరపడుతూంటే ఒక్కసారిగా గ్రాఫ్ ఎలా పెరుగుతోంది అన్న డౌట్లూ వస్తున్నాయి.

ఇదంతా జనాల మైండ్ సెట్ ని మార్చడానికి ఆడే మైండ్ గేం అన్నట్లుగా అంటున్న వారూ ఉన్నారు. మరో వైపు చూస్తే కర్నాటకలో కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో కూడా అధికార బీజేపీ మోత మోగిస్తుందని మారోసారి అధికారంలోకి వస్తుందని కొన్ని రకాలైన సర్వేలు తెగ ఊదరగొట్టాయని గుర్తు చేస్తున్నారు.

తీరా ఎన్నికలు జరిగిన తరువాత అసలు ఫలితాలు జనం తీర్పుని విప్పి చూపించాయని అంటున్నారు. జనాలు ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకుని వారికే వేశారని కూడా అలా రుజువు అయింది అని అంటున్నారు. మరి అధికార బీజేపీ గెలుస్తుందని చెప్పిన సర్వేల ప్రమాణాన్ని కూడా ఈ ఫలితాలు ప్రశ్నించాయి. కొన్ని సర్వేలు పెయిడ్ సర్వేలుగా తేలింది అని కూడా విమర్శలు వచ్చాయి.

మరి తెలంగాణాలో జరుగుతున్నది చూసిన వారికి కూడా ఈ సర్వేలు ఏ రకమైన ఫలితాలు ఇస్తాయో అన్న అనుమానాలు వస్తున్నాయట. సర్వేలు పల్లకీ మోత మోగిస్తే మురిసిపోవడం వల్ల కూడా ప్రమాదం ఉందని అంటున్నారు. సర్వేలు చెప్పినది సర్వేశ్వరుడు చెప్పినది కాదని కూడా సెటైర్లు వేస్తున్నారు.

ఇక జనం గతం కంటే బాగా చైతన్యం అయ్యారని, వారు ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే ఎవరు ఏమి చెప్పినా ప్రభావితం కావడం లేదని తాజాగా అనేక ఎన్నికలు రుజువు చేశాయని అంటున్నారు అందువల్ల సర్వే ఫలితాలు ఒకలాగా రియల్ ఫలితాలు ఒకలాగా వచ్చిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. మరి తెలంగాణా ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత సర్వేల తీరు మీద మరింత స్పష్టత జనాలతో సహా రాజకీయ పార్టీలకూ వస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News