తాడేపల్లిలో కూల్చివేతల వేళ... వైసీపీకి మరో నోటీసులు!?

ఇందులో భాగంగా విశాఖలో నిర్మించిన పార్టీ ఆఫీసుకూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) అధికారులు నోటీసులు పంపారు!

Update: 2024-06-22 08:25 GMT

ఆంధ్రప్రదేశ్ లో శనివారం ఉదయం తెల్లవారుజామునే వైసీపీకి భారీ షాక్ తగిలిన సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా... తాడేపల్లిలో నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఇవాళ సీఆర్డీయే, ఇతర శాఖల అధికారులు కూల్చివేశారు. దీంతో ఈ వ్యవహారంపై ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. ఈ సమయంలో వైసీపీకి వితౌట్ గ్యాప్ మరో షాక్ అనే అంశం తెరపైకి వచ్చింది!

అవును... ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలోని వైసీపీ కార్యాలయం కోసం నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ఈ వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఇదే విషయంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఘాటుగా స్పందించారు.

ఈ నేపథ్యంలో ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే వైసీపీకి మరో షాక్ తగిలింది! ఇందులో భాగంగా విశాఖలో నిర్మించిన పార్టీ ఆఫీసుకూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) అధికారులు నోటీసులు పంపారు! విశాఖ జిల్లా ఎండాడలో సర్వే నెంబర్ 175/4లో ఉన్న రెండు ఎకరాల స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారని జీవీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

అయితే ఈ విషయంలో మాత్రం జీవీఎంసీ అధికారులు వైసీపీకి కాస్త వ్యవధి ఇచ్చారు. ఇందులో భాగంగా... వారం రోజుల్లోగా ఈ వ్యవహారంపై సరైన వివరణ ఇవ్వాలని.. అలాకానిపక్షంలో తదుపరి చర్యలు ఉంటాయని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పేరున... వైసీపీ కార్యాలయానికి నోటీసులు అంటించారు!

దీంతో... త్వరలో విశాఖలోని వైసీపీ కార్యాలయాన్ని కూడా కూల్చేస్తారా అనే అనుమానాలు తెరపైకి వచ్చాయి. పైగా... తమకు ఎలాంటి నోటీసులు, వ్యవధి ఇవ్వకుండానే తాడేపల్లిలోని పార్టీ ఆఫీసును కూల్చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న వేళ.. విశాఖలో మాత్రం వారం రోజులు వ్యవధి ఇచ్చి నోటీసులు ఇవ్వడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అంటించిన నోటీసులు తీసేసిన అమర్నాథ్!:

గ్రేటర్ విశాఖ పరిధిలో వైసీపీ కార్యాలయ నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ... వారం రోజుల్లోగా ఈ వ్యవహారంపై సరైన వివరణ ఇవ్వాలని.. అలాకానిపక్షంలో తదుపరి చర్యలు ఉంటాయని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పేరున... వైసీపీ కార్యాలయానికి అంటించిన నోటీసులను మాజీ మంత్రి అమర్నాథ్ పరిశీలించారు.

అనంతరం.. “మనకు కాపీ ఏమీ ఇవ్వలేదు కదా...” అని అక్కడున్నవారితో చెబుతూ సిటీ ప్లానింగ్ అధికారులు వైసీపీ ఆఫీసు గోడకు అంటించిన నోటీసులను అమర్నాథ్ తీసేశారు. ఈ విషయంపై అధికారుల రియాక్షన్ ఎలా ఉంటుందనేది వేచి చూడాలి!

Tags:    

Similar News