"నా ఫోన్ కూడా ట్యాప్ అయ్యింది"... తమిళిసై వ్యాఖ్యలు వైరల్!

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

Update: 2024-04-17 11:30 GMT

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రాజకీయ ప్రకంపణలు సృష్టిస్తోంది! ఇదే క్రమంలో తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆరెస్స్ ల మధ్య మాటల యుద్ధాలు నెలకొంటున్నాయి! గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులతో పాటు సినిమా సెలబ్రెటీల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయనే విషయం వైరల్ గా మారింది. ఈ సమయంలో అనూహ్యంగా తమిళిసై తెరపైకి వచ్చారు.. ఈ సందర్భంగా తన ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని అన్నారు!

అవును... తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించిన కీలక విషయాలు బయటకు వస్తుండటంతో.. బాధితులు ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వస్తున్న పరిస్థితి! ఈ క్రమంలోనే తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ స్పందించారు. ఇందులో భాగంగా... తెలంగాణలో తాను గవర్నర్ గా పనిచేసే సమయంలో బీఆరెస్స్ ప్రభుత్వం హయాంలో తన ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైనట్లు ఆరోపించారు!

ఇదే సమయంలో... దీనికి సంబంధించి తన దగ్గర బలమైన ఆధారాలున్నాయని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై తాను 2022లోనే స్పందించినట్లు చెప్పిన తమిళిసై... అప్పుడు తాను రాజకీయాలు చేస్తున్నట్లు ప్రభుత్వం తన ఆరోపణలను తోసిపుచ్చిందని అన్నారు! ఇలా.. గతంలో తాను చెప్పిందే ఇప్పుడు నిజమవుతుందని.. తమిళిసై ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు! దీంతో ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

కాగా... తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఇటీవల తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే! ఇటీవల ఆమె తెలంగాణ గవర్నర్‌ పదవితో పాటు పుదుచ్ఛేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి రాజీనామా చేసి.. భారతీయ జనతా పార్టీలో చేరారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకొన్నారు.

గతంలోనూ ఆమె తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆమె సౌత్ చెన్నై నుంచి బీజేపీ తరుపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సమయంలో తన ఫోన్ కూడా ట్యాప్ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి!!

Full View
Tags:    

Similar News