ఏపీలో కూటమి మధ్య `పింఛన్ల` రగడ ..!
అది కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల చుట్టూనే ఈ రాజకీయాలు చోటు చేసుకోవడం మరింత విస్మయానికి దారితీస్తోంది.
కూటమి పార్టీల నాయకులు కలివిడిగా ఉండాలని.. కలిసి మెలిసి పనిచేయాలని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లా లని కూడా ఆయన చెబుతున్నారు. అయితే.. క్షేత్రస్థాయిలో మాత్రం కలివిడి రాజకీయాల స్థానంలో విడివిడి రాజకీయాలే కనిపిస్తుండడం గమనార్హం. అది కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల చుట్టూనే ఈ రాజకీయాలు చోటు చేసుకోవడం మరింత విస్మయానికి దారితీస్తోంది.
నవంబరు 1వ తేదీన పింఛన్ల పంపిణీ జరగాల్సి ఉంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి నెలా 1నే జరుగుతున్న విషయం తెలిసిందే. వైసీపీ హయాం లో వలంటీర్లు ఇంటింటికీ తీసుకువెళ్లి పంచేవారు. అయితే.. ఇప్పుడు వలంటీర్లు లేనందున.. వారి స్థానంలో ప్రభుత్వ వర్గాలు.. పార్టీ నాయకులు ప్రజలకు పంచుతున్నారు. తొలినాళ్లలో పార్టీ నాయకుల ప్రమేయం వద్దని చంద్రబాబు చెప్పారు.
కానీ, తర్వాత.. దీనివల్ల మైలేజీ వస్తుందని భావించిన ఆయన పార్టీ నాయకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో గత రెండు నెలల నుంచి పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే.. ప్రస్తుతం ఇదే వివాదంగా మారింది. పలు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు.. మాత్రమే ఈ కార్యక్రమాల్లో పాల్గొనే ప్లాన్ చేసుకున్నారు. దీనికి బీజేపీ, జనసేన నాయకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మేం కూడా ప్రభుత్వంలో భాగస్వాములమేనని.. తాము కూడా పాల్గొంటామని ఆయా పార్టీల నాయకులు పట్టుబడుతున్నారు.
దీనికి టీడీపీనేతలు ససేమిరాఅంటున్నారు. ఇది మాటల యుద్ధాలకు.. భౌతిక దాడులకు కూడా దారితీ స్తుండడం గమనార్హం. దెందులూరు నియోజకవర్గంలో ఇదే తరహా పరిస్థితి ఏర్పడింది. ఇక, గుడివాడలో అయితే.. టీడీపీ నాయకులు ముందుగానే అధికారులను హెచ్చరించారు. తమకు తెలియకుండా.. రూపాయి కూడా ప్రజలకు పంచడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. విజయవాడ తూర్పు, సెంట్రల్‌లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. దీంతో పించన్ల పంపినీ వ్యవహారం. కూటమి పార్టీల్లో తలనొప్పులు తీసుకురావడం గమనార్హం.