ఘనమైన టీడీపీకి.. ఆ ధైర్యం లేదా?
అయితే ఎప్పుడూ పొత్తుల కోసం చూడటం తప్ప.. పార్టీకి ఉన్న బలమైన క్యాడర్, అభిమాన బలాన్ని టీడీపీ ఎందుకు నమ్మలేకపోతుందన్నది ప్రశ్న.
పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఘనమైన చరిత్ర తెలుగు దేశం పార్టీది. బలంగా ఉన్న కాంగ్రెస్ను ఢీ కొట్టి తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదాన్ని వినిపించి స్వర్గీయ నందమూరి తారక రామారావు 1982లో టీడీపీని గెలిపించారు. 1984 మధ్యంతర ఎన్నికల్లోనూ కుట్రలు కుతంత్రాలను దాటి మరోసారి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఒంటరిగానే ప్రత్యర్థులను సమర్థంగా ఎదుర్కొన్నారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా దేశానికి ప్రధానిని అందించిన నేషనల్ ఫ్రంట్కు ఎన్టీఆర్ ఛైర్మన్గానూ ఉన్నారు. ఒకప్పుడు టీడీపీతో పొత్తు కోసం ఇతర పార్టీలు పోటీపడేవి. సంజయ్ విచార్ మంచ్ లాంటి చిన్న పార్టీతో సహా బీజేపీ, వామపక్షాలతో కలిసి టీడీపీ సాగింది.
కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పార్టీని చంద్రబాబు గుప్పిట్లోకి తీసుకున్న తర్వాత పొత్తుల కోసం అర్రులు చాచాల్సిన పరిస్థితి టీడీపీకి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 1999, 2004లో బీజేపీతో కలిసి పోటీ చేసిన టీడీపీ.. మొదటి సారి గెలిచి, ఆ తర్వాత ఓడింది. 2009లో సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్)తో కలిసి టీడీపీ పోటీ చేసింది. అయినా ఓటమి తప్పలేదు. 2014లో బీజేపీ, జనసేనతో కలిసి ఏపీలో బరిలో దిగి విజయం సాధించింది. కానీ 2019లో తొలిసారి పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసిన టీడీపీ.. జగన్ ధాటికి చిత్తయింది.
ఇప్పుడు 2024 ఏపీ ఎన్నికల్లో మరోసారి బీజేపీ, జనసేనతో కలిసి టీడీపీ పోటీ చేసే అవకాశముంది. అయితే ఎప్పుడూ పొత్తుల కోసం చూడటం తప్ప.. పార్టీకి ఉన్న బలమైన క్యాడర్, అభిమాన బలాన్ని టీడీపీ ఎందుకు నమ్మలేకపోతుందన్నది ప్రశ్న. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను టీడీపీ ఏలింది. ఎన్టీఆర్ పిలుపుతో ప్రజలు టీడీపీకి అండగా నిలిచారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో బాబు చేతుల్లోకి వచ్చిన టీడీపీకి ఆదరణ తగ్గింది. కానీ ఇప్పటికీ టీడీపీ అంటే అభిమానం ఉన్న వాళ్లు లక్షల్లో ఉన్నారు. ఆ అభిమానాన్ని అనుకూలంగా మార్చుకుని సాగే ధైర్యం టీడీపీ చేయలేపోతుందనే చెప్పాలి.