టార్గెట్ 100 డేస్.. : అన్న క్యాంటీన్లు ఎన్నంటే!
2019లో ప్రారంభించిన అన్న క్యాంటీన్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి, వాటిని వినియోగంలోకి తెచ్చేందు కు చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్రంలో కూటమి సర్కారు కొలువు దీరింది. ఆ వెంటనే వడివడిగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కార్యాచరణ ప్రారంభించారు. ప్రాధాన్యాల పరంగా వాటిని నెరవేర్చే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. దీనిలో ఇప్పుడు మరో ప్రాధాన్యం అంశంగా అన్న క్యాంటీన్లపై సర్కారు ప్రణాళికలు రెడీ చేసింది. నేటి నుంచే ఈ ప్రక్రియ మొదలవుతుంది. మొత్తం 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 203 క్యాంటీన్లు ప్రారంభించనున్నారు.
2019లో ప్రారంభించిన అన్న క్యాంటీన్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి, వాటిని వినియోగంలోకి తెచ్చేందు కు చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. గతంలో మంజూరు చేసిన 203 క్యాంటీ న్ భవనాల్లో 184 వరకు అప్పట్లో పూర్తయ్యాయి. పాత డిజైన్ మేరకు మిగిలిన వాటి నిర్మాణ పనులకు టెండర్లు పిలవాలని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో ఆయా పనులను కూడా 100 రోజుల్లోనే పూర్తి చేయాలని ఖచ్చితంగా సెప్టెంబరు 21 నాటికి వీటిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్దేశించింది.
ముఖ్యంగా శనివారం నుంచే(జూన్ 15) అన్న క్యాంటీన్ల కోసం సిబ్బందిని కేటాయించి.. దీనిపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సర్కారు ఆదేశించింది. పాత భవనాలలోఆర్బీకేలు ఏర్పాటు చేయడం.. గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం వంటివి జరిగిన క్రమంలో వాటిని అక్కడ నుంచి తొలగించి వేరే ప్రాంతాలలో ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఆహార తయారీకి ఏజెన్సీలను సిద్ధం చేయాలి. క్షేత్రస్థాయిలో క్యాంటీన్లలో మౌలిక సదుపాయాలను కల్పించాలి.
క్యాంటీన్లు లేని ప్రాంతాల్లో.. కొత్తవాటి ఏర్పాటుకు తక్షణమే కలెక్టర్లు భూములు కేటాయించాలి. వాటిని నెల రోజుల్లో పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయాలి. క్యాంటీన్లకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సరఫరా చేసే ఏజెన్సీలను ఖరారు చేయాలి. ఆహార నాణ్యత విషయంలో రాజీ పడడానికి వీల్లేకుండా చర్యలు చేపట్టాలి. ఈ మొత్తం కార్యక్రమాలు సెప్టెంబరు 15 నాటికి పూర్తి చేసి అదే నెల 21 నుంచి క్యాంటీన్లను ప్రారంభించాలి.