టీడీపీ కార్యకర్తల మాట - ఇండియానే బెటరా ?

తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు రాజకీయాలకు ఇండియా కూటమే బెటరని పార్టీలో తమ్ముళ్లు సీరియస్ గా చర్చించుకుంటున్నారు

Update: 2023-09-21 05:50 GMT

తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు రాజకీయాలకు ఇండియా కూటమే బెటరని పార్టీలో తమ్ముళ్లు సీరియస్ గా చర్చించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో జాతీయ స్థాయి రాజకీయాల్లో టీడీపీ పరిస్థితిపై పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో బీజేపీ లేదా ఎన్డీయే కూటమిలోని కీలక నేతలు ఎవరూ నోరు విప్పలేదు. దాంతో తమ్ముళ్లలో ఒకవైపు అనుమానం మరోవైపు అసహనం పెరిగిపోతోంది. చంద్రబాబు అరెస్టు, రిమాండ్ వెనకాల బీజేపీ పెద్దల హస్తముందనే అనుమానాలు బయలుదేరి ఇపుడు బలపడుతోంది.

ఇందులో భాగంగానే భవిష్యత్తు రాజకీయాలకు ఇండియా కూటమితో వెళితేనే మంచిదనే అభిప్రాయం తమ్ముళ్ళల్లో పెరిగిపోతోంది. దాదాపు వారం రోజులుగా లోకేష్ ఢిల్లీలోనే క్యాంపు వేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలవాలని లోకేష్ ప్రయత్నించినా ఇంకా అది వర్కవుట్ కాలేదని పార్టీ వర్గాలు చెప్పాయి. ఉద్దేశ్యపూర్వకంగానే బీజేపీ పెద్దలు లోకేష్ ను అవాయిడ్ చేస్తున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుకనే పార్టీ నేతల్లో అసహనం బాగా పెరిగిపోతోంది.

ఏ రకంగా చూసుకున్నా టీడీపీకి ఇండియా కూటమే మంచిదనే ఆలోచనలో తమ్ముళ్ళున్నారు. ఎన్డీయేకి దగ్గరవుదామని చంద్రబాబు అనుకోవటంలో తప్పులేదని అయితే అవసరానికి కూడా వాళ్ళు ఆదుకోనపుడు ఏమిచేయాలి ? అనే ప్రశ్న తమ్ముళ్ళలో పెరిగిపోతోంది. ఎన్డీయే వైపు చూడటం కన్నా ఇండియా కూటమి వైపు నడిచుంటే ఈ పాటికి చాలాపార్టీలు మద్దతుగా నిలిచేవన్న ఆలోచనే తమ్ముళ్ళల్లో పెరిగిపోతోంది. ఇప్పటికే పార్టీకి జరగాల్సిన డ్యామేజి జరిగిపోయింది కాబట్టి ఇకనుండైనా చంద్రబాబు గట్టి నిర్ణయం తీసుకోవాలని తమ్ముళ్ళు కోరుకుంటున్నారు.

రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఎన్డీయేనే అధికారంలోకి వచ్చినా బలమైతే తగ్గిపోవటం ఖాయమనే అంచనాలు పెరిగిపోతున్నాయి. జాతీయ స్ధాయిలో కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటోందని, ఇదే సమయంలో బీజేపీ జోరు తగ్గిపోవటం ఖాయంగా సూచనలు కనబడుతున్నట్లు చెబుతున్నారు. ఎన్డీయేలో బీజేపీ ఊపు తగ్గిపోతే పార్టీ పెద్దలు ఇపుడున్నంత దూకుడుగా ముందుకు వెళ్ళలేరనే అభిప్రాయం కూడా తమ్ముళ్లలో పెరుగుతోంది. అప్పుడు బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమే నిలవటం ఖాయమని అనుకుంటున్నారు. కాబట్టి ఇండియా కూటమికి మద్దతుగా నిలబడితేనే పార్టీకి దీర్ఘకాలికంగా మేలు జరుగుతుందని భావిస్తున్నారు. మరి లోకేష్, చంద్రబాబు ఏమి నిర్ణయిస్తారో చూడాలి.

Tags:    

Similar News