టీడీపీ మాజీ మంత్రికి రిటైర్మెంట్ ఇచ్చేశారా...!?
సీనియర్ మోస్ట్ లీడర్లుగా ఉంటూ పార్టీలో దశాబ్దాల పాటు పనిచేసిన అనుభవం ఉన్న మాజీ మంత్రులకు ఈసారి టికెట్ విషయంలో టీడీపీ హైకమండ్ టిక్కెట్టేస్తోంది.
తెలుగుదేశం పార్టీలో టికెట్ కోసం ఆశిస్తున్న వారిలో కొందరికి నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెబుతున్నారు. మరి కొందరికి మాత్రం ఇక రాజకీయ రిటైర్మెంట్ ఖాయం అని చెప్పేస్తున్నారు. సీనియర్ మోస్ట్ లీడర్లుగా ఉంటూ పార్టీలో దశాబ్దాల పాటు పనిచేసిన అనుభవం ఉన్న మాజీ మంత్రులకు ఈసారి టికెట్ విషయంలో టీడీపీ హైకమండ్ టిక్కెట్టేస్తోంది.
పొత్తుల పేరుతో వారి సీటు కిందకు నీరు చేరుతోంది. దాంతో వారి రాజకీయ జీవితం ఇక్కడితో ఫుల్ స్టాపేనా అన్న చర్చ వస్తోంది. విశాఖ జిల్లాలో చూస్తే సీనియర్ నేతగా బండారు సత్యనారాయణ మూర్తి ఉన్నారు. ఆయన 1987 నుంచి టీడీపీలో కీలక నేతగా ఉన్నారు. ఆయన మొదట ఎంపీపీగా గెలిచారు.
ఆ తరువాత 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా పరవాడ నుంచి గెలిచారు. 1994, 1999లలో కూడా ఆయన గెలిచారు. 2004లో ఓటమి చెందారు. 2009లో పరవాడ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజనలో పెందుర్తిలో కొంత భాగం చేరింది. అలా పెందుర్తి నుంచి మూడు ఎన్నికల్లో పోటీ చేసిన బండారుకు 2014లో విజయం వరించింది.
అప్పట్లో మంత్రి కావాలని ఆయన ఆశపడినా చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు. ఇక 2019లో ఆయన భారీ తేడాతో వైసీపీ చేతిలో ఓటమి పాలు అయ్యారు. 2024లో పోటీ చేసి తన రాజకీయ వారసుడిని సెట్ చేసుకోవాలని బండారు భావించారు.
కానీ పొత్తుల కారణంగా పెందుర్తి సీటు ఆయనకు దక్కడం లేదు అన్నది తాజా కబురు. పెందుర్తి సీటుని జనసేన రూరల్ జిల్లా ప్రెసిడెంట్ పంచకర్ల రమేష్ బాబుకు అప్పగిస్తున్నారు అని తెలుస్తోంది. ఆయన ఈ సీటు హామీతోనే జనసేనలో చేరారు అని అంటున్నారు. ఇక చూస్తే 2009లో ప్రజారాజ్యం తరఫున తొలిసారి రాజకీయ ఎంట్రీ ఇచ్చిన పంచకర్ల అప్పట్లో పెందుర్తి నుంచి పోటీ చేసి గెలిచి టీడీపీ నుంచి పోటీ చేసిన బండారుని ఓడించారు.
ఇపుడు ఆయన ఏకంగా బండారు సీటుకే ఎసరు పెడుతున్నారు అని ఆయన వర్గం ఆవేదన చెందుతోంది. అయితే పొత్తులలో భాగంగా ఈ సీటు జనసేనకే ఇచ్చేందుకు టీడీపీ చూస్తోంది అని అంటున్నారు. ప్రజారాజ్యం తరఫున 2009లో గెలిచిన పెందుర్తి సీటుని ఇపుడు మరోసారి దక్కించుకోవాలని ఆ పార్టీ చూస్తోంది.
దాంతో బండారు ఆశలు అన్నీ అవిరి అవుతున్నాయని అంటున్నారు. అయినా సరే ఆయన తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. కానీ బండారుకు సీటు దక్కడం కష్టం అనే అంటున్నారు. ఈ దఫా కనుక సీటు దక్కకుందా పోటీ చేయకపోతే మాత్రం రాజకీయంగా బండారుకు రిటైర్మెంటే అని అంటున్నారు. 2029 నాటికి అవకాశం ఉంటుందో లేదో ఎవరికి తెలుసు అన్న చర్చ కూడా వస్తోంది.
ఇక ఏడు పదుల వయసుకు చేరువలో ఉన్న బండారుకు టికెట్ నిరాకరించడం ద్వారా ఆయనకు టీడీపీయే పొలిటికల్ రిటైర్మెంట్ ఇచ్చేసింది అని అంటున్నారు. బండారు 1998 ప్రాంతంలో మొదటిసారి మంత్రి అయ్యారు. ఆయన మరోసారి మంత్రి అయి తన రాజకీయ జీవితం సక్సెస్ ఫుల్ గా విరమించాలని అనుకున్నారు. కానీ ఇలా బలవంతంగా రాజకీయాలకు దూరం కావడం మాత్రం ఇబ్బందికరమే అని అంటున్నారు. మరి చంద్రబాబు ఎమ్మెల్సీ లాంటి హామీ ఏదైనా ఇస్తారా అన్నది చూదాలని అంటున్నారు.