హెయిర్ కట్ చేయించుకోమన్నారని... యువకుడు దారుణ నిర్ణయం!
దీంతో విషయం తెలుసుకున్న జ్ఞానేశ్వర్ సోదరుడు స్వాతిక్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇటీవల కాలంలో ఇంట్లో తల్లితండ్రులో, కాలేజీల్లో అధ్యాపకులో, స్కూల్లో ఉపాధ్యాయులో.. ఎవరు ఏ విషయంపై మందలించినా.. నేటి యువతరం అ విషయాన్ని అవమానంగా భావించడం, అనంతరం కీలక నిర్ణయాలు తీసుకోవడం.. ఫలితంగా కన్నవారికి కడుపుకోత మిగులుస్తుండటం వంటి సంఘటనలు తరచూ జరుగుతున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలోనే తాజాగా కాలేజీ అధ్యాపకుడు మందలించాడని ఒక యువకుడు దారుణానికి ఒడిగట్టాడు.
అవును... కాలేజీకి సరిగా రావడం లేదు, అన్ని పరీక్షల్లోనూ ఫెయిల్ అవుతున్నావు, ముందు ఆ జుట్టు కత్తిరించుకో అంటూ తోటి విద్యార్థుల ముందు ఒక విద్యార్థిని అధ్యాపకుడు మందలించారు.. అనంతరం, పర్సనల్ గా కౌన్సిలింగ్ కూడా ఇచ్చారని అంటున్నారు! అయితే తోటి విద్యార్థులు అందరి ముందూ తనను అవమానించారని భావించిన ఆ యువకుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో భాగంగా.. బిల్డింగ్ పైకి ఎక్కి దూకేశాడు.
వివరాళ్లోకి వెళ్తే... సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్ కు చెందిన నక్కిరెడ్డి జ్ఞానేశ్వర్ రెడ్డి (19) అనే యువకుడు.. ఘట్ కేసర్ మండలంలోని అనురాగ్ యూనివర్శిటీలో సీ.ఎస్.ఈ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా క్లాసులకు లేటుగా రావడంతో పాటు నాలుగు రోజుల క్రితం వచ్చిన ఫస్ట్ సెం ఎగ్జాంస్ ఫలితాల్లో అన్నింటా ఫెయిల్ అయ్యాడట!
దీంతో డీన్ వీఎస్ రావు విద్యార్థికి అతనికి కౌన్సెలింగ్ ఇస్తున్నారట. ఇదే సమయంలో హెయిర్ కట్ కూడా చేయించుకొని కనిపించాలని సూచించారని తెలుస్తుంది. అయితే... తోటి విద్యార్థుల ముందు డీన్ మందలించాడని అవమానంగా భావించిన జ్ఞానేశ్వర్... యూనివర్శిటీ భవనం రెండో అంతస్తు నుంచి దూకేశాడు! దీంతో వెంటనే అతడిని విశ్వవిద్యాలయంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు అధ్యాపకులు.
దీంతో విషయం తెలుసుకున్న జ్ఞానేశ్వర్ సోదరుడు స్వాతిక్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇందులో భాగంగా తన సోదరుడిని అధ్యాపకుడు అవమానించడంతోనే ఆత్మహత్యాయత్నం చేశాడని తెలిపాడు. అయితే ఈ విషయంపై స్పందించిన డీన్... జ్ఞానేశ్వర్ రెడ్డి తరగతులకు సరిగా రావడంలేదని.. ఫస్ట్ సెం లో ఫెయిలయ్యాడని, జుట్టు పెరడగడంతో కటింగ్ చేయించుకోవాలని కౌన్సెలింగ్ మాత్రమే ఇచ్చానని చెబుతున్నారు!!