చంద్రబాబుపై టీ.కాంగ్రెస్ యుద్ధభేరి?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి సరిగ్గా ఏడాది అయింది. ఇదేసమయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు కావస్తోంది.

Update: 2024-12-20 09:30 GMT

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి సరిగ్గా ఏడాది అయింది. ఇదేసమయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు కావస్తోంది. కాంగ్రెస్ పాలనలోని తొలి ఆర్నెల్లు అప్పటి ఏపీ వైసీపీ ప్రభుత్వంతో పెద్దగా సంబంధాలు లేకుండానే గడిచింది. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ ప్రభుత్వంతో మంచి సంబంధాల కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అధికారిక సమావేశాలు, అధికారుల స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత పరిష్కారం కాని సమస్యలపై చర్చించి ఆ సమస్యలకు ముగింపు పలకాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక రాజకీయంగా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉన్న సంబంధాల వల్ల అంతా సజావుగా సాగుతుందని, రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయని అంతా ఆశించారు.

కానీ, ఇంతలో ఏమైందో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆకస్మికంగా యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఉన్నఫళంగా ఏపీ ప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ముఖ్యంగా తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబుతో కావాలని గ్యాప్ పెంచుకోవాలని చూస్తున్నట్లు అనిపిస్తోంది.

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అయినా ఏపీకి రాజధాని లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి కీలక అడుగులు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో పొరుగు రాష్ట్రం సహకరించాల్సింది పోయి అమరావతి మునిగిపోతుందని, ఆ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని, రియల్ ఏస్టేట్ పడిపోయిందని వ్యాఖ్యలు చేసి రచ్చ రగిల్చారు మంత్రి పొంగులేటి, మరోవైపు తెలుగు తల్లి ఫ్లైవోవర్ పేరును తెలంగాణ తల్లిగా మార్చాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సచివాలయం పక్కనే ఉన్న స్థలంలో నూతన అసెంబ్లీ నిర్మించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ ప్రభుత్వంతో సత్సంబంధాలు కోరుకుంటుండగా, మంత్రులు ఎమ్మెల్యేలు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అవుతోంది. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఏమైనా ఉన్నాయా? లేక వారు ఏమైనా రహస్య అజెండా అమలు చేస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అయితే ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తే కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు వెనుక రహస్య అజెండా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి స్వతంత్రంగా పోరాడి విజయం సాధించినా, ఆయన ఇప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్లోనే నడుస్తున్నట్లు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అదేసమయంలో రేవంత్ రెడ్డిని చిట్టి నాయుడు అంటూ సంభోదిస్తూ చంద్రబాబు వారసుడనేలా విమర్శలు చేస్తోంది. తెలంగాణ ఉద్యమంలో ఆ తర్వాత జరిగిన రాజకీయ యుద్ధంలో చంద్రబాబును విలన్ గా చూపి అప్పటి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ లబ్ధి పొందింది.

గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రేవంత్ రెడ్డిని ఎదుర్కోవాలంటే మళ్లీ చంద్రబాబును బూచిగా చూపాలనేది బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. దీన్ని పసిగట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబుపై యుద్ధం ప్రకటించి ఆయనతో తనకు సంబంధాలు లేవని ప్రచారం చేయాలని భావిస్తున్నట్లుగా కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే తనకు సన్నిహితులైన నేతలను రంగంలోకి దింపి అమరావతిపైనా, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సమాధిపైన వ్యాఖ్యలు చేయించినట్లు అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ పాలనకు గుర్తుగా ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరూ మార్చాలని డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య యుద్ధం పతాకస్థాయిలో నడుస్తోంది. ఇదేసమయంలో ఎన్డీఏ కూటమితో కలిసి పయనిస్తున్న చంద్రబాబు తెలంగాణలో బీజేపీ బలోపేతానికి సహకరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో టీసీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే చంద్రబాబును, టీడీపీని లక్ష్యంగా చేసుకుని పనిచేయాలని, ఆ విధంగా తనపై వస్తున్న విమర్శలతోపాటు బీఆర్ఎస్, బీజేపీలను నిలువరించాలని ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News