హాట్ కేక్.. ఆ పార్టీలో చేరీ చేరగానే ఎంపీ టికెట్
వచ్చే ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఎంపీ స్థానల్లో గెలుస్తామని ప్రకటిస్తున్న ఆ పార్టీ.. తెలంగాణలో చేరిన వెంటనే నాయకులకు టికెట్లు ఇస్తోంది
వచ్చే ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఎంపీ స్థానల్లో గెలుస్తామని ప్రకటిస్తున్న ఆ పార్టీ.. తెలంగాణలో చేరిన వెంటనే నాయకులకు టికెట్లు ఇస్తోంది. ఇప్పటివరకు డబుల్ డిజిట్ లో సీట్లు గెలవని ఆ పార్టీ ఈసారి ఆ మార్క్ దాటుతామని చెబుతోంది. ఇప్పటికే తొలి జాబితాలో 9 సీట్లకు అభ్యర్థులను ప్రకటించి.. ముందంజలో ఉంది. మరో ఐదు సీట్లకూ అభ్యర్థులను ఖరారు చేసేసింది. అయితే, వీరంతా ఇలా పార్టీలో చేరి అలా టికెట్ పొందినవారే కావడం గమనార్హం.
కొత్తవారికి పెద్దపీట
లోక సభ ఎన్నికల్లో ఒంటరిగానే 370 సీట్లు నెగ్గుతామని చెబుతున్న బీజేపీ తెలంగాణో కొత్తవారికి పెద్దపీట వేస్తోంది. మిగిలిన 8 స్థానాలకు రెండు రోజుల్లో అభ్యర్థిత్వాలను ఖరారు చేయనుంది. ఇప్పటివరకు వరంగల్ మినహా అన్ని నియోజకవర్గాలపైనా స్పష్టత ఇచ్చేసింది. ఈ క్రమంలో ఐదు సీట్లలో కొత్తగా చేరినవారికి టికెట్లు కేటాయించడం గమనార్హం.
సిటింగ్ ను కాదని..
బీజేపీకి గత ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు వచ్చాయి. ఇది ఎవరూ ఊహించనిది. వీరిలో ఈసారి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుకు టికెట్ ఇవ్వలేదు. ఇక్కడినుంచి మాజీ ఎంపీ గోడం నగేశ్ ను దింపుతోంది. ఇక దక్షిణ తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండలలో బీజేపీ ప్రభావం శూన్యం. అయినప్పటికీ.. వాటిపై గట్టిగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఖమ్మంలో ప్రభావవంతమైన నాయకుడు అయిన జలగం వెంకట్రావును పార్టీలో చేర్చుకుని ఎంపీ టికెట్ ఇవ్వనుంది. నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని ఎంపిక చేసింది. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన, 2009లో పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీకి దిగిన గోమాస శ్రీనివాస్ ను మళ్లీ అక్కడ నిలపనుంది. మహబూబాబాద్ లో మాజీ ఎంపీ సీతారాం నాయక్ ను పోటీ చేయిస్తోంది. వరంగల్ లో మాత్రమే పెండింగ్ లో ఉండగా.. ఇక్కడ ఉద్యమ నేపథ్య నాయకుడి కోసం చూస్తోందని తెలుస్తోంది. కాగా, తాజాగా టికెట్లు ఖరారైన ఐదుగురూ కొన్ని రోజుల కిందట బీజేపీలో చేరినవారే కావడం గమనార్హం.
నాగర్ కర్నూల్, జహీరాబాద్ లోనూ
నాగర్ కర్నూల్ (ఎస్సీ) టికెట్ ను సిటింగ్ బీఆర్ఎస్ ఎంపీ పి.రాములు కుమారుడికి, జహీరాబాద్ టికెట్ ను సిటింగ్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కు బీజేపీ ఇచ్చింది. పాటిల్ పార్టీలో చేరిన రెండో రోజే టికెట్ పొందారు. రాములు కుమారుడికి మూడో రోజు టికెట్ లభించింది. మొత్తం మీద తెలంగాణలోని 17 స్థానాలకు గాను ఏడు స్థానాల్లో బీజేపీ కొత్త ముఖాలకు అదికూడా పార్టీలో చేరిన రోజుల వ్యవధిలోనే టికెట్లు ఇచ్చిందన్నమాట.