తెలంగాణపై కాంగ్రెస్ ఎంత కేర్ ఫుల్ అన్నది గురువారం చెప్పేసింది

ఈ ఉదంతాన్ని నిశితంగా పరిశీలిస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్ని కాంగ్రెస్ ఎంత కేర్ ఫుల్ గా వ్యవహరిస్తుందన్న విషయం ఇట్టే అర్థమవుతుందని చెబుతున్నారు

Update: 2023-09-29 05:11 GMT

కీలకమైన వేళలో తీసుకునే నిర్ణయాల్లో ఏ చిన్న తేడా వచ్చినా దానికి చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంది. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండటమే కాదు.. గతంలో ఎప్పుడూ లేనంతగా ఉనికి కోసం పారాడే పరిస్థితి కాంగ్రెస్ లో నెలకొన్న సంగతి తెలిసిందే. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వీలైనన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని సొంతం చేసుకోవటం ద్వారా 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తన సత్తా చాటాలని భావిస్తోంది కాంగ్రెస్.

అందుకు తగ్గట్లే.. పక్కా వ్యూహాన్ని అమలు చేయటమే కాదు.. ప్రతి అంశాన్ని కేర్ ఫుల్ గా పరిశీలిస్తున్న వైనం కనిపిస్తుంది. గురువారం దీనికి సంబంధించి చోటు చేసుకున్న రెండు ఉదంతాలే నిదర్శనంగా చెప్పొచ్చు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావటానికి సంబంధించి కాంగ్రెస్ అధినాయకత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తెలంగాణలో పార్టీకి అధికారంలోకి రావటానికి అవకాశాలు ఫుల్ గా ఉన్న వేళ.. ఇప్పుడు కాకుంటే మరెప్పటికి అన్నంత పట్టుదలతో వ్యవహరిస్తోంది.

పార్టీకి మేలు చేసే చిన్న విషయాన్ని విడిచి పెట్టకుండా వ్యూహ రచన చేస్తున్న వైనం కనిపిస్తుంది. మల్కాజిగిరి సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి.. తనతో పాటు తన కొడుక్కి కూడా టికెట్ అడగటం.. అందుకు గులాబీ బాస్ నో చెప్పేయటం.. అందుకు కారణం మంత్రి ర గా భావించిన మైనంపల్లి ఆయన్ను ఒక రేంజ్ లో విమర్శలు చేయటం తెలిసిందే. అనంతరం ఆయన బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసి.. కాంగ్రెస్ లో చేరేందుకు వీలుగా పావులు కదపటం తెలిసిందే.

ఇందులో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సమక్షంలో మైనంపల్లి.. ఆయన కుమారుడు కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటం తెలిసిందే. ఇదిలాఉంటే.. గురువారం ఉదయం మరో ఆసక్తకర పరిణామం చోటు చేసుకుంది. పార్టీలోకి మైనంపల్లి ఎంట్రీని తప్పు పడుతూ.. టికెట్ విషయంలో తనకు నష్టం వాటిల్లుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్న సీనియర్ నేత నందికంటి శ్రీధర్ ను బుజ్జగించే కార్యక్రమాలు షురూ అయ్యాయి.

మైనంపల్లికి పార్టీ టికెట్ ఇవ్వొద్దంటూ.. గళం విప్పిన నందికంటిని కాంగ్రెస్ పార్టీకి కీలకంగా వ్యవహరించే రాహుల్ గాంధీతో భేటీ కావటం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు మైనంపల్లిని పార్టీలో చేర్చుకుంటున్న రోజునే.. అదేరోజున అసంత్రప్తితో ఉన్న నందికంటిని రాహుల్ ను కలిసేలా చేయటం ఆసక్తికరంగా మారింది. నిజానికి రాహుల్ తో నందికంటి భేటీపై మీడియాలోనూ కవర్ కాలేదు.

ఈ ఉదంతాన్ని నిశితంగా పరిశీలిస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్ని కాంగ్రెస్ ఎంత కేర్ ఫుల్ గా వ్యవహరిస్తుందన్న విషయం ఇట్టే అర్థమవుతుందని చెబుతున్నారు. మైనంపల్లి పార్టీలో చేరుతున్న వేళ.. ఆయన కాలికి ముల్లులా మారిన నందికంటిని అదే రోజున.. కాంగ్రెస్ అధినాయకత్వంతో కలిపి.. బుజ్జగింపు చర్యలు షురూ చేసినట్లుగా చెబుతున్నారు. చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలన్నట్లుగా.. నియోజకవర్గ స్థాయి నాయకుడ్ని తీసుకొని పార్టీ అధినాయకత్వం వద్ద భేటీ అయ్యేలా చేయటం అంటే.. తెలంగాణ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ ఎంత అప్రమత్తంగా ఉందన్న విషయం చెప్పకనే చెప్పినట్లుగా చెప్పాలి.

ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. అదేమంటే.. గురువారం రాత్రి పార్టీలోకి మైనంపల్లిని ఆహ్వానించే కార్యక్రమంలో ప్రముఖంగా ఫోకస్ అయిన రేవంత్.. గురువారం ఉదయం ఆయన ప్రత్యర్థి నందికంటిని తీసుకొని రాహుల్ వద్దకు వెళ్లిన ఎపిసోడ్ లోనూ రేవంత్ కీలక పాత్ర పోషించారని చెప్పాలి. ఈ ఒక్క పరిణామం చాలు.. ప్రతి నియోజకవర్గాన్ని అధినాయకత్వం ఎంత సీరియస్ గా తీసుకుందన్నది అర్థమవుతుంది.

Tags:    

Similar News