టీ హోంమంత్రికి కోపమొచ్చింది.. కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమంది
రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు వేళ.. చోటు చేసుకున్న ఈ పరిణామం ఇబ్బందికరంగా మారింది
అనూహ్య రీతిలో వివాదంలో చిక్కుకున్నారు తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి. రాష్ట్రంలోని పోలీసులందరికి సూపర్ బాస్ అయిన ఆయన.. ఒక పోలీసుపై కోపంతో చెంప ఛెళ్లుమనిపించారు. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు రోజుల వ్యవధిలోకి వచ్చేసిన వేళ.. హోం మంత్రి చర్య ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మారింది.
రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు వేళ.. చోటు చేసుకున్న ఈ పరిణామం ఇబ్బందికరంగా మారింది. అమీర్ పేట డీకే రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహార కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్.. మహమూద్ అలీతో పాటు పలువురు అధికార పార్టీ నేతలు హాజరయ్యారు. మంత్రితలసాని పుట్టినరోజును పురస్కరించుకొని వేదిక మీదకు వచ్చిన హోం మంత్రి ఆయన్ను ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయనకు పూల బొకే ఇవ్వాలని హోం మంత్రి భావించారు. అయితే.. ఆయన వ్యక్తిగత భద్రతాధికారి ఖాళీ చేతులతో ఉండటం.. పూలబొకే రావటం సెకన్లు ఆలస్యం కావటంతో పట్టరాని కోపానికి గురైన మహమూద్ అలీ.. ఆయన చెంప ఛెళ్లుమనిపించారు. దీంతో షాక్ తిన్న గన్ మెన్ మంత్రిని అలా చూస్తుండిపోయారు. అయితే.. ఈ పరిణామాన్ని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు మంత్రి తలసాని. అయితే.. హోం మంత్రి చర్యతో అందరూ షాక్ తిన్నారు.
మహమూద్ అలీ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంత హోంమంత్రి అయితే మాత్రం సిబ్బందిపై ఇలా దురుసుగా వ్యవహరించటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పోలీసులను ఉద్దేశించి విపక్ష నేతలు విమర్శలు చేసినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి హడావుడి చేసే పోలీసు అధికారుల సంక్షేమ సంఘాలు.. పోలీసు యూనియన్లు.. ఇప్పుడేం చేస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. హోం మంత్రి చర్యను ఎందుకు ఖండిచంటం లేదన్న మాట పెద్ద ఎత్తున వినిపిస్తోంది.