తెలుగు పాలిటిక్స్ 2024 : గెలిచినా వికసించని ఏపీ బీజేపీ!

ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటో కానీ సీట్లూ ఓట్లూ ఈసారి దండీగా వచ్చినా ఉనికి పోరాటమే చేస్తోంది.

Update: 2024-12-16 04:23 GMT

ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటో కానీ సీట్లూ ఓట్లూ ఈసారి దండీగా వచ్చినా ఉనికి పోరాటమే చేస్తోంది. టీడీపీ కూటమిలో మూడవ పార్టీగా ఉన్నా కూడా పెద్దగా గుర్తింపు అయితే లేదు. నిన్నటికి నిన్న స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రిలీజ్ లోనూ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి కనిపించలేదు. ఈ డాక్యుమెంట్ మీద చంద్రబాబు పవన్ మాత్రమే సంతకాలు చేసి రిలీజ్ చేశారు.

ఈ ఏడాదిలో బీజేపీకి ఏపీలో రాజకీయంగా మంచి రోజులే వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల వరకూ జనసేనతో పొత్తు ఉన్నా పెద్దగా పొలిటికల్ సీన్ లోనికి రాని బీజేపీ టీడీపీతో పొత్తు ప్రకటన రాగానే జోరు పుంజుకుంది. బీజేపీ సీట్ల కోసం పోటీ పెరిగింది. ఎందుకంటే పొత్తులు ఉంటే బీజేపీకి ఎపుడూ గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఇది అనేకసార్లు జరిగింది.

అది 2024 ఎన్నికల్లోనూ రుజువు అయింది. పది అసెంబ్లీ సీట్లకు బీజేపీ పోటీ చేస్తే ఎనిమిది సీట్లను గెలుచుకుంది. రాయలసీమ లాంటి చోట్ల కూడా కమలం జెండా ఎగిరింది. అంటే అసెంబ్లీ వరకూ చూస్తే ఎనభై శాతం సక్సెస్ రేటు కొట్టింది అన్న మాట. ఇక పార్లమెంట్ సీట్లు ఆరింటిని బీజేపీ తీసుకుని పోటీ చేస్తే అందులో మూడింటిని గెలిచింది. అంటే ఇది యాభై శాతం సక్సెస్ రేటు అన్న మాట.

గెలిచిన తరువాత కేంద్రంలో ఒక సహాయ మంత్రి పదవి బీజేపీకి దక్కింది. అలాగే ఏపీ కేబినెట్ లో ఒక మంత్రి పదవి దక్కింది. అయితే ఏపీలో ఎక్కడ చూసినా టీడీపీ జనసేన హవాయే కనిపిస్తోంది తప్ప బీజేపీ ఊసు అయితే పెద్దగా లేదని అంటున్నారు. బీజేపీలో ఎందరో సీనియర్ నెతలు ఉన్నారు. ఇక ఎంపీలలో చూస్తే దగ్గుబాటి పురంధేశ్వరి, సీఎం రమేష్ వంటి వారు కనిపిస్తారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా సుజనా చౌదరి ఆది నారాయణరెడ్డి వంటి వారు ఉన్నారు.రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణు కుమార్ రాజు లాంటి వారూ ఉన్నారు.

ఇక బీజేపీ పెద్దలతో ఎంతో సాన్నిహిత్యం ఉన్న సత్యకుమార్ మంత్రిగా కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. ఇలా బీజేపీకి మంచి లీడర్లు ఉన్నా కూడా ఏపీలో ఆ పార్టీ తనదైన రాజకీయ ముద్ర అయితే బలంగా వేయలేకపోతోంది అని అంటున్నారు. జనంలోకి ఎపుడూ టీడీపీ జనసేన మాత్రమే చర్చకు వస్తున్నాయి.

అంతే కాదు నామినేటెడ్ పదవుల విషయంలోనూ బీజేపీని పెద్దగా పట్టించుకోవడం లేదు అన్న మాట ఉంది. నాలుగు ఎమ్మెల్యేలు ఉంటే ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చి 2014లో కేబినెట్ కూర్పు చేసిన చంద్రబాబు ఈసారి ఎనిమిది మంది గెలిస్తే ఒక్కరికే ఇచ్చారు. కీలక విషయాలలో చర్చించేందుకు పవన్ కళ్యాణ్ తోనే కలుపుకుని ముందుకు సాగుతున్నారు.

సాధారణంగా అధికారంలో ఉన్నపుడే ఆయా పార్టీలు మరింత పటిష్టంగా మారతాయి. విస్తరించేందుకు మార్గాలు చూసుకుంటాయి. బీజేపీ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లుగానే ఉందని అంటున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి టీడీపీ ఎంపీలు అవసరం కావడంతో ఏపీ బీజేపీ కంటే టీడీపీకి ఎక్కువ విలువ ఇవ్వాల్సి వస్తోంది అని అంటున్నారు. అదే విధంగా క్రౌడ్ పుల్లర్ అని ఇమేజ్ ఉన్న నేత అని పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ప్రాధాన్యతను బీజేపీ పెద్దలు ఇస్తున్నారు. దాంతో ఎక్కడా ఏపీ బీజేపీ నేతలు కనిపించడం లేదని అంటున్నారు.

ఇదే విధంగా ఉంటే సీట్లు పెరిగినా పదవులు దక్కినా బీజేపీ జనంలో వికసించడం మాత్రం కలగానే మారుతుందని అంటున్నారు. ఏపీ బీజేపీ ఇలా కట్టిపడేసి నట్లుగా ఉండడం అయితే రానున్న కాలంలో రాజకీయంగా చూస్తే కనుక ఇబ్బందిగానే ఉంటుందని అంటున్నారు.

Tags:    

Similar News