తిరుమల వెళ్తున్నారా.. అయితే ఈ తేదీలు ఒక్కసారి చూసుకోండి!

వైసీపీ ప్రభుత్వ హయాంలో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలను భ్రష్టు పట్టించిందని టీడీపీ, జనసేన, బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్ర ఆరోపణలు చేశాయి.

Update: 2024-07-06 07:15 GMT

వైసీపీ ప్రభుత్వ హయాంలో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలను భ్రష్టు పట్టించిందని టీడీపీ, జనసేన, బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్ర ఆరోపణలు చేశాయి. ముఖ్యంగా బ్రేక్‌ దర్శనాలకు సంబంధించి పెద్ద ఎత్తునే వివాదం నడిచింది. వైసీపీ నేతలు తమతో పాటు పదుల సంఖ్యలో వ్యక్తులను వెంటబెట్టుకుని బ్రేక్, వీఐపీ దర్శనాలు చేయించేవారన్న విమర్శలున్నాయి,

ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరుమల పవిత్రతను కాపాడటంపై దృష్టి సారించింది. టీటీడీ నూతన ఈవోగా జే శ్యామలరావును ప్రభుత్వం నియమించింది. దీంతో ఆయన భక్తులకు సౌకర్యాలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో బ్రేక్‌ దర్శనాలపై తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది.

జూలై 16న తిరుమలలో సాలకట్ల ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని 9వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 9, 16 తేదీల్లో శ్రీవారి బ్రేక్‌ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంలో 8, 15 తేదీల్లో సిఫారసు లేఖలను కూడా పరిగణనలోకి తీసుకోబోమని ప్రకటించింది.

ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో 9, 16 తేదీల్లో బ్రేక్‌ దర్శనాలు ఉండవు. ఈ తేదీల్లో తిరుమల వెళ్లేవారు ఈ విషయాన్ని గుర్తించాలి. తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను కూడా టీటీడీ రద్దు చేసింది.

కాగా సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు తిరుమలలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుపుతారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి ముందు ఆలయంలో శుద్ధి పనులు చేపడతారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత శుద్ధి పనులు పూర్తయ్యాక శ్రీవారి మూలమూర్తికి ఆగమోక్తంగా అర్చకులు పూజలు చేస్తారు. ఇక కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

కాగా శ్రీవారి లడ్డూ నాణ్యత తగ్గిందనే విమర్శలు గతంలో వచ్చాయి. ఈ నేపథ్యంలో శ్రీవారి పోటులో లడ్డూ ప్రసాదాలు తయారుచేసే కార్మికుల విధులపై శ్యామలరావు దృష్టి సారించారు. శ్రీవారి ప్రసాదాలు, లడ్డూ విషయంలో నాణ్యతను పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. శ్రీవారికి వివిధ కైంకర్యాల సందర్భంగా నివేదించే ప్రసాదాల విషయంలో అత్యంత జాగ్త్రతలు పాటించాలని సూచించారు.

Tags:    

Similar News