హిందీ భాషపై కీలక వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి!
దక్షిణాదిన మరే రాష్ట్రంలో లేని విధంగా తమిళనాడులో హిందీ విషయంలో ఎంతటి వ్యతిరేకత వ్యక్తమవుతుందో తెలిసిందే.
దక్షిణాదిన మరే రాష్ట్రంలో లేని విధంగా తమిళనాడులో హిందీ విషయంలో ఎంతటి వ్యతిరేకత వ్యక్తమవుతుందో తెలిసిందే. ఇంగ్లిష్ మాట్లాడేందుకు పెద్దగా వెనుకాడని పలువురు తమిళులు.. హిందీ విషయంలో మాత్రం పట్టుదలతో ఉంటారు. హిందీని ఆదరించే కన్నా.. సదరు భాష తమను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నట్లుగా పలువురు ఆరోపిస్తుంటారు. ఒక.. రాజకీయ పార్టీల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. హిందీ విషయంలో ఎలాంటి మినహాయింపులకు అవకాశం ఇవ్వని తీరు కనిపిస్తూ ఉంటుంది.
హిందీపై తమకున్న వ్యతిరేకతను తమిళనాడులోని ఏ రాజకీయ పార్టీ దాచుకున్నది లేదు. మిగిలిన వారు ఒక ఎత్తు.. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు కం రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్న ఉదయనిధి మారన్ చేసిన తాజా వ్యాఖ్యలు చూస్తే.. ఆయనతోకొత్త తరహా రాజకీయ నాయకుడు కనిపిస్తారు. సనాతన ధర్మంపై వివిదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన.. తాజాగా హిందీ పేరుతో ఉత్తరాదిని కెలికిన తీరు సరికొత్తగా ఉందని చెప్పాలి.
హిందీ భాషకు తమిళనాడు వ్యతిరేకం కాదని చెబుతూనే.. ఆ భాషను తమపై బలవంతంగా రుద్దటానికి మాత్రమే తాము వ్యతిరేకమన్నారు. అక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇక్కడే కొత్త పాయింట్ తెర మీదకు తీసుకొచ్చాడు. భాషను బలవంతంగా రుద్దటాన్ని వ్యతిరేకిస్తూనే పుట్టుకొచ్చినవి ద్రవిడ ఉద్యమాలు అన్న ఆయన.. ‘‘దక్షిణాది తరహాలో ఉత్తరాది రాష్ట్రాల్లో సినీ పరిశ్రమలు లేకపోవటం పెద్ద లోటు. ఒకవేళ ఆయా రాష్ట్రాలు తమ సొంత భాషను రక్షించుకోవటంలో విఫలమైతే.. హిందీ ఆ స్థానాన్ని అక్రమించే అవకాశం ఉంది’’ అంటూ కొత్త రాగాన్ని ఆలపించారు.
జాతీయ వాదం.. శాస్త్రీయ ద్రక్పథాన్ని ప్రచారం చేయటానికి ద్రవిడ నాయకులైన అన్నాదురై.. కరుణానిధి లాంటి వారు తమిళ సాహిత్యాన్ని పెద్ద ఎత్తున వినియోగించారన్న ఆయన.. ఆ కారణంగానే ప్రజల్లో మంచి గుర్తింపు పొందారన్నారు. కల్చర్.. బాషాధిపత్యానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఉద్యమమే ద్రవిడ ఉద్యమంగా పేర్కొన్నారు. 1930, 1960లలో హిందీని అధాకారిక భాషగా గుర్తించటానికి వ్యతిరేకంగా ద్రవిడ ఉద్యమాలు జరిగాయన్న విషయాన్ని గుర్తు చేశారు.
ఇప్పటికి హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీని బలవంతంగా రుద్దేందుకు జాతీయవాదులు ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీని పరోక్షంగా విమర్శలు గుప్పించినన ఉదయనిది.. ఇలాంటి చర్యలు దేశ ఐక్యతకు విఘాతం కలిగిస్తాయని వ్యాఖ్యానించటం గమనార్హం. దక్షిణాది మాదిరి ఉత్తరాది సినిమా పరిశ్రమ లేదన్న ఆయన.. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లోనూ హిందీ సినిమాలకు ఎక్కువ ఆదరణ ఉందన్నారు. ఆయా రాష్ట్రాలు భాషను కాపాడుకోకపోతే.. సంస్క్రతికి.. గుర్తింపునకు దూరమవుతామన్న ఉదయనిధి మాటల్ని చూస్తే.. హిందీ పేరుతో ఉత్తరాది రాష్ట్రాలను టచ్ చేశారన్న అబిప్రాయం వ్యక్తమవుతోంది.