ఉక్రెయిన్-రష్యా.. 1000 రోజుల యుద్ధం.. లెక్కకు మించిన విధ్వంసం

అప్పట్లో రెండో ప్రపంచ యుద్ధం ఐదేళ్లు సాగితే.. ఇప్పుడు ఈ యుద్ధం వెయ్యి రోజులు పూర్తిచేసుకుంది. మూడో ఏడాదిలోనూ కొనసాగే ప్రమాదం కనిపిస్తోంది.

Update: 2024-11-19 08:16 GMT

మొదటి ప్రపంచ యుద్ధం కంటే రెండో ప్రపంచ యుద్ధం ప్రపంచాన్ని బాగా వణికించింది. జర్మనీ నియంత హిట్లర్ దూకుడుకు అమెరికా, రష్యా కలిసి సమాధానం ఇస్తేనే కానీ సరిపోలేదు. దాదాపు 80 ఏళ్ల కిందటే ముగిసిన ఆ యుద్ధం గురించి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే.. యూరప్ లో ఆ స్థాయిలో మరో యుద్ధం సాగుతోంది కనుక. అప్పట్లో రెండో ప్రపంచ యుద్ధం ఐదేళ్లు సాగితే.. ఇప్పుడు ఈ యుద్ధం వెయ్యి రోజులు పూర్తిచేసుకుంది. మూడో ఏడాదిలోనూ కొనసాగే ప్రమాదం కనిపిస్తోంది.

2022 ఫిబ్రవరి 24..

తమ పొరుగున ఉండే ఉక్రెయిన్.. అమెరికా సారథ్యంలోని సైనిక కూటమి నాటోలో చేరే ప్రయత్నాన్ని తీవ్రంగా పరిగణించిన రష్యా.. 2022 ఫిబ్రవరి 24న దాడికి దిగింది. దీనికి ఉక్రెయిన్ సైనిక స్థావరాలను లక్ష్యం చేసుకుంటామని, తమది సైనిక చర్య అని పేరు పెట్టింది. కానీ, చివరకు ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలు, ఆస్పత్రులు, స్కూళ్లనూ లక్ష్యం చేసుకుంది. ఇప్పటికీ కొనసాగుతున్న ఈ యుద్ధాన్ని 21వ శతాబ్దంలోనే అతి దారుణమైనది పేర్కొంటున్నారు.

రష్యా చేతుల్లోకి 40 శాతం ఉక్రెయిన్..

ఉక్రెయిన్ కు చెందిన క్రిమియాను 2014లోనే ఆక్రమించింది రష్యా. ఇప్పుడు డాన్ బాస్ (డొనెట్స్క్, లుగాన్స్క్) ను పూర్తిగా కలిపేసుకుంది. రష్యన్ భాష మాట్లాడే ఈ ప్రాంతాలు ఉక్రెయిన్ భూభాగంగా 40 వరకు ఉండడం గమనార్హం. డాన్ బాస్ లో రెండేళ్ల కిందటే రష్యా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి తమతో కలిపేసుకుంది.

నిలువెల్లా క్షిపణి గాయాలే..

అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ ఎంతకూ తగ్గకుండా ఈ యుద్ధంలో తలపడుతున్నాయి. అయితే, ఆయుధ పరంగా భారీ సామర్థ్యం ఉన్న రష్యా ధాటికి ఉక్రెయిన్ తీవ్రంగా దెబ్బతిన్నది. ఒడెసా వంటి సుందర తీర నగరాలు ధ్వంసమయ్యాయి. గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. లక్షలమంది గాయపడ్డారు.

అటు 80 వేలు.. ఇటు 2 లక్షలు రెండున్నరేళ్లకు పైగా సాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ కు చెందిన 80 వేల మంది సైనికులు మరణించారు. 4 లక్షల మంది గాయపడ్డారు. పాశ్చాత్య దేశాలకు చెందిన వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం చెబుతున్న ఈ లెక్కల్లో.. రష్యాకు జరిగిన నష్టంపై అనుమానాలున్నాయి. రష్యా 2 లక్షల మంది సైనికులను కోల్పోయింది. 4 లక్షల మంది గాయపడ్డారు.

పుట్టేవారు లేరు గిట్టేవారే...

యుద్ధానికి ముందు కంటే.. ఉక్రెయిన్ లో జననాల రేటు మూడో వంతు పడిపోయింది. 40 లక్షల మంది దేశంలోని మరో ప్రాంతానికి వలస వెళ్లగా, 60 లక్షల మంది వేరే దేశానికి వెళ్లిపోయారు. ఉక్రెయిన్‌ లోని ఐరాస మానవ హక్కుల మిషన్‌ లెక్కల్లో ఆగస్టు వరకే ఉక్రెయిన్ కు చెందిన 11,743 మంది ప్రజలు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. 24,600 మంది గాయపడ్డారు. చాలా ప్రాంతం రష్యా ఆధీనంలో ఉండడంతో వాస్తవ మరణాలు కచ్చితంగా తెలియరావడం లేదు. నవంబరు 14 నాటికి 589 మంది ఉక్రెయిన్‌ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. కాగా, చనిపోయిన రష్యా పౌరుల సంఖ్య చాలా రెట్లు ఉంటుందని అంటున్నా.. చాలా తక్కువే ఉంటుంది. ఎందుకంటే.. యుద్ధం జరగుతున్నది ఉక్రెయిన్ లో కాబట్టి.

నష్టం 50 లక్షల కోట్లపైనే..

యుద్ధం కారణంగా నిరుడు డిసెంబరు నాటికే ఉక్రెయిన్ 152 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిందనేది లెక్క. భారత కరెన్సీలో చెప్పాలంటే 50 లక్షల కోట్లపైనే ఉండొచ్చు. ఇక మౌలిక వసతులైన రోడ్లు, విద్యుత్తు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పొద్దుతిరుగుడు పంటకు ప్రసిద్ధిగాంచిన ఉక్రెయిన్ ఇప్పుడు వ్యవసాయంలో తీవ్రంగా నష్టపోయింది. విద్యుత్తు రంగాన్ని రష్యా లక్ష్యంగా చేసుకోవడంతో చీకట్లు అలముకున్నాయి. ఈ దేశ పునర్నిర్మాణం, పునరుద్ధరణకు 486 బిలియన్‌ అమెరికన్ డాలర్లు (రూ.41 లక్షల కోట్లు పైగా) అవుతుందని ప్రపంచ బ్యాంకు, ఉక్రెయిన్‌ ప్రభుత్వం సరిగ్గా ఏడాది కిందటే లెక్కగట్టాయి. అయితే, ఉక్రెయిన్ జీడీపీకి ఇది దాదాపు మూడు రెట్లు.

Tags:    

Similar News