రేవంత్ రెడ్డికి చెప్పాల్సింది చెప్పిన ఉండవల్లి

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ప్రెస్ మీట్లు పెడితే చాలు విభజన హామీల గురించే మాట్లాడుతారు.

Update: 2024-07-09 03:48 GMT

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ప్రెస్ మీట్లు పెడితే చాలు విభజన హామీల గురించే మాట్లాడుతారు. ఏపీ ఏ విధంగా నష్టపోయింది ఆయనకు లెక్కలతో సహా తెలుసు. దాని కంటే ముందు యూపీఏ హయాంలో అడ్డగోలు విభజన ఏపీని ఎంతలా నష్టపరచిందో కూడా తెలుసు.

ఆయన తరచూ ప్రెస్ మీట్లలో ఏపీ తెలంగాణా సీఎంలను విభజన చట్టం ప్రకారం అమలు చేయాల్సినవి చేయమని చెబుతూ ఉంటారు. మీడియా ముఖంగానే కాదు ఇపుడు ఉండవల్లికి ఏకంగా రేవంత్ రెడ్డిని వేదిక మీదనే కలిసే చాన్స్ వచ్చింది.

ఆయన వైఎస్సార్ జయంతి సభలో పాల్గొన్నారు. వైఎస్సార్ గురించి చెబుతూనే ముగింపులో ఏపీ విభజన సమస్యల మీద ప్రస్తావించారు. ఏపీ విభజన వల్ల అన్ని విధాలుగా నష్టపోయింది అన్నది ఆయన రేవంత్ రెడ్డికి చెప్పారు.

ఏపీ ప్రజలు అన్యాయం అయ్యారని ఆయన అన్నారు. ఏపీకి తెలంగాణా మీద కోపం లేదు. అదే సమయంలో తెలంగాణా వారికి కోపం ఎందుకు వచ్చిందో కూడా తెలుసు. అయితే ఇపుడు రెండు రాష్ట్రాలకు మధ్య జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దాల్సి ఉందని ఉండవల్లి రేవంత్ రెడ్డికి చెప్పారు.

కాంగ్రెస్ సీఎం గా రేవంత్ రెడ్డి ఉండడం వల్ల ఆయనే ఏపీకి న్యాయం చేయగలరని చెబుతూ ఉండవల్లి ఆయన ముందర కాళ్లకు బంధం వేశారు. ఏపీకి విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సినవి ఇస్తే చరిత్రలో నిలిచిపోయే అవకాశం రేవంత్ రెడ్డి కి వస్తుందని అన్నారు

ఇప్పటికే ఆ దిశగా చర్చలు సాగడం మంచి పరిణామం అని ఉండవల్లి అన్నారు. రేవంత్ రెడ్డికి ఏపీకి ఏమి కావాలో వైఎస్సార్ కుమార్తె పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వివరిస్తారని అలాగే హైదరాబాద్ లో ఉండే కేవీపీ రామచంద్రరావు కూడా ఏపీ విషయంలో రేవంత్ రెడ్డి కి అవసరమైన సాయం చేస్తారని ఉండవల్లి అన్నారు. పెద్ద మనసు చేసుకుని విభజన సమస్యల మీద పరిష్కారం చూపాలని ఆయన కోరారు.

అయితే ఉండవల్లి చెప్పినది రేవంత్ రెడ్డి చిరునవ్వుతో విన్నారు. ఆయన ఏమీ మాట్లాడలేదు కానీ ఆయన ఉండవల్లి పట్ల గౌరవంతో నవ్వుతూ వింటూ ఉండిపోయారు. టెక్నికల్ గా ఏపీ తెలంగాణా వేరుగా ఉన్నా రెండూ ఒక్కటే అని మొత్తం అంతా తెలుగు ప్రజలే అని కూడా ఉండవల్లి చెప్పినపుడు రేవంత్ రెడ్డి శ్రద్ధగా అంతా విన్నారు.

తానూ తెలంగాణాకు అప్పటి కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ మంచి మిత్రులమని అయితే తెలంగాణా ఉద్యమం కారణంగా అయిదేళ్ల పాటు మాట్లాడుకోలేదు అంటే ఆనాడు పరిస్థితి ఎంతలా ఉన్నదో అర్ధం చేసుకోవాల్సిందే అని ఉండవల్లి చెపారు.

మొత్తానికి చూస్తే ఉండవల్లి రేవంత్ రెడ్డికి చెప్పాల్సింది చెప్పారు.మరి ఆయన చేయాల్సింది చేస్తారా అన్నదే చర్చ. ఏపీకి మంచి చేస్తే అంతా రేవంత్ రెడ్డికి గుర్తు పెట్టుకుంటారు. అలాగే రెండు రాష్ట్రాలు నష్టపోకుండా రేవంత్ రెడ్డి మాత్రమే చేయగలరు అన్న ఉండవల్లి మాటలను ఆయన సీరియస్ గా తీసుకుంటే మంచే జరుగుతుందని అంటున్నారు.

Tags:    

Similar News