నేనూ ముఖ్యమంత్రిని అవుతా.. నా గర్ల్ ఫ్రెండ్ కు కేబినెట్ హోదా ఇస్తా!
తాజాగా వెంకట రమణారెడ్డి... సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాటి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలను ఓడించి కామారెడ్డిలో జెయింట్ కిల్లర్ గా నిలిచారు.. వెంకట రమణారెడ్డి. బీజేపీ తరఫున పోటీ చేసిన ఆయన కేసీఆర్, రేవంత్ రెడ్డి వంటి అగ్ర నేతలపై విజయం సాధించి పెను సంచలనం సృష్టించారు.
దీంతో అందరి దృష్టి వెంకట రమణారెడ్డిపైన నెలకొంది. ఆయన ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో, మీడియాలో మంచి ప్రాధాన్యత లభిస్తోంది. తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని.. తానే ముఖ్యమంత్రి అవుతానంటూ హాట్ కామెంట్స్ చేశారు.
తాజాగా వెంకట రమణారెడ్డి... సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత కొన్నిరోజులుగా కామారెడ్డి నియోజకవర్గంలో నడుస్తున్న ప్రొటోకాల్ రగడే ఇందుకు ప్రధాన కారణమని టాక్ నడుస్తోంది. ఇది చినికి చినికి గాలి వానలా మారి.. వెంకట రమణారెడ్డి.. సీఎం రేవంత్ పైన, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీపైన విమర్శలు చేసే వరకు వచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించట్లేదని కొన్నిరోజులుగా బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మండిపడుతున్నారు. కామారెడ్డిని షబ్బీర్ అలీకి రాసిచ్చారా..? అని నిలదీస్తున్నారు. ఏ ప్రొటోకాల్ ప్రకారం షబ్బీర్ అలీ పేరును శిలాఫలకంపై వేయిస్తారని ప్రశ్నించారు. ఏ హోదాతో ఆయనతో ప్రారంభోత్సవాలు చేయిస్తారని అధికారులను నిలదీశారు.
ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిపైనా, షబ్బీర్ అలీకి సలహాదారు పదవి ఇవ్వడంపైనా వెంకట రమణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రేపొద్దున తెలంగాణకు తానే ముఖ్యమంత్రిని అవుతానని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. తన గర్ల్ ఫ్రెండ్ కు కూడా కేబినెట్ హోదా ఇస్తా.. అట్ల ఇయ్యొచ్చా..?. అలా ఇయ్యొచ్చు అంటే తాను కూడా తయారు చేసుకుంటానన్నారు. తాను కూడా 2028కి ప్లాన్ లో ఉన్నా అని చెప్పారు. సీఎం అవుతాను కూడా.. విడిచిపెట్టేది అయితే లేదని వెంకట రమణారెడ్డి స్పష్టం చేశారు.
డైరెక్టుగా ఈ విషయాన్ని మీడియాకే చెబుతున్నానన్నారు. ఇది తన ఛాలెంజ అని చెప్పారు. 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎలా అన్నానో.. 2028 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రాకపోతే ముఖం కూడా చూపెట్టనని సవాల్ విసిరారు. 2028లో బీజేపీ ప్రభుత్వం వస్తుంది అని కుండబద్దలు కొట్టారు.
వెంకట రమణారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు కామారెడ్డిలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.