ఇద్దరికీ విజయమ్మ దూరం...!?

ఈసారి ఎన్నికల ప్రచారంలో విజయమ్మ కనిపిస్తారా అంటే లేదు అని జవాబు వస్తుంది.

Update: 2024-04-05 03:41 GMT

ఈసారి ఎన్నికల ప్రచారంలో విజయమ్మ కనిపిస్తారా అంటే లేదు అని జవాబు వస్తుంది. ఆమె అత్యంత సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బహుశా ఈ తరహా ఇబ్బందికరమైన పరిస్థితి దేశ రాజకీయలలో ఏ కుటుంబానికి వచ్చి ఉండదని అంటున్నారు. ఒకే కుటుంబంలో రాజకీయాలు వేరు వేరు పార్టీలలో చేసే వారు ఉండవచ్చు కానీ మరీ ఎదురు బొదురు నిలిచి కత్తులు దూసుకోవడం తన రాజకీయం కోసం ఎదుటి వారి వినాశనం కోరుకోవడం బహుశా ఎక్కడా ఉండదు.

అంతే కాదు తల్లిగా ఇద్దరు బిడ్డలూ క్షేమంగా ఉండాలనే కోరుకుంటారు ఎవరైనా. జగన్ రెండవసారి సీఎం కావాలని విజయమ్మకు నూరు శాతం ఉంటుంది. అందులో సందేహమే లేదు. అదే సమయంలో వైఎస్ షర్మిల కడప నుంచి పోటీ చేసి ఎంపీ కావాలని తన కూతురు దేశంలో అత్యున్నత చట్ట సభలో కాలుమోపాలని కూడా ఆలోచిస్తారు.

అయితే ఒకే జిల్లాలో అది కూడా వైఎస్సార్ ని దశాబ్దాల పాటు నెత్తిన పెట్టుకున్న చోట తమ బిడ్డలు ఇద్దరిలో ఒకరికే మద్దతు ఇవ్వమని కోరడం అంటే విజయమ్మ వల్ల కాదనే అంటున్నారు. పులివెందులలో జగన్ పోటీలో ఉన్నారు. కడప ఎంపీ సీటులో షర్మిల పోటీ చేస్తున్నారు.

షర్మిల గెలుపులోనే జగన్ ఓటమి ఉంది. ఎందుకంటే కడప ఎంపీ సీటు గెలవాలీ అంటే పులివెందులలోనూ మెజారిటీ రావాలి. మరింతలా ఒకే ఒరలో రెండు కత్తులుగా అన్నా చెల్లెళ్ళ రాజకీయం సాగుతూంటే తల్లిగా విజయమ్మ ఎటు వైపు మొగ్గు చూపుతారు ఏమి చేస్తారు అంటే కన్నీరే జవాబు అవుతుంది అని అంటున్నారు.

అందుకే విజయమ్మ ఈసారి ఎవరికీ మద్దతు బాహాటంగా ఇవ్వరు అని అంటున్నారు. అదే సమయంలో తన దీవెనలను ఇద్దరికీ ఇస్తున్నారు. జగన్ ఇడుపులపాయలో తన పార్టీ అభ్యర్ధుల జాబితాను రిలీజ్ చేస్తే ఆ రోజు ఆమె అక్కడ హాజరయ్యారు. ఇటీవల షర్మిల కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితాను రిలీజ్ చేస్తే ఆ రోజునా ఆమె కుమార్తెతో కనిపించారు.

జగన్ని దీవించి ఎన్నికల ప్రచారానికి విజయమ్మ పంపించారు. అలాగే షర్మిలను దీవించి పంపించారు. ఆ ఫోటోలను షర్మిల రిలీజ్ చేస్తూ ట్వీట్ చేశారు. తన తండ్రి వైఎస్సార్ తల్లి విజయమ్మ ఆశీస్సులతో దేవుడి దీవెనలతో చిన్నాన్న చివరి కోరిక ప్రకారం ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నాను. మీ రాజన్న బిడ్డను దీవించాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ ఎన్నికల శంఖారావం పూరించనున్నాను. న్యాయం కోసం పోరాడుతున్న ఈ యుద్ధంలో మీ ఆశీస్సులు నాపై ఉంటాయని ఆశిస్తున్నాను అంటూ షర్మిల ట్వీట్ లో పేర్కొన్నారు.

అంటే తన తల్లి ఆశీస్సులు తనకే ఉన్నాయని తానే రాజన్న బిడ్డను అసలైన వారసురాలిని అని ఆమె చెబుతున్నారు. వైఎస్సార్ కి ఆమె అసలైన వారసురాలా లేక జగన్ నా అన్నది జనాలు కడప గడప సాక్షిగా మరో నలభై రోజులలో తీర్పు ఇస్తారు. అయితే విజయమ్మ మాత్రం జగన్ వైపు కానీ షర్మిల వైపు కానీ నిలబడి ఎన్నికల్లో ప్రచారం చేయరని అంటున్నారు. ఇద్దరూ తనకు కావాలి కాబట్టి ఇద్దరి రాజకీయానికి ఆమె దీవెనలు అందించి తెర వెనకే ఉంటారని అంటున్నారు. 2019లో వైసీపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేసిన విజయమ్మ ఈసారి పూర్తిగా దూరంగానే ఉండనున్నారు అని అంటున్నారు.

Tags:    

Similar News