జగన్ ఢిల్లీ ధర్నాలో మొత్తం విజయసాయిరెడ్డిదే హవా !

మొత్తానికి వైసీపీ దారుణ ఓటమికి సవాలక్ష కారణాలలో విజయసాయిరెడ్డి సేవలు కూడా పూర్తిగా పార్టీ వినియోగించుకో కపోవడం ఒక కారణం అని అంటారు.

Update: 2024-07-25 10:16 GMT

వైసీపీలో విజయసాయిరెడ్డిది నంబర్ టూ ప్లేస్. ఆయన జగన్ పక్కన ఉంటే విజయమే దక్కుతుంది అనడానికి 2019 ఎన్నికలు నిదర్శనం. ఆయన 2024లో నెల్లూరు ఎంపీగా పోటీ చేయడానికి వెళ్ళడంతో పార్టీ చాలానే మిస్ అయింది అని అంటారు. మొత్తానికి వైసీపీ దారుణ ఓటమికి సవాలక్ష కారణాలలో విజయసాయిరెడ్డి సేవలు కూడా పూర్తిగా పార్టీ వినియోగించుకో కపోవడం ఒక కారణం అని అంటారు.

అది అలా ఉంచితే విజయసాయిరెడ్డి 2016 నుంచి రాజ్యసభ మెంబర్ గా ఉన్నారు. గత ఎనిమిదేళ్ళుగా ఆయన ఢిల్లీ రాజకీయాల్లో పట్టు సాధించారు. అప్పట్లో అంటే 2014 నుంచి 2019 మధ్య జగన్ విపక్షంలో ఉంటే ఢిల్లీలోని పెద్దలతో టచ్ లో ఉంటూ అపాయింట్మెంట్లు జగన్ కి దక్కేలా చూడడంలో విజయసాయిరెడ్డిదే కీలక పాత్ర అని అంతా చెప్పుకునేవారు.

విజయసాయిరెడ్డికి బీజేపీ పెద్దలతోనే పరిచయాలు అని అనుకుంటారు కానీ ఢిల్లీ స్థాయిలో ఆయనకు అన్ని పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయని మరో మారు రుజువు అయింది. తాజాగా ఢిల్లీలో జగన్ వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో దాదాపుగా అరడజన్ కి పైగా పార్టీలు హాజరయ్యాయి అంటే అదంతా విజయసాయిరెడ్డి పలుకుబడి అని అంటున్నారు.

విజయసాయిరెడ్డి మాట మేరకే అనేక పార్టీలు హాజరై ధర్నాకు కళ కట్టించారు అని చెబుతున్నారు. విజయసాయిరెడ్డి నిత్యం అనేక పార్టీలతో సన్నిహితంగా మెలుగుతూ ఉంటారని అంటారు. ఆయనను పేరు గుర్తు పెట్టుకుని మరీ పిలిచేటంత పరిచయం మోడీ దగ్గర సంపాదించారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సైతం విజయసాయిరెడ్డి భేటీ కావడం ఒక సంచలనం గానే చెప్పుకున్నారు.

ప్రస్తుత పార్లమెంట్ లో దాదాపుగా 48 పార్టీలు ఉంటే అందులో సగానికి పైగా పార్టీలతో వాటికి సంబంధించిన కీలక నేతలతో విజయసాయిరెడ్డికి మంచి పరిచయాలు ఉన్నాయని అంటారు. అందుకే వైసీపీ ధర్నాలో ఎవరూ పాల్గొంటారు అని అంతా ఆసక్తిగా చూసారు కానీ విజయసాయిరెడ్డి మాత్రం ఆ డౌట్లు అన్నీ క్లారిఫై చేసేలా బాగానే పార్టీలను ధర్నా వేదిక వద్దకు తెచ్చారని అంటున్నారు.

వైసీపీలో విజయసాయిరెడ్డి ఎపుడూ కీలకంగానే ఉంటూ వస్తున్నారు. ఇటీవల ఆయన పరపతి తగ్గిందని పార్లమెంటరీ పార్టీ నేతగా ఆయనని తప్పించారని రాజ్యసభకు నేతగా మాత్రమే పరిమితం చేసారని ప్రచారం జరిగింది. అయితే ఢిల్లీ ధర్నా చూసాక విజయసాయిరెడ్డి పరపతి ఎక్కడా తగ్గలేదని అంతా నమ్ముతున్నారు. వైసీపీ అధినాయకత్వం ఆయన సేవలను ముందు ముందు మరింతగా ఉపయోగించుకుంటుంది అని కూడా అంటున్నారు. మొత్తానికి వైసీపీ ధర్నా వెనక ఉన్న విజయసాయిరెడ్డి గురించే ఇపుడు అంతా చర్చించుకోవడం చూస్తే సాయిరెడ్డి హవా మామూలుగా లేదుగా అనే మాటే అంటున్నారు.

Tags:    

Similar News