విశాఖ దశ తిరగనుందా ?

విశాఖ మీద టీడీపీ కూటమి ప్రభుత్వం ఫుల్ గా ఫోకస్ పెడుతోంది. ఏపీలో ఈ రోజుకు అయితే విశాఖనే మెగా సిటీగా చెప్పుకోవాలి.

Update: 2024-12-04 04:04 GMT

విశాఖ మీద టీడీపీ కూటమి ప్రభుత్వం ఫుల్ గా ఫోకస్ పెడుతోంది. ఏపీలో ఈ రోజుకు అయితే విశాఖనే మెగా సిటీగా చెప్పుకోవాలి. విశాఖలో రవాణా మార్గాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. జల వాయు రోడ్డు రైల్ కనెక్టివిటీ ఉంది. ఏ నగరానికి అయినా ఇవే ముఖ్యం.

దాంతో పాటు విశాఖ టూరిస్ట్ స్పాట్ గా మొదటి నుంచి ఉంది. గత రెండు దశాబ్దాలుగా ఐటీ సెక్టార్ కూడా విశాఖలో విస్తరిస్తోంది. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ తరువాత విశాఖ ఐటీ కి రెండవ రాజధాని అని చెప్పేవారు. రాష్ట్రం విడిపోయిన తరువాత విశాఖ చుట్టూ సాఫ్ట్ వేర్ ఫీల్డ్ తిరుగుతోంది.

ఐటీ ఇండస్ట్రీని మరింతగా మెగా సిటీస్ లో విస్తరించాలీ అంటే విసాఖను మించినది లేదని ఆ రంగం నిపుణులు చెబుతున్నారు. దాంతో ఆ దిశగా పరిశ్రమలు వస్తున్నాయి. ఇంఫోసిస్, అదానీ సెంటర్ వంటివి విశాఖకు రావడానికి కూడా కారణాలు మెగా సిటీ కాస్మో పాలిటిన్స్ సిటీ కల్చర్ కావడమే.

ఈ నేపథ్యంతో పాటు మొదటి నుంచి విశాఖ కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలకు కేంద్ర బిందువుగా ఉంది. దాని వల్లనే విశాఖ సిటీ అభివృద్ధి చెందింది. ఈ విధంగా చూస్తే విశాఖకు రైల్వే జోన్ కేటాయించారు. దాని పనులకు శంకుస్థాపన కూడా కొద్ది రోజులలో జరుగుతుంది. కేంద్ర రైల్వే శాఖ ఆన్ లైన్ విధానం ద్వారా టెండర్లు కూడా పిలిచింది.

ఇపుడు మరో శుభవార్త విశాఖను పలకరిస్తోంది. విశాఖకు మెట్రో రైల్ ప్రాజెక్ట్ కి ఆమోదం లభించడంతో విశాఖ దశ తిరుగుతోంది అని అంటున్నారు. ఈ క్రమంలో విశాఖపట్నంలోనూ వివిధ దశల్లో మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని తీర్మానించారు

విశాఖలో ఈ రోజుకు పాతిక లక్షల మంది జనాభా ఉన్నారు. ఇది అంతకంతకు పెరుగుతోంది. విశాఖ శివారు ప్రాంతాలు కూడా ఇపుడు సిటీలో కలసిపోయాయి. దాంతో విశాఖకు ఉన్న జనాభా సైతం మెట్రో రైలు ప్రాజెక్ట్ సక్సెస్ కావడానికి ఉపయోగపడుతుంది అని అంటున్నారు.

అంతే కాదు విశాఖను అల్లుకుని అనేకమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. అదే విధంగా ముందే చెప్పుకున్నట్లుగా విశాఖలో ఐటీ రంగం కూడా వేళ్ళూనుకుంటున్న నేపథ్యం ఉంది. ఇక రియల్ ఎస్టేట్ తో పాటు అనేక రకాలైన వ్యాపారాలకు కూడా విశాఖ కీలకంగా ఉంది. ఈ మొత్తం చూస్తే కనుక విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్ట్ కనుక పట్టాలు ఎక్కితే దశ పూర్తిగా మారుతుందని అంటున్నారు. విశాఖలో విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అవుతుందని కూఒడా అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే విశాఖపట్నంలో మూడు కారిడార్లలో మెట్రోరైలు ప్రాజెక్టుకు ఆమోదం లభించిందని తెలుస్తోంది. ఈ క్రమంలో దశాబ్దాలుగా వెంటాడుతున్న ట్రాఫిక్ సమస్యల నుంచి విశాఖ వాసులకు ముక్తి లభిస్తుందని అంటున్నారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ మొత్తం 76.9 కిలోమీటర్ల మేర చేపడతారు.అది కూడా తొలి దశలో అని అంటున్నారు. ఏది ఏమైనా విశాఖకు అద్భుతమైన అవకాశంగా దీనిని చూస్తున్నారు. రానున్న రోజులలో విశాఖ దశ తిరగడం ఖాయమని అంటున్నారు.

Tags:    

Similar News