కేంద్రం వరం: విశాఖ రైల్వే జోన్‌కు ఓకే.. ఫలించిన బాబు కృషి
విశాఖ రైల్వే జోన్‌తో పాటు.. రైల్వే డివిజన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తాజాగా ప్రకటనలో పేర్కొంది.
విశాఖపట్నానికి రైల్వే జోన్ తీసుకురావాలన్న సీఎం చంద్రబాబు కృషి ఎట్టకేలకు ఫలించింది. విభజన చట్టంలోనే ఉన్నప్పటికీ.. దీనిని సాధించడం అనేది తలకు మించిన భారంగా మారింది. విశాఖ రైల్వే జోన్‌ను సాధించేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలూ కష్టించింది. తాజాగా.. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. విశాఖ రైల్వే జోన్‌తో పాటు.. రైల్వే డివిజన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తాజాగా ప్రకటనలో పేర్కొంది.
ఏంటి ప్రయోజనం?
రైల్వే జోన్ ఏర్పాటు చేయడం ద్వారా.. స్థానిక రైల్వే స్టేషన్లను మరింత సుందరీకరించడంతోపాటు.. పరిధిని విస్తరిస్తారు. తద్వారా.. స్థానికంగా కార్యకలాపాలు పెరగనున్నాయి. ఉపాధి పెరుగుతుంది. అదేవి ధంగా ఉద్యోగాల కల్పన కూడా సాధ్యమవుతుంది. సుమారు 2 వేల వుద్యోగాలు కొత్తగా వస్తాయని ఒక అంచనా వుంది. అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన పెరుగుతుంది. జోన్ పరిధిలోకి వస్తే.. కేటాయింపులు కూడా ఎక్కువగా ఉండి... స్థానింగా ప్రజలకు ఉపాధి లభిస్తుంది.
ఎప్పటి నుంచి?
2012 నాటి విభజన చట్టంలోనే విశాఖను రైల్వే జోన్ చేయాలని పేర్కొన్నారు. అయితే.. అప్పటికే ఉన్న.. రాయగడ(ఒడిషా) డివిజన్ పరిధిని విస్తరించి దీనిలో కలిపేయనున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న `వాల్తేర్` డివిజన్ పేరును విశాఖపట్నం డివిజన్‌గా మార్చనున్నారు. విశాఖ డివిజన్ పరిధిలోకి విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు వస్తాయి. విశాఖ రైల్వే డివిజన్ పరిధిలో 410 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ను చేర్చనున్నారు. తద్వారా.. అన్ని ప్రాంతాలకూ కనెక్టివిటీ పెరగనుంది.
బాబు హర్షం..
కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటన పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర వాసులకే కాకుండా.. యావత్ తెలుగు ప్రజలకు కూడా.. ఇది శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. కాగా.. మంత్రి నారాలోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉండగానే ఈ ప్రకటన రావడం పట్ల కూడా.. బాబు హర్షం వ్యక్తం చేశారు. ఇక, కేంద్ర మంత్రి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు సైతం సంతోషం వ్యక్తం చేయడం గమనార్హం.