అప్పుడు వైసీపీ.. ఇప్పుడు టీడీపీ.. పశ్చిమ పాలిటిక్స్ అంతే బ్రో..!
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని భీమవరంలో ఆక్వా, చేపల చెరువులకు ప్రసిద్ధి. ఎవరు అధికారంలో ఉంటే.. ఆ పార్టీ హవా ఇక్కడ సాగుతుంది.;
పశ్చిమ గోదావరి జిల్లా పాలిటిక్స్ చాలా డిఫరెంట్ అనే పేరుంది. ఇక్కడ నాయకులు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే విమర్శలు చేసుకుంటారు. గెలుపు గుర్రం ఎవరు ఎక్కినా.. తర్వాత.. సర్దుకుపోతారు. ఇది ఆదిగా అనాదిగా వస్తున్న సంప్రదా యం. కక్ష పూరిత రాజకీయాలు.. కిరికిరి రాజకీయాలు ఇక్కడి నాయకులకు తెలియవు. అంతా సర్దుకుపోవడం మాత్రమే ఇక్కడి నాయకులు రాజకీయంగా అబ్బిన విద్య. అలానే.. ఇప్పుడు కూడా రాజకీయాలు సాగిస్తున్నారు. గతంలో వైసీపీ నాయకులు ఇప్పుడు టీడీపీ నాయకులు సేమ్ టు సేమ్ పాలిటిక్స్ చేస్తూ.. రక్తికట్టిస్తున్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని భీమవరంలో ఆక్వా, చేపల చెరువులకు ప్రసిద్ధి. ఎవరు అధికారంలో ఉంటే.. ఆ పార్టీ హవా ఇక్కడ సాగుతుంది. గతంలో వైసీపీ నాయకులు ఎక్కడపడితే అక్కడ చెరువు తవ్వేశారు. చివరకు జనావాసాలను కూడా ఆక్రమించారు. అయితే.. అప్పట్లో దీనిని రాజకీయం చేయాల్సిన టీడీపీ నాయకులు వారితో సర్దుకుపోయారన్న విమర్శలు వచ్చాయి. చివరకు ప్రజల్లో ఆగ్రహం, ఆవేదన రెండూ వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి తతంగాలు వెలుగు చూశాయి. ఇక, ఇప్పుడు టీడీపీ నేతల తీరు కూడా ఇలానే ఉంది.
జిల్లాలో పలు చోట్ల నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా చెరువులు తవ్వుతున్నారు. అనుమతి పొందినదాని కంటే ఎక్కువ విస్తీర్ణంలో తవ్వకాలు చేస్తున్నారు. కొన్నిచోట్ల అసలు అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. వీటిపై ప్రత్యర్థి పార్టీ వైసీపీ నాయకులు మౌనంగా ఉంటారు. గతంలో తమకు సహకరించారన్న కృత జ్ఞత కావొచ్చు.. లేదా.. భవిష్యత్తులో తమదీ ఇదే విధానం అనుకుని ఉండొచ్చు. దీంతో స్థానిక ప్రజలు, రైతులు ఆందోళనకు దిగి రోడ్డెక్కిన సందర్భాలే కనిపిస్తున్నాయి.ఇక, అధికారులు కూడా ఎవరు అధికారంలో ఉంటే వారికి వత్తాసు పలకడం షరా మామూలే.
మత్స్యశాఖలో కొందరు ఎఫ్‌డీవోలు, క్షేత్రస్థాయిలో వీఆర్వోలు నేతలకు వంతపాడుతున్నారనేది జిల్లా ఎరిగిన సత్యం. కాళ్ల, భీమవరం, ఆకివీడు, ఉండి, పాలకోడేరు, వీరవాసరం, గణపవరం, అత్తిలి మండలాల్లో ఎక్కువగా, పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల ఈ తరహా తవ్వకాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఆక్వా చెరువులు తవ్వాలంటే తగిన అనుమతులు పొందడంతో పాటు జలవనరులు, నివాసాలలకు నిర్ణీత దూరం పాటించాల్సి ఉంది. క్షేత్ర స్థాయిలో ఇవేమీ అమలు కావడం లేదు. అయినా.. ప్రశ్నించేందుకు ప్రతిపక్షం లేకపోవడం.. ఉన్నా.. కలిసిపోయి రాజకీయాలు చేయడం గమనార్హం. ఇదీ.. సంగతి..!