ఈటలకో న్యాయం.. కవితకో న్యాయమా కేసీఆర్? కూతురని ఉపేక్షనా?
కానీ, ఆరోపణలు నిజం కానంతవరకు అవి ఆరోపణలుగానే ఉంటాయి.
మాజీ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు కావడం బీఆర్ఎస్ వర్గాలను అత్యంత ఇబ్బంది పెడుతోంది. ఓ మహిళ అయి ఉండి, మద్యం వ్యవహారంలో జోక్యం చేసుకుని అవినీతి పాల్పడ్డారనే ఆరోపణలు ఆమె వ్యక్తిగత ప్రతిష్ఠనే కాక, బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠనూ దిగజార్చే ప్రమాదం ఉంది. వాస్తవానికి రెండేళ్లుగా సాగుతున్న మద్యం కుంభకోణం లోక్ సభ ఎన్నికలకు ముందు క్లైమాక్స్ కు రావడానికి రాజకీయ కారణాలు ఉండొచ్చు. కక్షతోనే ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ ఇలా చేసి ఉండొచ్చు. కానీ, ఆరోపణలు నిజం కానంతవరకు అవి ఆరోపణలుగానే ఉంటాయి.
కేసీఆర్ కు విషమ పరీక్ష
40 దశాబ్దాల ప్రత్యక్ష రాజకీయాల్లో ఓ పార్టీ వ్యవస్థాపకుడిగా, మాజీ సీఎంగా అన్నిటికి మించి తెలంగాణ వంటి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర విషమ పరీక్షను ఎదుర్కొంటున్నారు. గతంలో ఎన్నోసార్లు ఆయన ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పటికీ.. ఇప్పుడున్న సందర్భం వేరు. అవినీతి ఆరోపణల్లో నేరుగా ఆయన కుమార్తె కవితనే ఆరోపణలతో అరెస్టయ్యారు.
చర్యలు తీసుకుంటారా?
గతంలో ఆలె నరేంద్ర, సిరిసిల్ల రాజయ్య సహా ఎందరో కీలక రాజకీయ నాయకులపై కేసీఆర్ పార్టీ పరంగా చర్యలు తీసుకున్నారు. వారిపై ఆరోపణలు రావడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ వ్యవస్థాపన నుంచి ఉద్యమం ఆసాంతం కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ నూ మూడేళ్ల కిందట మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేశారు. ఈటల భూ ఆక్రమణలపై ఆరోపణలు రావడంతో ఆయనపై పార్టీ పరంగా వేటు వేశారు. ఇలా చెప్పుకొంటూ పోతే ఎందరో? మరి.. ఇదే నియమం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీగా కూడా ఉన్న కవితకు ఎందుకు వర్తించదనే ప్రశ్న రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. మరోవైపు కేసీఆర్ కుమార్తె అయితే చర్యలు తీసుకోరా? అని నిలదీత ఎదురవుతోంది. కవిత తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కూడా. తెలంగాణ కల్చర్ ను ప్రపంచానికి చాటేందుకు దీనిని ఏర్పాటు చేశారు. అలాంటి వ్యక్తే మద్యం కేసు ఆరోపణల్లో చిక్కుకున్నారు. ఇవి వాస్తవం కాదని నిరూపణ అయ్యేవరకైనా ఆమెను పార్టీ నుంచి దూరంగా ఉంచే ప్రయత్నం చేయడం లేదేమని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.