ఈ కాపు ఎమ్మెల్యే రూటు ఎటు?
మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి దర్శి సీటును జగన్ కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల ముంగిట ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం వైసీపీకి చిక్కులు తెచ్చిపెడుతోందని టాక్ నడుస్తోంది. గత ఎన్నికల్లో దర్శి నుంచి వైసీపీ తరఫున కాపు సామాజికవర్గానికి చెందిన మద్దిశెట్టి వేణుగోపాల్ గెలిచారు. అయితే వచ్చే ఎన్నికల కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇటీవల ప్రకటించిన జాబితాలో ఆయనకు సీటు దక్కలేదు. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి దర్శి సీటును జగన్ కేటాయించారు.
దర్శి నుంచి 2009లో కాంగ్రెస్ తరఫున గెలిచిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి.. వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తల్లి బూచేపల్లి వెంకాయమ్మ ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్నారు.
కాగా 2009లో దర్శి నుంచి గెలిచిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 2014లో వైసీపీ తరఫున బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి శిద్ధా రాఘవరావు చేతిలో ఓటమిపాలయ్యారు. 2019లో బూచేపల్లి తనకు పోటీ చేసే ఉద్దేశం లేదని చెప్పడంతో జగన్.. మద్దిశెట్టి వేణుగోపాల్ కు దర్శి టికెట్ ఇచ్చారు. అయితే నియోజకవర్గంపై పెత్తనం కోసం ఎమ్మెల్యే మద్ధిశెట్టితోపాటు బూచేపల్లి కూడా ప్రయత్నించారు. దీంతో అధికారుల బదిలీలు, మాట, పెత్తనం అన్నీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డివే చెల్లుబాటయ్యాయి. సహజంగానే ఈ పరిణామం ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కు రుచించలేదని చెబుతున్నారు.
ఇప్పుడు ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్ కు జగన్ సీటు నిరాకరించడం, మరెక్కడా ఇప్పటివరకు సీటు కేటాయించకపోవడం, ప్రత్యామ్నాయం ఏంటో చెప్పకపోవడంతో ఆయన ఆగ్రహంతో రగిలిపోతున్నారని టాక్ నడుస్తోంది. మరోవైపు దర్శి నియోజకవర్గ ఇంచార్జిగా నియమితుడైన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సైతం తనను కలవకపోవడం, కనీసం తన అనుచరులను కూడా కలవకపోవడంతో మద్దిశెట్టి వేణుగోపాల్ పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
వాస్తవానికి మద్ధిశెట్టి వేణుగోపాల్ 2009లో దర్శి నుంచి ప్రముఖ నటుడు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి 25,000కు పైగా ఓట్లు సాధించారు. వైసీపీ ఏర్పాటు తర్వాత ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
తనకు సీటు నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన లేదా టీడీపీలో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
సిటింగ్ సీటు లేదనడం, మరో సీటు అడిగితే సానుకూలంగా స్పందించకపోవటం, చివరికి కొత్త ఇంచార్జికి సహకరించాలన్న విజ్ఞప్తీ లేకపోవటం, తన భవిష్యత్తు ఏంటో చెప్పకపోవడం వంటి కారణాలతోనే మద్దిశెట్టి వేణుగోపాల్ పార్టీ వీడే యోచనలో ఉన్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తన స్వగ్రామమైన పామూరు మండలం లక్ష్మీనరసాపురంలో మద్దిశెట్టి దర్శి నియోజకవర్గంలోని అనుచరులతో తాజాగా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే చివరి క్షణంలో ఆయన కాకుండా వేణుగోపాల్ సోదరుడు శ్రీధర్, మరో సోదరుడు హాజరయ్యారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని పలువురు ఎంపీపీలు, దర్శి ఏఎంసీ చైర్మన్, వైస్ ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్ లు, తదితరులు హాజరయ్యారు. మద్దిశెట్టి ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా ఆయన వెంటే నడుస్తామని వారంతా చెప్పినట్టు తెలుస్తోంది.