జేపీ బాటలో జగన్‌ నడుస్తారా?

అయితే 11 సీట్లే రావడంతో జగన్‌ ప్రతిపక్ష నేత హోదాకు దూరమయ్యారు.

Update: 2024-07-06 23:30 GMT

వై నాట్‌ 175 అంటూ ఏపీ ఎన్నికల బరిలో దిగిన వైసీపీకి ఓటర్లు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. కేవలం 11 స్థానాలనే వైసీపీ గెలుచుకోగలిగింది. దీంతో ప్రతిపక్ష నేత హోదాను కూడా జగన్‌ దక్కించుకోలేకపోయారు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే అసెంబ్లీలో కనీసం 18 సీట్లను సాధించాల్సి ఉంది. అయితే 11 సీట్లే రావడంతో జగన్‌ ప్రతిపక్ష నేత హోదాకు దూరమయ్యారు.

అయినప్పటికీ తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని వైఎస్‌ జగన్‌.. స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడుకు లేఖ రాశారు. అయితే ఆయన ఈ లేఖపై ఇంతవరకు స్పందించలేదు. శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్, తదితర టీడీపీ నేతలు జగన్‌ లేఖపై స్పందించారు. జగన్‌ కు ప్రతిపక్ష నేత హోదా రాలేదని.. ఆయన కేవలం వైసీపీ ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమేనన్నారు. అసెంబ్లీలో పది శాతం సీట్లను గెలుచుకుంటేనే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా లభిస్తుందన్నారు. గతంలో ఇలాగే కాంగ్రెస్‌ పార్టీ 10 శాతం సీట్లను గెలవకపోవడంతో పి,జనార్దన్‌ రెడ్డిని కూడా ఫ్లోర్‌ లీడర్‌ గానే గుర్తించారని పయ్యావుల కేశవ్‌ గుర్తు చేశారు.

కాగా ఏపీ శాసనసభలో నాలుగు పార్టీల సభ్యులు మాత్రమే ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ సభ్యులు అసెంబ్లీలో ఉన్నారు. ఈ నాలుగు పార్టీల్లో వైసీపీ మినహాయించి మిగిలినవి ఎన్నికల్లో కూటమిగా పోటీ చేశాయి. ఇక ప్రతిపక్షంగా వైసీపీనే ఉండనుందని అంటున్నారు.

జగన్‌ ను స్పీకర్‌ ప్రతిపక్ష నేతగా గుర్తించినా, గుర్తించకున్నా అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్షం వైసీపీనే. ఈ నేపథ్యంలో అధికార కూటమి మంత్రులు, ముఖ్యమంత్రి వివిధ అంశాలపై మాట్లాడేటప్పుడు ప్రతిపక్షంగా వైసీపీ నేతల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుందంటున్నారు.

2009 లోక్‌ సత్తా తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ్‌ మాత్రమే గెలుపొందారని గుర్తు చేస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ లోని కూకట్‌ పల్లి నుంచి ఆయన విజయం సాధించి అసెంబ్లీకి వెళ్లారని చెబుతున్నారు. లోక్‌ సత్తా తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధించారని గుర్తు చేస్తున్నారు. ఒక పార్టీ అధినేతగా, లోక్‌ సత్తా తరఫున గెలుపొందిన ఏకైక సభ్యుడిగా తనకు అసెంబ్లీలో దక్కిన అవకాశాన్ని జయప్రకాశ్‌ నారాయణ్‌ చక్కగా వినియోగించుకున్నారని గుర్తు చేస్తున్నారు.

అలాగే 2014–24 వరకు లోక్‌ సభలో కూడా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ సహా విపక్ష పార్టీల్లో ఏ పార్టీకి నిర్దేశిత సంఖ్యలో సీట్లు రాకపోవడంతో పదేళ్ల పాటు కేంద్రంలో ప్రతిపక్ష నేత పదవి ఖాళీగానే ఉందని అంటున్నారు. అయినప్పటికీ రాహుల్‌ గాంధీ సభకు హాజరై బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకుపెట్టారని గుర్తు చేస్తున్నారు.

ఇప్పుడు వైఎస్‌ జగన్‌ కూడా ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా, ఇవ్వకున్నా అసెంబ్లీకి వస్తే మంచిదంటున్నారు. అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్షం వైసీపీనే కాబట్టి ఆటోమేటిక్‌ గా ప్రతిపక్ష నేతలకు మాట్లాడే అవకాశం స్పీకర్‌ ఇస్తారని చెబుతున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వ హామీలు, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

అయితే స్పీకర్‌ ఎన్నిక సందర్భంగా జగన్‌ ప్రవర్తన వివాదాస్పదమైంది. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఆయన వెళ్లిపోయారు. స్పీకర్‌ గా ఎన్నికయిన అయ్యన్నపాత్రుడిని స్పీకర్‌ చైర్లో కూర్చోబెట్టేవరకు జగన్‌ లేరు. దీంతో జగన్‌ కు అసెంబ్లీకి వచ్చే ఉద్దేశం లేదని అంటున్నారు.

మరో కొద్ది రోజుల్లో శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పూర్తి స్థాయి బడ్జెట్‌ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఈ నేపథ్యంలో జగన్‌ అసెంబ్లీకి హాజరయితే ప్రభుత్వ హామీలు, బడ్జెట్‌ కేటాయింపులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో మరి జగన్‌ రానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారో, లేదో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News