జైలుకెళ్లొచ్చిన సీఎం హేమంత్ హిట్టు.. మరి కేజ్రీవాల్?
అయితే, అనూహ్యంగా జైలులో ఉన్నన్ని నెలలు సీఎంగా కొనసాగిన కేజ్రీవాల్.. బయటకు వచ్చాక తన పదవికి రాజీనామా చేశారు.
గత ఐదేళ్లలో మరీ ముఖ్యంగా రెండేళ్లలో దేశ రాజకీయాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు జైలుకెళ్లారు. ఢిల్లీ సీఎంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ మద్యం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత కేజ్రీ తిహాడ్ జైలుకు వెళ్లారు. అక్కడినుంచే తాత్కాలిక బెయిల్ పొంది లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేశారు. హరియాణా ఎన్నికల ముంగిట ఆయనకు పూర్తిస్థాయి బెయిల్ లభించింది. అయితే, అనూహ్యంగా జైలులో ఉన్నన్ని నెలలు సీఎంగా కొనసాగిన కేజ్రీవాల్.. బయటకు వచ్చాక తన పదవికి రాజీనామా చేశారు.
అప్పట్లో లాలూ..
ఓ విధంగా చెప్పాలంటే.. పశు దాణా కుంభకోణంలో అప్పట్లో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఉమ్మడి బిహార్ సీఎం పదవికి రాజీనామా చేసి జైలుకెళ్లారు. మొన్నటికి మొన్న జార్ఖండ్ (బిహార్ నుంచి విడిపడిన రాష్ట్రం) సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ సైతం భూ వివాదానికి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో జైలుకు వెళ్లారు. ఆయన పదవికి రాజీనామా చేసి జైలుకెళ్లారు. కానీ, కేజ్రీ మాత్రం జైలుకెళ్లినా సీఎం పదవిలో కొనసాగుతూనే వచ్చారు. కాగా, జైలుకెళ్తూ లాలూ తన భార్య రబ్రీదేవిని సీఎం చేశారు. ఆమె తమ పార్టీని మరోసారి గెలిపించారు.
హేమంత్ పదవిని వదిలి.. చేపట్టి
జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రయాణం రెండు భాగాలు. మైనింగ్ కేసులో జైలుకెళ్లే ముందు ఆయన పదవికి రాజీనామా చేశారు. తమ కుటుంబానికి నమ్మిన బంటు అయిన చంపయీ సోరెన్ ను సీఎం చేశారు. అయితే, బెయిల్ పై తిరిగొచ్చాక మాత్రం హేమంత్ పదవిని తిరిగి చేపట్టారు. అదే ధీమాతో కాంగ్రెస్, ఆర్జేడీలతో జట్టు కట్టి తాజా ఎన్నికల్లో జయకేతనం ఎగురవేశారు. ఈడీ కేసులు.. అరెస్టులు.. చంపయీ, వదిన సీతా సోరెన్ తిరుగుబాట్లు.. ప్రత్యర్థి బీజేపీ వ్యూహాలను ఎదుర్కొని మరీ జేఎంఎం విజయ ఢంకా మోగించింది.
మరి ఢిల్లీలో ఏం జరుగుతుందో?
వచ్చే ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. గత రెండు దఫాలుగా ఇక్కడ ఆప్ విజయం సాధిస్తోంది. ఈసారి ఎలాగైనా ఆ పార్టీని దెబ్బతీయాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే కేజ్రీవాల్ ను జైలుకు పంపింది. అయితే, ఆయన మాత్రం అన్నిటికీ ఢీ అన్నట్లున్నారు. మచ్చపడిన నాయకుడిగా కొనసాగడం కంటే పదవిని త్యాగం చేసినవాడిగా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించకున్నారు. ఎన్నికలకు రెండు నెలలు ఉండగానే మొదటి జాబితాను విడుదల చేశారు. మరి ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.