ట్రంప్ గెలుపు...మళ్ళీ ప్రధానిగా షేక్ హసీనా ?
ఆయన గతంలోనూ అలాగే చాలా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
అమెరికా ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ గెలవడం అమెరికాతో పాటు ప్రపంచ గమనాన్ని కూడా మార్చేసేదిగా ఉంటుందని అంతా విశ్లేషించుకుంటున్న సంగతి తెలిసిందే. ట్రంప్ బోల్డ్ డెసిషన్స్ బోలెడు తీసుకుంటారు అని పేరు. ఆయన గతంలోనూ అలాగే చాలా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
ఇదిలా ఉంటే ట్రంప్ రాకతో బంగ్లాదేశ్ లో రాజకీయం పూర్తిగా మారుతుందని అంటున్నారు. అదెలా అంటే ఇప్పటికి కొద్ది నెలల క్రితం బంగ్లాదేశ్ లో అనూహ్యమైన రాజకీయ పరిణామాలు జరిగి షేక్ హసీనా తన ప్రధాని పదవిని కోల్పోయి ఇండియాకు చేరుకున్నారు. ఆమె ప్రస్తుతం భారత్ లో ఉంటున్నారు.
మరో వైపు బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఆ విధంగా తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనస్ కొనసాగుతున్నారు. షేక్ హసీనా గద్దె దిగడం అలాగే బంగ్లాలో అల్లర్లు రాజకీయం మార్పు వంటి సంఘ్టన వెనక అమెరికా పరోక్ష జోక్యం ఉంది అన్న అనుమానాలు కూడా ఉన్నాయని ప్రచారం సాగింది.
జో బైడెన్ హస్తం ఉందని కూడా ప్రచారం సాగింది. ఇక జో బైడెన్ కి అలాగే ప్రస్తుతం ట్రంప్ మీద పోటీ చేసి ఓటమి పాలు అయిన కమలా హరీస్ కి మద్దతుదారుగా అత్యంత ఆప్తుడుగా ఉన్నారని కూడా అంటున్నారు. అంతే కాదు 2016లో ట్రంప్ మొదటిసారి అమెరికా ప్రెసిడెంట్ గా గెలిచినపుడు మహమ్మద్ యూనఫ్ చేసిన వ్యాఖ్యలను కూడా ఇపుడు గుర్తు చేసుకుంటున్నారు.
అమెరికా ప్రెసిడెంట్ గా ట్రంప్ విజయంతో తాను శక్తిని కోల్పోయాను అని మాట్లాడలేకపోతున్నాను అని యూనఫ్ నాడు వ్యాఖ్యానించడం ద్వారా ట్రంప్ పట్ల తనకు ఉన్న వ్యతిరేక భావాన్ని వ్యక్తం చేశారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఇపుడు ఆయనే తాత్కాలిక ప్రధానిగా ఉన్నారు.
ఇపుడు బలమైన నేతగా మరోసారి అమెరికా పెద్దన్న పాత్రలోకి ట్రంప్ వచ్చారు. ఇక అమెరికా ఎన్నికలకు ముందే ట్రంప్ బంగ్లదేశ్ లో హిందువుల ఊచ కోత మీద ఘాటు విమర్శలు చేశారు. హిందువులను హింసించడాన్ని ఆయన తప్పు పట్టారు. ఇలా ఆయన మాట్లాడిన తీరుని చూసినా బంగ్లాలో రాజకీయ పరిణామాలు అక్కడ హిందువుల అగచాట్లు హసీనా పదవీచ్యుతి ఇవన్నీ కూడా ట్రంప్ కి నచ్చనివే అంటున్నారు
దాంతో ఆయన కీలకమైన నిర్ణయం దిశగా అడుగులు వేస్తారు అని అంటున్నారు. పైగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి ట్రంప్ కి మంచి దోస్తీ ఉంది. ఇక బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో కూడా మోడీకి మంచి స్నేహం ఉంది. ఆమెను తిరిగి గద్దెనెక్కించే విషయంలో అటు ట్రంప్ ఇటు మోడీ కలసి పనిచేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇక ట్రంప్ సాధించిన ఘన విజయం పట్ల మాజీ ప్రధాని షేక్ హసీనా ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేయడాన్ని కూడా గమనంలోకి తీసుకుంటే ఆమెకు ట్రంప్ రాక ఎంతటి సంతోషాన్ని కలిగిస్తుందో అర్ధం చేసుకోవాలని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ట్రంప్ రాకతో బంగ్లాదేశ్ లో పరిణామాలు వేగంగా మారుతాయని షేక్ హసీనా మళ్లీ ప్రధాని అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు.