మిట్టల్ ఉక్కుతో విశాఖ ఉక్కు కి చెక్ ?

ప్రభుత్వ రంగంలో విశాఖ ఉక్కు ఉత్పత్తిని ప్రారంభించి మూడున్నర దశాబ్దాల కాలం అయింది.

Update: 2024-11-09 03:47 GMT

ఇప్పటికి ఆరున్నర దశాబ్దాల క్రితం భారీ ఉద్యమం చేసి మరీ విశాఖలో ఉక్కు కర్మాగారాన్ని సాధించారు. ప్రభుత్వ రంగంలో విశాఖ ఉక్కు ఉత్పత్తిని ప్రారంభించి మూడున్నర దశాబ్దాల కాలం అయింది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎన్నతగిన స్టీల్ ని ఉత్పత్తి చేస్తూ మంచి మార్కెట్ ని కలిగిన విశాఖ ఉక్కు మీద గత నాలుగున్నరేళ్లుగా నీలి నీడలు కమ్ముకున్నాయి.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ సాగించిన ఒకనాటి వీరోచిత పోరాటం మళ్ళీ చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది అని అంటున్నారు. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయమన్న ఒక్క ప్రకటన కూడా కేంద్రం నుంచి ఈ రోజుకీ రాకపోవడం ఉక్కులో వీఆర్ ఎస్ ని అమలు చేయడానికి చూడడం కార్మికుల సంఖ్యను తగ్గించడం, పదవీ విరమణ చేసిన వారి ప్లేస్ లో కొత్త వారిని తీసుకునేలా నియామకాలు చేపట్టకపోవడం, విశాఖ ఉక్కుని సొంత గనులు కేటాయించి వర్కింగ్ కేపిటల్ ని సమకూర్చాలన్న డిమాండ్ ని పక్కన పెట్టడం తో పాటు దసరా దీపావళి పండుగలకు జీతాలు ఇవ్వకపోవడంతో విశాఖ ఉక్కు ప్రైవేట్ రూట్ లోకే వెళ్తోంది అని కార్మిక లోకం కచ్చితమైన అంచనాకు వచ్చేశారు.

దానికి తోడు అన్నట్లుగా అనకాపల్లి జిల్లాలో మిట్టల్ వారి ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతుండడంతో విశాఖ ఉక్కు దక్కేట్లు లేవన్న భావన గట్టిగా బలపడుతోంది. దీంతో విశాఖ ఉక్కుని కాపాడుకోవడం కోసం భారీ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఉద్యోగ కార్మికులు చేపట్టిన ఉద్యమానికి 1300 రోజులు నిండాయి. దాంతో ఈ నెల 10న విశాఖ బీచ్ లో వేలాదిగా ఉక్కు కార్మికులు ప్రజలతో భారీ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఆ తరువాత విశాఖ నుంచి పది లక్షల పోస్టు కార్డులతో కేంద్రం చెవిన విశాఖ ఉక్కు విషయం చేరవేసేందుకు భారీ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టనున్నారు.

ఉత్తరాంధ్రా ప్రజా సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ భారీ కార్యక్రమాలకు ప్రజా సంఘాలు వామపక్ష సంఘాలు కార్మిక సంఘాల నేతలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. జనవరి 27న విశాఖలో లక్ష మందితో భారీ సభను కూడా నిర్వహించి కేంద్రం చేత విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయబోమని స్పష్టమైన ప్రకటన చేయించాలని పట్టుదల మీద ఉన్నారు. విశాఖ ఉక్కుని కాపాడుకోవడమే లక్ష్యమని ఐక్య ఉద్యమ నేతలు స్పష్టం చేస్తున్నారు.

Tags:    

Similar News