మంత్రి పదవులకు బ్రాహ్మణులు పనికిరారా ?

ఏపీలో మాత్రం వైసీపీ అయినా టీడీపీ అయినా అది అమలు కావడం లేదు.

Update: 2024-06-16 03:30 GMT

ఏపీలో మంత్రి పదవులు బ్రాహ్మణ సామాజిక వర్గం చేపట్టి దశాబ్దాలు అవుతోంది. అదే తెలంగాణాలో ఈ రోజుకీ ఒక మంత్రి ఉన్నారు. ఆయనే ఉమ్మడి ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు కుమారుడు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. ఆయన అత్యంత కీలకమైన ఆర్ధిక శాఖతో పాటు శాసనసభా వ్యవహారాలను కూడా చూస్తున్నారు. ఇక 2004లో వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణులకు మంత్రి వర్గంలో ప్రాధాన్యత ఇచ్చారు. అలా అది కొనసాగుతూ రేవంత్ రెడ్డి సర్కార్ లోనూ అమలు అవుతోంది. ఏపీలో మాత్రం వైసీపీ అయినా టీడీపీ అయినా అది అమలు కావడం లేదు.

గత పదేళ్ళుగా ఏపీలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు మంత్రులుగా ఉన్నారు కానీ బ్రాహ్మణుల నుంచి ఎవరికీ స్థానం లేదు. ఇలా రెండు ప్రభుత్వాలు పూర్తి అయి మూడవ ప్రభుత్వం వచ్చినా బ్రాహ్మణులకు న్యాయం అయితే జరగలేదు. ఆ మాటకు వస్తే గత అసెంబ్లీలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఇద్దరు ఉంటే ఈసారికి ఆ సంఖ్య ఒకటికి పరిమితం అయింది.

గత వైసీపీ ప్రభుత్వంలో అందరికీ మంత్రులు ఇచ్చారు. బ్రాహ్మణ కోటాలో బాపట్ల నుంచి కోన రఘుపతి, విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణుల పేర్లు వినిపించినా వారికి చాన్స్ దక్కలేదు. డిప్యూటీ స్పీకర్ గా కోన రఘుపతిని తొలి మూడేళ్ళు కొనసాగించారు. అలాగే మల్లాది విష్ణుకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవిని ఇచ్చారు.

అదే సమయంలో వైశ్యులకు, రాజులకు మంత్రి పదవులు వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది. దీని కంటే ముందు 2014 నుంచి 2019 దాకా సాగిన చంద్రబాబు ప్రభుత్వంలోనూ బ్రాహ్మణులకు అన్యాయమే జరిగింది. ఆనాడూ ఈనాడూ టీడీపీ నుంచి ఒక్క బ్రాహ్మణ ఎమ్మెల్యే కూడా లేరు సరికదా ఎమ్మెల్సీ పదవులు అయినా వారికి దక్కలేదు. దాంతో బ్రాహ్మణులకు మంత్రి పదవి అన్నది అందని పండే అయింది.

ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ కోన రఘుపతికే టికెట్ ఇచ్చింది. ఆయన ఓటమి చెందారు. టీడీపీ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఎవరికీ టికెట్ ఇవ్వలేదు. జనసేన నుంచి ఒకరికి టికెట్ దక్కింది. నెల్లిమర్ల నుంచి లోకం మాధవికి పవన్ టికెట్ ఇచ్చారు. దాంతో బ్రాహ్మణుల ఆశలు అన్నీ ఆమె మీదనే ఉన్నాయి. ఏపీలో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. దానిని జనసేన కోటాలో ఆమెకు ఇస్తే దాదాపు దశాబ్దం తరువాత ఏపీలో బ్రాహ్మణ మంత్రిని చూడవచ్చు అని ఆ సామాజిక వర్గం నేతలు ఆశపడుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రతీ మంత్రి చాంబర్ వద్ద పూజలు చేయిస్తూ వారికి మంచి జరగాలని దీవించే బ్రాహ్మణులకు మంత్రి పదవులు వద్దనుకున్నారా లేక వారు దీవెనలకే పరిమితం అనుకున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. గతంలో అంటే 1983కి ముందు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముగ్గురు నలుగురు బ్రాహ్మణులు మంత్రులుగా ఉండేవారు. అలాగే డజన్ కి పైగా ఎమ్మెల్యేలు ఉండేవారు.

రాను రానూ ఆ సంఖ్య పూర్తిగా పోయి సున్నాకి పరిమితం అవుతోంది అని అంటున్నారు. ఏపీలో మూడు నాలుగు లక్షల మంది జనాభా ఉన్న వారికి కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి మంత్రి పదవులు ఇస్తున్న నేపధ్యంలో పది నుంచి పన్నెండు లక్షల దాకా ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని రాజకీయ పార్టీలు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవులలో అయినా న్యాయం చేయాలని వారికి నామినేటెడ్ పదవులలో తీసుకోవాలని ఆయా సంఘాల నేతల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.

Tags:    

Similar News