చెట్లను కాపాడేందుకు ఈమె చేసిన సాహసం న భూతో న భవిష్యతీ!

ఇదే సమయంలో.. నరికేసిన తర్వాతే తెలుస్తుంది చెట్టు విలువ అని కూడా అనుకోవచ్చు.

Update: 2024-10-20 01:30 GMT

చీకట్లోనే తెలుస్తుంది దీపం విలువ.. దూరమయ్యాకే తెలుస్తుంది మనిషి విలువ అంటారు. ఇదే సమయంలో.. నరికేసిన తర్వాతే తెలుస్తుంది చెట్టు విలువ అని కూడా అనుకోవచ్చు. వృక్షో రక్షతి రక్షితః అని ఎప్పుడో చెప్పారు. అయితే ఇవి చెప్పుకోవడం, రాసుకోవడమే తప్ప.. ఆచరణలో ఆమడదూరం అనే చర్చ ఎప్పటినుంచో వినిపిస్తుంది.


ఇప్పటికే సీజన్ తో సంబంధం లేకుండా ప్రకృతి ప్రకోపం చూస్తున్నప్పటికీ.. పర్యావరణానికి, కాలాల సమన్వయానికి వృక్షాల అవసరం కీలకం అనే విషయం మనిషి మరిచిపోతున్నాడు! అయితే.. చెట్లను కాపాడటం కోసం 23 ఏళ్ల వయసులో ఎవరూ చేయలేనటువంటి సాహసం చేశారు జూలియా హిల్. ఆమె గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!


అవును... అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన పర్యావరణ పరిరక్షకురాలు జూలియా హిల్. ఈమె 16ఏళ్ల వయసులో కళాశాల కోర్సులను ప్రారంభించింది.. 18 ఏళ్ల వయసులోనే సొంత రెస్టారెంట్ ను ప్రారంభించింది. అయితే 1996లో తన 22వ ఏట ఓ ఘోరమైన కారు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడింది.


దీంతో అప్పటి నుంచి ఆమె ఆలోచనా విధానం మారిపోయిందని ఆమె చెబుతుంటారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన అనంతరం ఆమె.. కాలిఫోర్నియాలోని రెడ్ వుడ్ అడవుల్లో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందినట్లు చెబుతారు. ఈ సందర్భంగా... ప్రపంచంలో మిగిలి ఉన్న పురాతన రెడ్ వుడ్ వృక్షాల విధ్వంసాన్ని అరికట్టడానికి ఆమె కంకణం కట్టుకున్నారు.

ఈ సమయంలో 1997లో ఓ కంపెనీ కుర్చీల తయారీ కోసం సుమారు వెయ్యేళ్ల భారీ వృక్షాలను తొలగించేందుకు సిద్ధమైంది. దీంతో... జూలియా నిరసనకు దిగారు. ఇందులో భాగంగా.. సుమారు 200 అడుగుల ఎత్తైన ఓ వృక్షంపైకి ఎక్కి తన నిరసనను తెలిపారు. ఇదే క్రమంలో... 738 రోజులు చెట్టుపైనే నివాసం ఏర్పాటు చేసుకుని ఉండిపోయారు.

ఇందులో భాగంగా... 1997 డిసెంబర్ 10 నుంచి 1999 డిసెంబర్ 18 వరకూ ఆమె 1000 సంవత్సరాల వయసున్న పురాతన కాలిఫోర్నియా రెడ్ వుడ్ చెట్టులో నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండిపోయారు. విపరీతమైన ఎండ, తీవ్రమైన చలి, కుండపోత వర్షాలను సైతం తట్టుకుంటూ ఆమె ఆ చెట్టుపైనే 738 రోజులు ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఆమె అకుంటిత దీక్ష ముందు కంపెనీ తలవంచింది! ఆ పురాతన చెట్లను నరకాలనే ఆలోచనను విరమించుకుంది. దీంతో... ఆమె తన పోరాటం నుంచి విజయం సాధించి.. అనంతరం చెట్టుపై ఉన్న నివాసం నుంచి కదిలారు!

ఈ నేపథ్యంలోనే ప్రకృతితో మానవ సంబంధాలను మార్చడానికి కట్టుబడి ఉన్న సర్కిల్ ఆఫ్ లైఫ్ ఫౌండేషన్ (సీ.ఐ.ఎల్.ఎఫ్.)ని స్థాపించారు. ఆమె చెట్టుపై ఉన్న అనుభవం గురించి "ది లెగసీ ఆఫ్ లూనా: ది స్టోరీ ఆఫ్ ఎ ట్రీ" అనే పుస్తకాన్ని రచించారు.

Tags:    

Similar News