అన్నదమ్ముల రగడ.. 'తుని' తన్నేస్తుందా?!
రాజకీయాల్లో సొంత కుటుంబాలు కలిసి ప్రత్యర్థులపై పోటీ చేస్తున్న పరిస్థితి తెలంగాణలో కనిపిస్తోంది
రాజకీయాల్లో సొంత కుటుంబాలు కలిసి ప్రత్యర్థులపై పోటీ చేస్తున్న పరిస్థితి తెలంగాణలో కనిపిస్తోంది. అయితే.. దీనికి భిన్నంగా అన్నాదమ్ములు.. అన్నా చెల్లెళ్లు కొట్టేసుకుంటున్న పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది. విజయవాడలో ఎంపీగా పోటీలో ఉన్న కేశినేని బ్రదర్స్ తీవ్రస్థాయిలో మాటలు రువ్వుకున్నారు. ఇక, కడపలో అన్న జగన్‌పై సోదరి షర్మిల విజృంభించారు. ఇలా.. చాలా నియోజకవర్గాల్లో సొంత కుటుంబ సభ్యులే రాజకీయంగా కుమ్మేసుకున్నారు. అయితే.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గంలో పోటీలో లేకపోయినా.. అన్నదమ్ములు పొలిటికల్ యుద్ధం చేసుకున్నారు.
దీంతో అదే కుటుంబానికి చెందిన మహిళా నాయకురాలు.. ఇప్పుడు గెలుస్తానా? లేదా? అని తీవ్రస్థాయిలో సతమతం అవుతు న్నారు. తుని నియోజకవర్గం ఒకప్పుడు.. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు కంచుకోట ఆయన ఇక్కడ నుంచి ఆరుసార్లు విజయం దక్కించుకున్నారు. అయితే.. 2009 నుంచి ఆయన పరాజయం పాలయ్యారు. దీంతో 2014లో ఆయన సోదరుడు యనమల కృష్ణుడు బరిలో ఉన్నారు. 2019లోనూ టీడీపీ నుంచి పోటీ చేశారు. కానీ,ఆ యన రెండు సార్లూ ఓడిపోయారు.
దీంతో ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో పట్టుబట్టి యనమల తన కుమార్తె పుట్టా దివ్యకు అవకాశం కల్పించారు. ఈమె టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్‌కు కోడలు. అయితే.. తనకు టికెట్ ఇవ్వకుండా.. తన సొంత అన్నే అడ్డుపడ్డారన్నది యనమల కృష్ణుడి ఆవేదన. దీంతో ఆయన ఎదురు తిరిగారు. టికెట్ ఎందుకు ఇవ్వరంటూ..ఎన్నికల సమయంలోనే యుద్ధం చేశారు. అయినా..చంద్రబాబు కానీ, యనమల కానీ పట్టించుకోలేదు. దీనికి తోడు.. కృష్ణుడు వర్గాన్ని దివ్య పక్కన పెట్టారు. ఫలితంగా పొలింగ్‌కు వారం రోజుల ముందు కృష్ణుడు వైసీపీలో చేరారు.
ఫలితంగా తునిలో అన్నకుమార్తెకు వ్యతిరేకంగా బాబాయి కృష్ణుడు చక్రం తిప్పారు. అన్నపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిం చారు. తన అన్న ఆర్థిక మంత్రిగా ఉండి.. రాష్ట్రానికి కాకుండా.. తన కుటుంబానికి మేలు చేసుకున్నారని అన్నారు. ఈ క్రమంలో రామకృష్ణుడు కూడా.. తమ్ముడిపై తీవ్ర విమర్శలు చేశారు. మొత్తంగా అటు అన్న.. ఇటు తమ్ముడు.. కూడా వ్యక్తిగత విమర్శ లతో రాజకీయాలను వేడెక్కించారు. వైసీపీ పక్షాన కృష్ణుడు చేసిన ప్రచారం ఓ రేంజ్‌లో చర్చకు వచ్చింది. మొత్తంగా చూస్తే.. అన్నదమ్ముల తన్నులాటలో తుని ఫలితం `దివ్యం`గా ఉంటుందా? లేక.. ఎదురీత తప్పదా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఓటింగ్ శాతం పెరగడం కూడా గమనార్హం.