ఆర్ఆర్ చట్టం...వైసీపీ గుండెల్లో రైళ్ళు ?

దేని మీద అయినా ష్యూరిటీ ఇచ్చి ఆ మీదట బకాయి తీర్చకపోతే ఈ చట్టం ప్రకారం నిందితుడిగా చేసి శిక్షించవచ్చు.

Update: 2024-07-03 23:30 GMT

ఆర్ఆర్ చట్టం ఇపుడు ఏపీలో నానుతోంది. ఏమిటీ కొత్త చట్టం అని అంతా అనుకుంటున్నారు. అయితే ఇది 1864 నుంచే ఉంది. ఆ మీదట చాలా సవరణలు తెచ్చారు. దేని మీద అయినా ష్యూరిటీ ఇచ్చి ఆ మీదట బకాయి తీర్చకపోతే ఈ చట్టం ప్రకారం నిందితుడిగా చేసి శిక్షించవచ్చు. ఆయన ఆస్తులు వేలం వేసి రావాల్సిన ఆదాయన్ని అలా సమకూర్చుకోవచ్చు.

అయితే ఈ ఆర్ఆర్ యాక్ట్ ఎందుకు ఏపీలో అవసరం అంటే ఇది మామూలుగా అమలవుతోంది. కానీ దీనిని వైసీపీ నేతల మీద ప్రయోగించమని సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామక్రిష్ణుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు.

అయిదేళ్ళ పాటు ఏపీలోని ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బ తీసి అక్రమార్జన చేస్తూ సొంత ఆస్తులు పెంచుకున్న వైసీపీ నేతల మీద ఆర్ ఆర్ యాక్ట్ ప్రయోగించి వారి నుంచి సొమ్ము రికవరీ చేయమని యనమల టీడీపీ కూటమి ప్రభుత్వానికి సూచించారు. దానికి ఆయన సులువు చెప్పారు. గత ఐదేళ్ళలో వైసీపీ నేతలు వివిధ మార్గాలలో అక్రమంగా సంపాదించిన దాన్ని ఈ చట్టం ఆసరాతో తిరిగి స్వాధీనపరచు కోవచ్చు అన్నది యనమల వారి విలువైన సలహా.

వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అక్రమాలు అవినీతి చేశారని విమర్శలు ఉన్నాయి. పైగా ఏపీ అప్పులలో ఉంది. దాంతో వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని ప్రభుత్వం సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో ప్రభుత్వానికి మరో మార్గం ద్వారా ఆదాయం వస్తుందని యనమల చెబుతున్నారు. అదే వైసీపీ నేతల మీద ఆర్ఆర్ చట్టాన్ని ప్రయోగించడమే అని అంటున్నారు.

ఆర్ఆర్ చట్టం కింద ఆస్తులు జప్తు చేయవచ్చు.వేలం వేయవచ్చు. అలాగే ఇతర మార్గాల ద్వారా ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు. అయితే వారు అక్రమాలకు పాల్పడ్డారు అని రుజువు కావాలి సర్కార్ సొమ్ముని తిన్నారన్న అభియోగాలు రుజువు కావాలి. టీడీపీ ప్రభుత్వం అయితే లిక్కర్ అండ్ సాండ్, ల్యాండ్ మైనింగ్ లలో వైసీపీ నేతలు భారీ అక్రమాలు అవినీతి చేశారు అని విమర్శలు చేస్తోంది.

వీటి మీద విచారణ జరిపించాలని కూడా చూస్తోంది. విచారణ తరువాత శిక్షలు పడడం సర్వసాధారణం. అయితే దాంతో పాటుగా సర్కారీ ఆదాయాన్ని తిరిగి వెనక్కి తెచ్చే విధంగా చూడాలన్నదే యనమల సూచన. ఇందుకోసం యనమల తనకున్న అనుభవంతో ఆయనకు పదిహేను అంశాలతో ప్రభుత్వానికి లేఖ రాశారు.

మరి ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్న టీడీపీకొటమి ప్రభుత్వం యనమల చెప్పినట్లుగా ఆర్ఆర్ చట్టాన్ని ప్రయోగిస్తుందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఈ చట్టంతో పాటుగా చూస్తే అనేక రకాలైన విచారణలు కూడా జరిపిస్తామని కూడా ప్రభుత్వం అంటోంది. దాంతో వైసీపీ నేతల గుండెలలో రైళ్ళు పగిగెడుతున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News