మాజీ మంత్రుల మౌనం...దేనికి సంకేతం ?

నలభై మందికి పైగా మాజీ మంత్రులు ఉన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వేళ వారే నడిపించాల్సి ఉంటుంది.

Update: 2024-07-12 05:30 GMT

వైసీపీ భారీ ఓటమి పాలు అయ్యాక ఆ ప్రభుత్వంలో రెండు విడతలుగా పనిచేసిన నలభై మందికి పైగా మాజీ మంత్రులలో కనీసం నలుగురు అయినా మీడియా ముందుకు రావడం లేదు, పెదవి విప్పడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది అన్న చర్చ అయితే ఉంది.

ఉత్తరాంధ్రాలో తీసుకుంటే గుడివాడ అమర్నాధ్ మాత్రమే పెదవి విప్పుతున్నారు. ఇక ఒకటి రెండు సందర్భాలలో ధర్మాన క్రిష్ణ దాస్, బొత్స సత్యనారాయణ, సీదరి అప్పలరాజు రియాక్ట్ అయినా ప్రతీ ఇష్యూ మీద మాట్లాడుతున్నాది గుడివాడనే అని అంటున్నారు.

ఉత్తరాంధ్రాలో రెండు విడతలుగా చూస్తే అరడజన్ కి పైగా మంత్రులుగా పనిచేసారు. వారిలో బూడి ముత్యాల నాయుడు, అవంతి శ్రీనివాసరావు, పీడిక రాజన్నదొర, పాముల పుష్ప శ్రీవాణి, ధర్మాన ప్రసాదరావు వంటి వారు ఉన్నారు. వీరంతా ఫుల్ సైలెంట్ గానే ఉన్నారు.

గోదావరి జిల్లాల విషయానికి వస్తే మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, పినిపె విశ్వరూప్ కొట్టు సత్యనారాయణ, దాడిశెట్టి రాజా, వనిత, కారుమూరి నాగేశ్వరరావు చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణ వంటి వారు ఉన్నారు. వీరంతా కూడా పెదవి విప్పడం లేదు అన్న చర్చ సాగుతోంది. ఇందులో కొందరు అయితే ఫైర్ బ్రాండ్స్ గా కూడా ఉన్నారు.

అలాగే గుంటూరు జిల్లాలో విడదల రజని అంబటి రాంబాబు, మోపిదేవి వెంకటరమణ, నాగార్జున వంటి వారు ఉన్నారు. వీరిలో అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. క్రిష్ణా జిల్లాలో చూస్తే పేర్ని నాని కొడాలి నాని, జోగి రమేష్ ఉన్నారు. ఇందులో పేర్ని నాని అపుడపుడు కనిపిస్తున్నారు. అలాగే గ్రేటర్ రాయలసీమలో చూస్తే చాలా మంది మంత్రులుగా చేసిన వారు ఉన్నారు.

ఆదిమూలం సురేష్, బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కాకాణి గోవర్ధన్ రెడ్డి వంటి వారు ఉంటే కాకాణి మాత్రమే మాట్లాడుతున్నారు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆయన ఎపుడూ మీడియా ముందుకు పెద్దగా వచ్చిన దాఖలాలు లేవు. అయితే మీడియా ముందుకు ఎపుడూ వచ్చే ఆర్కే రోజా నారాయణస్వామి లాంటి వారు అయితే ఇపుడు మౌనమే మా భాష అంటున్నారు.

అలాగే బుగ్గన రాజేంద్రనధ్ రెడ్డి, అంజాధ్ భాషలతో పాటు ఉష శ్రీ చరణ్, అనంతపురానికి చెందిన మాజీ మంత్రులు చాలా మంది అయితే ఎందుకో సైలెంట్ అయ్యారు. నలభై మందికి పైగా మాజీ మంత్రులు ఉన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వేళ వారే నడిపించాల్సి ఉంటుంది. కానీ రియాక్ట్ కావడంలేదు అంటే వైసీపీ అధినాయకత్వం సీరియస్ గా ఆలోచించాల్సిందే అని అంటున్నారు.

Tags:    

Similar News