కీలక నియోజకవర్గంలో మళ్లీ వైసీపీ అభ్యర్థి మార్పు!

అయితే వైసీపీలోనే మంగళగిరిలో మరో ఇద్దరు కీలక నేతలు ఉన్నారు. వీరిద్దరూ గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసినవారే. అందులోనూ వీరిద్దరూ కూడా చేనేత సామాజికవర్గానికి చెందినవారే.

Update: 2024-02-19 06:36 GMT

గుంటూరు జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ లోనే కీలక నియోజకవర్గాల్లోనే ఒకటి.. మంగళగిరి. ఇక్కడ నుంచి 2019లో నాటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్‌ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లోనూ తాను మంగళగిరి నుంచే పోటీ చేస్తానని ఇప్పటికే నారా లోకేశ్‌ స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో వైసీపీ మరోసారి లోకేశ్‌ ను ఓడించడానికి కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సిట్టింగ్‌ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి వైసీపీ అధినేత జగన్‌ సీటు నిరాకరించారు. వచ్చే ఎన్నికల కోసం చేనేత సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవికి వైసీపీ సీటు కేటాయించింది.

వాస్తవానికి గంజి చిరంజీవి మంగళగిరి టీడీపీ పట్టణ అధ్యక్షుడిగా ఉండేవారు. 2014లో టీడీపీ తరఫున మంగళగిరి బరిలో నిలిచి కేవలం 12 ఓట్ల తేడాతో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక 2019లో నారా లోకేశ్‌ మంగళగిరి నుంచి పోటీ చేయడంతో చిరంజీవికి సీటు దక్కలేదు.

ఈ నేపథ్యంలో చిరంజీవిని వైసీపీలోకి ఆహ్వానించిన జగన్‌.. ఆప్కో చైర్మన్‌ పదవితోపాటు మంగళగిరి వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి పదవి, వైసీపీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్ష పదవిని ఇచ్చారు.

అయితే వైసీపీలోనే మంగళగిరిలో మరో ఇద్దరు కీలక నేతలు ఉన్నారు. వీరిద్దరూ గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసినవారే. అందులోనూ వీరిద్దరూ కూడా చేనేత సామాజికవర్గానికి చెందినవారే. ఆ ఇద్దరే కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు. మురుగుడు 1999, 2004లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా మంగళగిరి నుంచి గెలిచారు. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో మంత్రిగా కూడా పనిచేశారు. మురుగుడు హనుమంతరావు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు.

ఇక కాండ్రు కమల 2009లో కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తనకు సీటు దక్కకపోవడంతో ప్రస్తుతం మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. పదేళ్ల నుంచి మంగళగిరి ఎమ్మెల్యేగా ఈయనే ఉండటంతో వైసీపీ క్యాడర్‌ అంతా ఈయనతోనే ఉందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీ నూతన ఇంచార్జిగా నియమితులైన గంజి చిరంజీవికి వైసీపీ క్యాడర్‌ నుంచి సహాయ సహకారాలు అందడం లేదని టాక్‌ నడుస్తోంది. ఆయన అభ్యర్థిత్వంపైన కూడా క్యాడర్‌ అంత ఇష్టం చూపడం లేదని అంటున్నారు. దీంతో ప్రస్తుతం వైసీపీలోనే ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు సీటు కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది.

మహిళ కోణంలో కాండ్రు కమల, సీనియారిటీ, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం, మంత్రిగా పనిచేసి ఉండటం వంటి కారణాలతో మురుగుడు హనుమంతరావు తమకు సీటు ఇవ్వాలని జగన్‌ ను కోరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళగిరి సీటు తమకు కీలకం కావడంతో ఈ సీటుపైన ఆచితూచి నిర్ణయం తీసుకునే యోచనలో జగన్‌ ఉన్నారని చెబుతున్నారు. ప్రస్తుతానికి కాండ్రు కమల వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.

Tags:    

Similar News