వైసీపీకి విజయమ్మ కూడా ప్రత్యర్థిగానే...?

ఇదిలా ఉంటే విజయమ్మ షర్మిల ఇద్దరూ వైసీపీకి చేటు చేశారు అని వైసీపీ సీనియర్ నేతలు తాజాగా ఆరోపణలు చేస్తున్నారు.

Update: 2024-07-17 02:30 GMT

వైఎస్ విజయమ్మ వైసీపీకి గౌరవ అధ్యక్షురాలు. దాంతో పాటుగా ఆమె తొలి ఎమ్మెల్యే. వైసీపీకి జగన్ తొలి ఎంపీగా ఎలా పార్లమెంట్ లో అడుగుపెట్టారో అలాగే ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన విజయమ్మ అసెంబ్లీలో అడుగు పెట్టి పార్టీకు రాజకీయ గుర్తింపు తెచ్చారు. అప్పట్లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భాంలో ఆమె ఇచ్చిన స్పీచ్ కూడా ఆకట్టుకుంది.

అయితే వైఎస్ విజయమ్మ పార్టీకి చాలా ఏళ్ళుగా అండగా ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకనే ఆమె తెర చాటుకు పరిమితం అయ్యారు. అయితే వైఎస్ షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టడంతో ఆమె కూతురు వైపుగా మళ్లారు. ఆమె 2022లో జరిగిన వైసీపీ ప్లీనరీలో అయితే కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ మరీ తన గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

తాను కుమార్తెకు తోడుగా ఉండేందుకే ఈ విధంగా చేస్తున్నాను అని చెప్పారు. ఆ విధంగా తెలంగాణలో ఆమె షర్మిలతో కలసి ప్రచారం నిర్వహించారు. అయితే షర్మిల తెలంగాణాలోని తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మారారు.

ఆ తరువాత కొంత న్యూట్రల్ గా విజయమ్మ కనిపించినా సరిగ్గా సార్వత్రిక ఎన్నికల సమయంలో కుమార్తెకు మద్దతుగా ఒక వీడియో క్లిప్ ని వదిలారు. తన కుమార్తెని గెలిపించాలని అందులో ప్రజలను కోరారు. అదే సమయంలో మిగిలిన చోట్ల వైసీపీని గెలిపించాలని ఎక్కడా ప్రస్తావించకపోవడం తో అది కూటమికి అడ్వాంటేజ్ గా మారింది. వైసీపీకి నష్టం కూడా చేసింది.

రాయలసీమ వ్యాప్తంగా వైసీపీ భారీగా దెబ్బ తినడానికి ఆ వీడియో క్లిప్ చేసిన చెడు ఎంతో అని కూడా వైసీపీ నేతలు అంతర్మధనం చెందుతున్నారు. ఇదిలా ఉంటే విజయమ్మ షర్మిల ఇద్దరూ వైసీపీకి చేటు చేశారు అని వైసీపీ సీనియర్ నేతలు తాజాగా ఆరోపణలు చేస్తున్నారు.

ఇలా వారు బాహాటం అయి ఇలా తమ అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టడం వెనక వైసీపీ అధినాయకత్వం ఆలోచనలు కూడా ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది. అయితే ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది అన్నదే వైసీపీ హై కమాండ్ ఆలోచనగా ఉంది విజయమ్మ న్యూట్రల్ గా ఉండడం కంటే అవసరం అయిన సందర్భాలలో కుమార్తె వైపే మొగ్గు చూపిస్తారు అన్నది తాజా ఎన్నికలలో తేలినందువల్ల ఆమెని కూడా రాజకీయ ప్రత్యర్ధి గానే చూస్తేనే తప్ప వైసీపీకి స్పష్టత రాదు అని అంటున్నారు.

వైసీపీ క్యాడర్ సైతం విజయమ్మ షర్మిలకు అనుకూలంగా స్టాండ్ తీసుకోవడాన్ని తప్పుపడుతున్నారు. దాంతో పాటు తల్లిని చెల్లెలుని జగన్ దూరం పెట్టారు అని గత కొంతకాలంగా వైసీపీ మీద విమర్శలు ఉండనే ఉన్నాయి. దాని ఫలితాలూ చూశారు. ఇంతకంటే వేరేగా వచ్చే నష్టం ఏమీ ఉండదని కూడా పార్టీ హై కమాండ్ భావిస్తోంది అని అంటున్నారు.

దాంతో ఇక మీద కుటుంబంలోని వారు ఎవరూ వైసీపీకి కావాల్సిన వారు కాదు అన్న మెసేజ్ ని పంపిస్తే అది జనంలోకి ఇపుడే వెళ్తుందని, రేపటి రోజున విజయమ్మ కుమార్తెకు అనుకూలంగా ప్రచారం చేసినా ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఉంటుందని వైసీపీ భావిస్తోందిట. మొత్తం మీద విజయమ్మను కూడా రాజకీయ ప్రత్యర్ధిగా వైసీపీ చూస్తుందని అంటున్నారు.

మరి వైఎస్సార్ ధర్మ పత్నిగా విజయమ్మకు ఒక గౌరవం అభిమానం జనంలో ఉన్నాయి. ఆమె కనుక రానున్న రోజులలో ఓపెన్ అయి కుమార్తె వెంట తిరిగి కాంగ్రెస్ ని గెలిపించండి అని పిలుపు ఇస్తే అది వైసీపీకి ఎంత మేరకు దెబ్బ తీస్తుంది అన్న చర్చ కూడా ఉంది. అయితే జగన్ సీఎం గా ప్రతిపక్ష నేతగా ఏమి చేసారు అన్న దాని మీదనే ఎపుడైనా జనాలు తీర్పు ఇస్తారని వారసత్వం చూసి కాదని పార్టీలో నేతల భావన అంటున్నారు. మొత్తానికి షర్మిలతో పాటు విజయమ్మను కూడా దూరం పెట్టాలని వైసీపీ అనుకుంటోందన్న ప్రచారం అయితే సాగుతోంది. అందులో భాగమే సీనియర్ నేతలు సంధిస్తున్న విమర్శలు అని అంటున్నారు.

Tags:    

Similar News