వైసీపీ నేర్పిన విద్యయే: జారుకుంటున్న నేతలు!
ఏపీలో చిత్తుగా ఓడిపోయిన వైసీపీ నుంచి పార్టీ నాయకులు మెల్లగా కాదు.. జోరుగానే జారుకుంటున్నారు. వరుస పెట్టి పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు
ఏపీలో చిత్తుగా ఓడిపోయిన వైసీపీ నుంచి పార్టీ నాయకులు మెల్లగా కాదు.. జోరుగానే జారుకుంటున్నారు. వరుస పెట్టి పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. వీరిలో ఏమీ పిల్ల నాయకులు.. చిల్లర నాయకులు లేరు. అందరూ పెద్ద తలకాయల దగ్గర పిల్ల తలకాయలుగా పనిచేసిన వారే కావడం. పట్టు మని పది రోజులు కూడా.. ఉండలేక పోతున్నారా? అంటే.. ఔననే చెప్పాలి. ఎన్నికల ఫలితం వచ్చి.. 15 రోజులు మాత్రమే అయింది. కానీ, ఈ ఇంతలోనే కీలక నేతల అనుచరులు జారుకుంటున్నారు.
తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు, వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వైవీ రామిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈయన త్వరలోనే సైకిల్ ఎక్కనున్నట్టు తెలుస్తోంది. ఇక, రాజమండ్రిలోనూ .. మాజీ ఎంపీ భరత్ రామ్ అనుచరుడు.. కూడా పార్టీ మారేందుకు రహస్య ప్రయత్నాలు చేసుకుంటున్నారు. గుంటూరు, చిత్తూరుల్లో అయితే.. ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అయితే.. ఇప్పటికిప్పుడు ఎవరూ బయట పడడం లేదు. అంతా లోపాయికారీగా చర్చలు చేస్తున్నారు.
వన్స్ ఈ చర్చలు ముగిస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలను పార్టీలోకి చేర్చుకునేలా టీడీపీ నేతలు కూడా.. ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. గుండుగుత్తగా ఒకేసారి వైసీపీ నుంచి నాయకులను చేర్చుకోవడం ద్వారా.. ఆ పార్టీని కోలుకోకుండా దెబ్బకొట్టాలనే వ్యూహం అధికార పక్షం వేయనుంది. ఇలా చేయడం ద్వారా.. వైసీపీకి మౌత్ పీస్‌లు లేకుండా చేయాలన్న ఆలోచన కూడా ఉంది. రాజకీయాల్లోఒ ఇవన్నీ కామన్. సో.. టీడీపీ చేసేది తప్పని ఎవరూ అనలేరు.
ఇలా ఎందుకు?
అయితే.. గత ఐదేళ్లలో ప్రధాన నేతల నుంచి అనుచరులుగా అంతో ఇంతో లబ్ధి పొందిన నాయకులు ఇప్పుడు సైకిల్ ఎక్కడానికి కారణం ఏంటి? అంటే.. వైసీపీ నేర్పిన విద్యయే అంటున్నారు. గతంలో టీడీపీలో ఉన్ననేతలను వైసీపీ కత్తి కట్టి మరీ తన పార్టీలోకి చేర్చుకుంది. ఇలా చేరవని వారి వ్యాపారాలు,ఇళ్లపై దాడులు చేసింది. అప్పట్లో చంద్రబాబు వీరికి అండగా ఉన్నారు. అయితే.. ఇప్పుడు టీడీపీ కూడా ఇదే బాట పడితే.. తమను ఆదుకునేందుకు జగన్ ముందుకు వస్తారన్న నమ్మకం వారిలో కనిపించడం లేదు. దీంతో వారు దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టేసుకుంటున్నారు.