యూట్యూబర్‌ ఫ్రీ గిఫ్టులు... రణరంగంగా న్యూయార్క్‌ వీధులు!

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని న్యూయార్క్‌ లో 21ఏళ్ల ఆన్‌ లైన్‌ ఇన్‌ ఫ్లుయెన్సర్‌ కై సీనట్.. మన్హటన్‌ యూనియన్‌ స్క్వేర్‌ పార్క్‌ లో లైవ్‌ స్ట్రీమింగ్‌ ఈవెంట్‌

Update: 2023-08-05 13:57 GMT

ఈమధ్యకాలంలో అభిమానులకు బహుమతులు ఇస్తానంటూ ఆన్ లైన్ ఇన్‌ ఫ్లుయెన్సర్స్ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇదే క్రమంలో అమెరికాలో అభిమానులకు బహుమతులు ఇవ్వాలనుకున్న ఒక ఇన్‌ ఫ్లుయెన్సర్ వల్ల న్యూయార్క్ వీధులు రణరంగంగా మారాయి. ఊహించని రీతిలో జనం పోగవ్వడంతో వ్యవహారం రసాబాసగా మారింది.

అవును... తన అభిమానులకు బహుమతులు ఇస్తానని ప్రకటించాడు ఒక ఆన్‌ లైన్ ఇన్‌ ఫ్లుయెన్సర్‌. అతడిచ్చే కానుకలు తీసుకునేందుకు వేలాది మంది ఒక్కసారిగా పోటెత్తడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే అల్లర్లు చెలరేగి పరిస్థితులు రణరంగంగా మారాయి. దీంతో సదరు ఇన్‌ ఫ్లుయెన్సర్‌ చిక్కుల్లో పడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని న్యూయార్క్‌ లో 21ఏళ్ల ఆన్‌ లైన్‌ ఇన్‌ ఫ్లుయెన్సర్‌ కై సీనట్.. మన్హటన్‌ యూనియన్‌ స్క్వేర్‌ పార్క్‌ లో లైవ్‌ స్ట్రీమింగ్‌ ఈవెంట్‌ చేయనున్నట్లు తన ఇన్‌ స్టా పేజీలో ఓ పోస్ట్‌ పెట్టాడు. ఈ కార్యక్రమంలో అభిమానులను నేరుగా కలుస్తానని.. వారికి ప్లే స్టేషన్‌ 5 గేమ్‌ కన్సోల్స్‌ సహా పలు గిఫ్ట్‌ లు ఇస్తానని ప్రకటించాడు.

ఈ ప్రకటనతో మన్హటన్‌ పార్క్‌ కు అతడి అభిమానులు పోటెత్తారు. సుమారు 2వేలకు పైగా యువత సీనట్‌ ను చూసేందుకు అక్కడకు వచ్చారు. దీంతో వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. వీరిని అదుపుచేసేందుకు పోలీసులు అక్కడకు చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఈ సమయంలో సీనట్‌ అభిమానుల్లో కొంతమంది పార్క్‌ వీధుల్లో వాహనాలను అడ్డగించి అల్లర్లకు పాల్పడగా.. మరికొంతమంది బాటిళ్లు విసరడం, కార్లను ధ్వంసం చేయడం వంటివి చేశారు. ఈ ఘర్షణల్లో పోలీసు అధికారుల సహా పలువురు గాయపడ్డారు. దీంతో అల్లర్లను ప్రేరేపించాడనే అభియోగంతో అతడిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

కాగా.. 21 ఏళ్ల సీనట్‌ ఓ పాపులర్‌ వీడియో క్రియేటర్‌. ట్విచ్ అనే లైవ్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ ఫామ్‌ లో అతడికి 65లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ అతడికి లక్షల్లో అభిమానులున్నారు.

Tags:    

Similar News