జగన్‌ను అందుకే ఇష్టపడుతున్నారట: ఈ విషయాలు తెలిస్తే.. !
ఎవరో ఏదో అనుకుంటారని.. మీడియా విమర్శించిందని.. శాపనార్థాలు పెట్టిందని కుంగిపోయే మనస్తత్వం కాదు
ఏపీ సీఎం జగన్‌పై ప్రతిపక్షాలు నిత్యం విమర్శలు చేస్తున్నాయి. ఆయన బాడీ నుంచి భాష వరకు అన్ని విషయాల్లోనూ తప్పుపడుతుంటాయి. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? జగన్ విషయంలో ప్రజల నాడి ఎలా ఉంది? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. దీనిపైనే ఆన్‌లైన్ చానెల్ ఒకటి సర్వే చేసింది. ''జగన్‌ను మీరు ఎందుకు ఇష్టపడుతున్నారు?'' అన్న ప్రశ్నను సంధించింది. దీనికి మెజారిటీ నెటిజన్లు.. ఆసక్తిగా స్పందించారు.
జగన్ పట్టుదల, చెప్పిన మాటకే నిలబడడం, ఎంత ఒత్తిడి ఎదురైనా.. తను తీసుకున్న నిర్ణయానికే కట్టు బడి ఉండడం.. వంటి విషయాలపై నెటిజన్లు స్పందించారు. ఇవే జగన్‌కు పెట్టని కోటలుగా ఉన్నాయని చెబుతున్నారు.
''ఏదో జరిగిపోయిందని.. దానిని చూసి భయపడే పరిస్థితి ఆయనకు లేదు. తాను అన్నీ ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకున్నాక.. దానికి కట్టుబడి ఉండే నాయకుడు ఆయన. ఈ విషయంలో ఇబ్బందులు వచ్చినా సరే.. లక్ష్యం సాధించేందుకే ఆయన ముందుకు సాగుతారు'' అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు.
''ఎవరో ఏదో అనుకుంటారని.. మీడియా విమర్శించిందని.. శాపనార్థాలు పెట్టిందని కుంగిపోయే మనస్తత్వం కాదు. ప్రజలకు ఎక్కడ ఎలా సాయ పడాలో ఆయనకు బాగా తెలుసు. ప్రలోభాలకు.. బెదిరింపులకు, బ్లాక్ మెయిలింగుకు లొంగకపోవడమే జగన్‌ను నాయకుడిగా నిలబెట్టింది'' అని మరో నెటిజన్ అన్నారు.
''బాబోయ్.. జగన్ ధైర్యం అంతా ఇంతా కాదు! సోనియానే ఎదిరించిన నాయకుడు. వైఎస్ వారసత్వాన్ని నిలబెట్టాడు'' అని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు.
అయితే.. అసలు ఈ సర్వే ఎందుకు పెట్టారంటే.. ప్రస్తుతం కొందరు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతామంటూ.. చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో అసలు జగన్ గురించి జనాలు ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యేల బెదిరింపులకు ఆయన లొంగుతారా? అనే నేపథ్యంలో ఈ సర్వే నిర్వహించారు. దీనిని చేపట్టిన రెండు గంటల్లోనే భారీ స్పందన రావడం గమనార్హం. మెజారిటీ నెటిజన్లు .. జగన్ ధైర్యానికి, పట్టుదలకు మార్కులు వేయగా.. మరికొందరు మాత్రం ధైర్యం.. పట్టుదల బాగానే ఉన్నా.. ప్రజల మధ్యకు రావాలి.. అని కామెంట్లు చేశారు.