జగన్ ఇంకా మారలేదా...భ్రమల్లోనేనా ?
కానీ వైసీపీ అధినాయకుడు మాత్రం తమ తప్పు ఏమీ లేనట్లుగానే ఈ రోజుకీ వ్యవహరిస్తున్నారు అని విమర్శలు వస్తున్నాయి.
వైసీపీ అధినేత జగన్ భ్రమల్లో ఉన్నారా అన్న చర్చ సాగుతోంది. ఆయన ఇంకా మారలేదా అన్న మాట కూడా వినిపిస్తోంది. భారీ ఓటమి వైసీపీకి సంభవించింది. మరొకరు అయితే లోపాలు ఏమి ఉన్నాయని వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ వైసీపీ అధినాయకుడు మాత్రం తమ తప్పు ఏమీ లేనట్లుగానే ఈ రోజుకీ వ్యవహరిస్తున్నారు అని విమర్శలు వస్తున్నాయి.
వైసీపీ తప్పులు లేకపోతే ల్యాండ్ స్లైడ్ విక్టరీ టీడీపీ కూటమికి ఎలా వస్తుంది అన్నది జగన్ ఆలోచించారా అన్నది కూడా అంతా అంటున్న పరిస్థితి. పార్టీ సమావేశంలో తాజాగా జగన్ చేసిన కొన్ని కామెంట్స్ పార్టీ నేతలకే షాకింగ్ గా మారుతున్నాయని అంటున్నారు. ఇంకా ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు వారాలు కాలేదు. కొత్త ప్రభుత్వం గద్దెనెక్కి పది రోజులు కూడా కాలేదు.
కానీ జగన్ మాత్రం 2029 ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబుకు ఆయన పార్టీకి సింగిల్ డిజిట్ వచ్చే చాన్స్ లేదని కూడా జోస్యాలు చేబుతున్నారు. నిజంగా ఇది ఆశ్చర్యకరమైన విశ్లేషణగా అంతా చూస్తున్నారు. లేకపోతే నిండా అయిదేళ్ల పాలన కూటమి చేయాల్సి ఉంది. ప్రజలు మాండేట్ ఇచ్చారు. దాని ప్రకారం ప్రభుత్వం పనిచేస్తుంది.
జగన్ మాత్రం తాము ప్రజలకు మేలు చేసామని సంక్షేమ పధకాలను వల్లె వేస్తున్నారు. ఆ హామీలను బాబు అమలు చేయలేరని అందుకే జనాలు ఓడిస్తారు అని జగన్ భావిస్తున్నారు. మరి అదే నిజమైతే సంక్షేమ పథకాలు బాగా అమలు చేసిన జగన్ ని ఎందుకు మాజీ సీఎం గా చేశారు అన్నది ఆయన ఆత్మ పరిశీలన చేసుకున్నారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
తాము అబద్ధాలు చెప్పను ఉన్న మాటే చెబుతాను అని నిజయతీ విశ్వసనీయత అని జగన్ మాట్లాడుతున్నారు. ప్రజలు కూడా అదే చూస్తున్నారు. విశ్వసనీయత పాలనలో చూస్తారు. అది సంక్షేమం అన్న ఒక్క దానిలోనే చూడరు కదా అని అంటున్నారు. అభివృద్ధి విషయంలో జగన్ కంటే చంద్రబాబు బెటర్ అని అంతా ఒప్పుకునే మాటే.
చంద్రబాబుకు అయిదేళ్ళ కాలం ఉంది. పోలవరం అమరావతి రెండూ పూర్తి చేసి సంక్షేమం విషయంలో తాను చేయాల్సింది చేస్తే మరోసారి ఆయన్ని కాదని ప్రజలు వైసీపీకి ఓటు వేస్తారా అన్నది కూడా చూసుకోవాలి. జగన్ ఎంతసేపూ ఒక గిరి గీసుకుని తాను చేసిందే అభివృద్ధి అన్న భ్రమలలో ఉన్నారని అంటున్నారు. ఆయన మార్క్ అభివృద్ధి అంటే గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, నాడు నేడు కింద పాఠశాలలు, ఆసుపత్రులు అయి ఉండొచ్చు.
కానీ లార్జ్ స్కేల్ లో డెవలప్మెంట్ లేకపోతే ఏ స్టేట్ అయినా ముందుకు ఎలా వెళ్తుంది అన్న ఆలోచన అయిదేళ్ళు సీఎం గా చేసినా జగన్ రావడం లేదా అన్న సాగుతోంది. అమరావతిని పాడుపెట్టారని మిగిలిన రెండు ప్రాంతాలకు కేవలం ఆశలు కల్పించి మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారనే జనాలు ఓడించారు అని అంటున్నారు. ఉపాధికి కావాల్సింది పరిశ్రమలు రావడం. ఆ విధంగా చూసుకుంటే పెద్ద పరిశ్రమలు పెట్టుబడులు జగన్ ఏలుబడిలో రాలేదు కదా అని ఎత్తి చూపిస్తున్నారు.
పోలవరం వైఎస్సార్ కల. అలాంటి దానిని జగన్ ఎలా పూర్తి చేయాలి. సంక్షేమం కోసం రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్న జగన్ అందులో కనీసం యాభై వేల కోట్లు తీసి పక్కన పెడితే ఈ స్థాయి పరాజయం పొందేవారా అన్న చర్చ కూడా సాగుతోంది. జగన్ తాను ఎందుకు ఓటమి చెందాను అన్నది ఈ రోజుకీ తెలుసుకోలేకపోతున్నారు అని అంటున్నారు.
తన పాలనలో వైసీపీకి క్యాడర్ లేకుండా చేసుకుని ఎమ్మెల్యేలకు కనీసం విలువ ఇవ్వకుండా చేసుకుని జగన్ పార్టీ పరంగా కూడా చాలా నష్టాలు చేసుకున్నారని అంటున్నారు. ఈ కోణంలో కూడా ఆయన ఆలోచించలేకపోతున్నారు అని అంటున్నారు.
అదే టైంలో ఆయన చంద్రబాబు సింగిల్ డిజిట్ తో ఓడుతారు అని అక్కసు వెళ్లగక్కుతున్నారని అంటున్నారు. జనాలు ఇలాంటి ప్రకటనలను చూసి ఇంకా నిరాదరిస్తారు అని ఎందుకు గుర్తించలేకపోతున్నారు అన్నదే ప్రశ్న. చంద్రబాబు అనుభవశాలి. ఆయన నాలుగోసారి సీఎం అయ్యారు. ఈ చాన్స్ ఆయన అసలు వదులుకోరు.
బాబు తప్పులు చేస్తే తాము లబ్ది పొందుతామని జగన్ వేసుకుంటున్న ప్లాన్స్ కానీ ఆలోచనలు కానీ తప్పు అని అంటున్నారు. ఒకవేళ టీడీపీ తప్పులు చేస్తే జనాలు ఆ పార్టీని ఓడించాలనుకుంటే వైసీపీకే ఎందుకు ఓటేయాలి. ఈ ప్రశ్నలకు జగన్ దగ్గర జవాబులు ఉంటే కనుక ఆయన ఇస్తున్న స్టేట్మెంట్స్ గురించి ఆలోచించుకోవచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ భ్రమలలో ఉన్నారనే అంటున్నారు అంతా.